తెలంగాణలో మారనున్న అగ్రి‘కల్చర్’… కీలక మార్పులు ఇవే

|

May 14, 2020 | 7:56 PM

తెలంగాణ రాష్ట్రంలో అగ్రికల్చర్ కొత్త రూపును సంతరించుకోబోతోంది. గత ఆరేళ్ళలో కనీవినీ ఎరుగని స్థాయిలో సాగునీటి రంగంలో ప్రాజెక్టుల నిర్మాణం జరిగినందున...

తెలంగాణలో మారనున్న అగ్రి‘కల్చర్’... కీలక మార్పులు ఇవే
Follow us on

Agriculture sector to shape up new dimension in Telangana state:  తెలంగాణ రాష్ట్రంలో అగ్రికల్చర్ కొత్త రూపును సంతరించుకోబోతోంది. గత ఆరేళ్ళలో కనీవినీ ఎరుగని స్థాయిలో సాగునీటి రంగంలో ప్రాజెక్టుల నిర్మాణం జరిగినందున… ఆ నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా రాష్ట్రంలో వ్యవసాయ విధానాలను సమూలంగా మార్చాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు తలపెట్టారు. దానికి అనుగుణంగా ఇకపై రైతులు తమ తమ భూముల్లో ఏ ఏ పంట వేయాలనే విషయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్దేశించబోతోంది.

దేశవ్యాప్తంగా గతేడాది విస్తారంగా వర్షాలు కురిశాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఈ వర్షాలు ఎంతో మేలును చేశాయి. అటు కృష్ణా.. ఇటు గోదావరి నదులు పొంగి పొర్లడంతో.. రెండు వైపులా ప్రాజెక్టులు నిండుకుండలను తలపించాయి. వర్షాధారిత పంటలు వేసిన రైతులకు చక్కని దిగుబడి కూడా లభించింది. మూడు పంటలకు సరిపడా నీరు లభించింది. రాష్ట్రంలో అద్భుత దిగుబడి రావడంతో.. అటు రైతులు ఇటు ప్రభుత్వం కూడా ఆనందంలో మునిగిపోయింది.

అయితే ఇక్కడే కొత్త సమస్య వచ్చిపడింది. ఎక్కువ మంది రైతులు ఒకేరకమైన పంట వేయడంతో.. గిట్టుబాటు ధర దగ్గర సమస్యలు మొదలయ్యాయి. ఎప్పుడైనా మార్కెట్లో డిమాండ్‌ అధికంగా ఉండి.. సప్లై కూడా అదే విధంగా చేస్తే ఆ పంటలకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుంది. కాని డిమాండ్‌ కన్నా.. అధికంగా పంటను ఉత్పత్తి చేస్తే.. గిట్టుబాటు ధర లభించే అవకాశాలు చాలా తక్కువగా వుంటాయి.

ఇలాంటి సమస్యలు ఎదురుకాకుండా ప్రభుత్వమే రైతులకు ఏయే పంటలు ఎంత మోతాదులో వేయాలనేది సూచించాలని నిర్ణయించింది. ఈ విధానం గతంలోనూ వున్నా.. ఇపుడు ప్రభుత్వ సూచన మాండేటరీ కాబోతోంది. దీని ద్వారా రైతులకు గిట్టుబాటు లభించడమే కాకుండా.. వివిధ రకాల పంటలతో భూసారం కూడా పెరుగుతుంది. అటు రైతులకు అధిక మేలు జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది.

తెలంగాణను దేశానికే ధాన్యాగారంగా చేయాలనేది సీఎం కేసీఆర్‌ కల. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుతో.. సూర్యాపేట జిల్లా వరకు నీటిని తీసుకెళ్లి.. రైతులు వేసిన పంటలకు అందించారు. అదే స్థాయిలో పంట దిగుబడి కూడా వచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా సమగ్ర వ్యవసాయ విధానానికి రూపకల్పన చేస్తున్నారు సీఎం కేసీఆర్‌. ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా, మార్కెట్లో డిమాండ్‌ ఉండే పంటలు పండించే విధంగా రైతుల దృక్పథంలో మార్పు తీసుకొనిరావాలని భావిస్తున్నారు.

త్వరలోనే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రైతులు, రైతుబంధు సమితులు, వ్యవసాయాధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడబోతున్నారు. తెలంగాణలో వ్యవసాయం ఎలా ఉండాలి.. ఎక్కడ ఏ పంటలు పండించాలి.. ఎంత విస్తీర్ణంలో పండించాలి… అనే ముఖ్యమైన అంశాలను చర్చించనున్నారు. దీనిద్వారా తెలంగాణలో అనేకరకాల పంటలు.. అధిక దిగుబడి సాధించేవిధంగా వారిని ప్రోత్సహించనున్నారు.