కమలంలో కలవరం పుట్టిస్తున్న గులాబీ వ్యూహం

|

Dec 31, 2019 | 8:20 AM

తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో విజయదుందుబి మోగిస్తామంటూ జోరుగా ప్రకటనలు చేస్తున్న కమలదళంలో టిఆర్ఎస్-ఎంఐఎం బంధం కలవరం పుట్టిస్తోందా? నిజామాబాద్‌లో డిసెంబర్ 27న జరగనున్న బహిరంగ సభ తర్వాత మునిసిపల్ ఎన్నికల ప్రచార పర్వాన్ని ప్రారంభించనున్న గులాబీ పార్టీకి తెలంగాణవ్యాప్తంగా ముస్లింల ఓట్లు పోటెత్తుతాయని కమల నాథులు ఆందోళన చెందుతున్నారా? పరిస్థితి చూస్తే అలాగే వుందంటున్నారు పరిశీలకులు. తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల నగారా మోగింది. జనవరి 22న పోలింగ్, 25న ఓట్ల లెక్కింపు జరగనుంది. పోలింగ్‌కు ఇక మిగిలింది […]

కమలంలో కలవరం పుట్టిస్తున్న గులాబీ వ్యూహం
Follow us on

తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో విజయదుందుబి మోగిస్తామంటూ జోరుగా ప్రకటనలు చేస్తున్న కమలదళంలో టిఆర్ఎస్-ఎంఐఎం బంధం కలవరం పుట్టిస్తోందా? నిజామాబాద్‌లో డిసెంబర్ 27న జరగనున్న బహిరంగ సభ తర్వాత మునిసిపల్ ఎన్నికల ప్రచార పర్వాన్ని ప్రారంభించనున్న గులాబీ పార్టీకి తెలంగాణవ్యాప్తంగా ముస్లింల ఓట్లు పోటెత్తుతాయని కమల నాథులు ఆందోళన చెందుతున్నారా? పరిస్థితి చూస్తే అలాగే వుందంటున్నారు పరిశీలకులు.

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల నగారా మోగింది. జనవరి 22న పోలింగ్, 25న ఓట్ల లెక్కింపు జరగనుంది. పోలింగ్‌కు ఇక మిగిలింది కేవలం 25 రోజులే కావడంతో అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను జిల్లా కమిటీలకు అప్పగించిన బిజెపి రాష్ట్ర నాయకత్వం ప్రచార పర్వంపై దృష్టి సారించింది.

అయితే, ఎన్నార్సీపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో రాజకీయ మద్దతును కూడగడుతున్న ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. బుధవారం గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కే.సీ.ఆర్.తో భేటీ అయ్యారు. పలువురు ముస్లిం మత పెద్దలతో కలిసి సీఎంతో సమావేశమైన ఓవైసీ డిసెంబర్ 27న నిజామాబాద్‌లో నిర్వహించనున్న ఎన్నార్సీ వ్యతిరేక సభకు మద్దతు తెలపాల్సిందిగా కోరారు. దాంతో టిఆర్ఎస్ పార్టీ తరపున పలువురు మంత్రులను సభకు పంపాలని కేసీఆర్ నిర్ణయించారు.

ఎన్నార్సీని పార్లమెంటు వేదికగా టిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించింది. అందువల్ల నిజామాబాద్ సభలో పాల్గొని మరోసారి పార్టీ స్టాండ్ ప్రకటించాల్సిన అవసరం లేదు గులాబీ దళానికి. కానీ, మునిసిపల్ ఎన్నికలకు రంగం సిద్దమైన తరుణంలో ఎంఐఎం సభకు హాజరవడం ద్వారా ముస్లింలకు మునిసిపల్ సందేశాన్ని పంపొచ్చన్న వ్యూహంతోనే కేసీఆర్. గులాబీ మంత్రులను నిజామాబాద్ సభకు పంపాలని నిర్ణయించినట్లు చెప్పుకుంటున్నారు.

ఉమ్మడి వేదిక నుంచి ఎంఐఎం, టిఆర్ఎస్ నేతలు చేసే ప్రసంగాలతో రెండు పార్టీల మధ్య ఫ్రెండ్షిప్‌పై స్పష్టమైన సందేశాన్ని మునిసిపల్ ఓటర్లకు పంపినట్లవుతుందన్నది గులాబీ బాస్ వ్యూహం. కేసీఆర్ వ్యూహాన్ని అంచనా వేసిన కమలనాథుల్లో కలవరం మొదలైనట్లు సమాచారం. మునిసిపాలిటీల్లో ముస్లిం ఓట్లు గంపగుత్తగా టిఆర్ఎస్‌కు షిఫ్టు అయితే.. ఆ పార్టీ విజయాన్ని అడ్డుకోవడం కష్టమని బిజెపి నేతలు చెప్పుకుంటున్నారు. అయితే.. దీనికి తగిన ప్రతివ్యూహం తమ దగ్గర రెడీగా వుందని మరో వర్గం బిజెపి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.