ఇవాళ తెలంగాణ కేబినెట్‌ భేటీ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

|

Nov 13, 2020 | 3:29 PM

దుబ్బాక హోరాహోరీ పోరులో ఓటమి చవిచూసిన టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం దిద్దుబాటు చర్యల్ని చేపట్టింది. ఈ ఫలితాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రేటర్‌ ఎన్నికల్లో ముందుకెళ్లే వ్యూహాల్ని రచిస్తోంది టీఆర్‌ఎస్‌

ఇవాళ  తెలంగాణ కేబినెట్‌ భేటీ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
Follow us on

దుబ్బాక హోరాహోరీ పోరులో ఓటమి చవిచూసిన టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం దిద్దుబాటు చర్యల్ని చేపట్టింది. స్వల్ప ఓట్లతో ఓడినా దుబ్బాక ఫలితంపై సమీక్షలు జరుపుతోంది. దుబ్బాక ఫలితాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రేటర్‌ ఎన్నికల్లో ముందుకెళ్లే వ్యూహాల్ని రచిస్తోంది టీఆర్‌ఎస్‌. ఇందులో భాగంగానే నేడు కేబినెట్‌ భేటీకి రెడీ అయ్యారు గులాబీ బాస్‌. తెలంగాణ కేబినెట్‌ నేడు భేటీ కాబోతోంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. ప్రగతిభవన్‌లో జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి.. కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశముంది. అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన పలు కార్యక్రమాలపై మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలిపే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

గ్రేటర్‌ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో తెలంగాణ కేబినెట్‌ భేటీ జరుగుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒక వైపు దుబ్బాక ఫలితం, మరోవైపు గ్రేటర్‌ ఎన్నికల వేళ నిర్వహిస్తున్న ఈ భేటీకి ప్రాముఖ్యం ఏర్పడింది. జీహెచ్ఎంసీలో ఏమైనా వరాలు ప్రకటిస్తారా అన్న దానిపై చర్చ జరుగుతోంది. ఇటు దుబ్బాక ఓటమిపై సీఎం కేసీఆర్‌, ముఖ్యనేతలతో ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. గ్రేటర్‌ ఎన్నికల్ని ముందస్తుగానే నిర్వహించాలన్న యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. దుబ్బాకలో గెలిచి సవాల్‌ విసురుతున్న బీజేపీకి గ్రేటర్‌లో నిలదొక్కుకొనే అవకాశమివ్వకూడదన్న ఆలోచనలో సీఎం కేసీఆర్‌ ఉన్నట్టు తెలుస్తోంది. అభ్యర్థుల ఖరారు.. వ్యూహాల రచనకు కమలదళానికి ఎటువంటి సమయం ఇవ్వకుండా ముందుకెళ్లాలన్న భావనలో కేసీఆర్‌ ఉన్నట్టు స్పష్టమవుతోంది.