ముత్య‌పు పందిరి వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు

|

Sep 21, 2020 | 10:26 PM

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన సోమ‌వారం రాత్రి 7 గంట‌లకు శ్రీ‌వారి ఆల‌యంలోని కళ్యాణోత్సవ ‌ మండ‌పంలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు కాళీయ‌మ‌ర్ధ‌న చిన్నికృష్ణుడి అలంకారంలో ముత్య‌పుపందిరి వాహనంపై దర్శనమిచ్చారు...

ముత్య‌పు పందిరి వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు
Follow us on

భూలోక వైకుంఠం తిరుమల క్షేత్రంలో వెలసిన శ్రీనివాసుడు బ్రహ్మదేవుడిని పిలిచి జగత్కల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. ఆ ప్రకారం బ్రహ్మదేవుడు శ్రవణ నక్షత్రం నాటికి పూర్తయ్యే విధంగా తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారట. తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలను నిర్వహించడం వల్ల అవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయి. దసరా నవరాత్రులు, కన్యామాసం (ఆశ్వయుజం)లో వేంకటేశ్వరుడు అర్చామూర్తిగా ఆవిర్భవించిన శ్రవణ నక్షత్రం శుభ ముహూర్తాన చక్రస్నానం నాటికి తొమ్మిది రోజుల ముందు ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించటం అనాదిగా వస్తున్న ఆచారం.

అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు సోమవారం ఉదయం సింహవాహనంపై యోగ ముద్రంకిత స్వరూపంలో మలయప్పస్వామి భక్తులకు ఏకాంతంగా దర్శనం ఇచ్చారు.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన సోమ‌వారం రాత్రి 7 గంట‌లకు శ్రీ‌వారి ఆల‌యంలోని కళ్యాణోత్సవ ‌ మండ‌పంలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు కాళీయ‌మ‌ర్ధ‌న చిన్నికృష్ణుడి అలంకారంలో ముత్య‌పుపందిరి వాహనంపై దర్శనమిచ్చారు.

ముత్యాల నిర్మల కాంతులు వ్యాపించడానికి, ఆ కాంతులు దర్శించి భక్తులు ముక్తులు కావడానికి రాత్రి వేళ అనుకూలం. అందుకే శ్రీమలయప్పకు మూడోరోజు రాత్రి మొదటియామంలో ముత్యాల పందిరిలో కూర్చొని విహరించే కైంకర్యాన్ని పెద్దలు నిర్ణయించారు. ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి ఆత్మ ఎన్నో జన్మల అనంతరం విశ్వలోకాల నుండి రాలి, దుర్లభమైన మానవజన్మను సంతరించుకుంటుంది. శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణచక్రం నుండి విడుదలై మోక్షాన్ని పొందుతుంది.