తెలుగు సినీ పరిశ్రమలో ఆయనో సాహసి. కదిలే బొమ్మలను మరింత వేగంగా కదిలించిన ఘనుడు. టన్నుల కొద్దీ గుండె ధైర్యం ఉన్నవాడు.. అపజయాలకు వెరవని ధీరోధాత్తుడు….విజయాలను పొంగిపోని వినమ్రుడు. హీరోకు అచ్చమైన నిర్వచనం. ఆయనో జేమ్స్‌బాండ్. ఆయనో గూఢచారి. ఆయనో కౌబాయ్. మోసగాళ్లకు మోసగాడు. మంచివాళ్లకు మంచివాడు. అసాధ్యుడు. అఖండుడు. అనితర సాధ్యుడు. ఆయనే సూపర్‌స్టార్ కృష్ణ. మే 31 ఆయన పుట్టిన రోజు… అభిమానులందరికీ పండుగ రోజు!
మనిషి జీవితంలో ఆటుపోట్లు, ఉత్థాన పతనాలు సహజం. ఆనంద విషాదాలు అత్యంత సహజం. ఆశ నిరాశల దాగుడు మూతలు అనివార్యం. వీటన్నంటినీ ఎదుర్కొని నిలవగలవాడే సాహసి. ఈ గుణగణాలన్నీ వున్నాయి కాబట్టే కృష్ణ సాహసి అయ్యాడు. సాహసాన్ని మారుపేరుగా మార్చుకున్నాడా పద్మభూషణుడు. ఎన్టీయార్, ఎఎన్‌ఆర్‌ల తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను సంపాదించిన సెకండ్ జనరేషన్ హీరో కృష్ణ. అది ఒక్క కృష్ణకే సాధ్యమయ్యింది.. ఆయనది ఓ డిఫరెంట్ స్టయిల్. ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్ తర్వాత వచ్చిన హీరోలంతా అటు రామారావునో, ఇటు నాగేశ్వరరావునో అనుకరించేవారు. కృష్ణ అలా కాదు.. సపరేట్ రూట్‌ను ఎంచుకున్నారు. పక్కా మాస్ హీరో.. సినిమాల్లో రావడానికి అందరిలాగే కృష్ణ కూడా చాలా కష్టపడ్డారు. పదండి ముందుకు సినిమాతో తెరపై చమక్కున మెరిసి, కులగోత్రాలు…పరువు ప్రతిష్ట వంటి సినిమాల్లో కనీ కనబడని వేషాలు వేసి…తేనెమనసులుతో ఏకంగా హీరో అయిపోయారు. కృష్ణ కేవలం సోషల్ మూవీలకే పరిమితమై ఉంటే ఆయనకు ఈ స్టార్‌డమ్ దక్కి ఉండేది కాదు. ఆయన అదృష్టమేమిటంటే మూడో సినిమానే గూఢచారి 116 కావడం. ఆ సినిమాతోనే యూత్‌లో క్రేజ్ సంపాదించారు.. ఆ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూస్తే ఒట్టు.
తెలుగులో మొట్టమొదటి రంగుల్లో అది కూడా ఈస్ట్‌మన్‌కలర్‌లో తీసిన సాంఘిక చిత్రం తేనె మనసులే! అందులో హీరో కృష్ణే…తెలుగు సినిమాల్లో మొట్టమొదటిసారిగా గూఢచారిని పరిచయం చేసిందీ కృష్ణనే! కౌబాయ్ కూడా ఆయనే! కలర్ స్కోపును తెచ్చిందీ ఆయనే! సెవంటీ ఎం ఎంను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది కూడా కృష్ణే! ఇంకా చాలా చాలా చేశారు.. కృష్ణ పూనుకున్నారు కాబట్టే తెలుగు సినిమాకు ఒక రిచ్‌నెస్ వచ్చింది. ఖర్చుకు వెనుకాడకుండా భారీ సినిమాలు తీయడం ఆయనకు అలవాటు. లేటెస్ట్ టెక్నాలజీని ఎప్పటికప్పుడు తెలుగువాళ్లకు అందించాలన్న తపన ఆయనది. స్టార్‌డమ్ అనేది ఒక్క రోజులో రాదు. దానికి చాలా కష్టపడాలి… కృష్ణ అదృష్టమేమిటో కానీ…మూడో సినిమాతోనే కృష్ణ మాస్‌కి దగ్గరయ్యాడు. అదలా కంటిన్యూ చేస్తూనే వచ్చారు.. ఇప్పటికీ కృష్ణకు లక్షలాది మంది అభిమానులున్నారు. స్టార్ కావడం ఈజీనే! స్టార్‌డమ్‌ను సాధించడమే కష్టం. హీరోలు చాలా మంది వుంటారు. చాలా కాలం హీరోగానే వుండటమనేది కొద్ది మందికే సాధ్యం… అందులో కృష్ణ ఒకరు. తెలుగు సినిమాలకు డిష్యూం డిష్యూం నేర్పింది కృష్ణే… తెలుగు సినిమాల్లో పిస్టోలు ఢాం ఢాంలను తీసుకొచ్చింది కృష్ణనే!
కృష్ణది గుంటూరు జిల్లా తెనాలి తాలూకా బుర్రిపాలెం..ఘట్టమనేని రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మలకు 1943, మే 31న జన్మించారు. ఐదుగురు సంతానంలో కృష్ణే పెద్దవారు. కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణ. సినిమాల్లోకి వచ్చాకే కృష్ణ అయ్యారు. కృష్ణ బాల్యమంతా తెనాలిలోనే గడిచింది. పదో తరగతి వరకు అక్కడే చదివారు. ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజిలో బీఎస్సీ పూర్తి చేశారు. మురళీమోహన్, క్రాంతి కుమార్‌లు అప్పుడాయనకు రూమ్‌మెట్స్. డిగ్రీ అయిందో లేదో కృష్ణకు పెళ్లి కూడా చేసేశారు తల్లిదండ్రులు. 19వ ఏట ఇందిరాదేవితో కృష్ణకు వివాహమైంది. సినిమాల విషయానికి వస్తే తెనాలి రత్న టాకీస్‌లో పాతాళభైరవి సినిమా చూసాకే కృష్ణకు సినిమాలపై మోజు కలిగింది. ఎన్టీయార్‌పై అభిమానం పెంచుకున్నారు. ఆయన మనసు సినిమా రంగంపైపుకు లాగింది. ఇంట్లో చెప్పేశారు. తండ్రి ప్రోత్సాహం కూడా దొరికింది. అంతే…మద్రాస్ బండెక్కేశారు. తిన్నగా నిర్మాత చక్రపాణి దగ్గరకెళ్లారు. చక్రపాణి కృష్ణను ఎగాదిగా చూసి….బాగున్నావయ్యా.., కానీ నీ వయసు 19 ఏళ్లే అంటున్నావు.. ఇంత చిన్న వయసులో హీరో కావడం కష్టం.. రామారావును మేము షావుకారులో బుక్ చేసినప్పుడు ఆయన వయసు 28. కాబట్టి కొంత కాలం వెయిట్ చేయి… అని చెబుతూ…. ఎలాగూ ఇంత దూరం వచ్చావు కాబట్టి ఓసారి రామారావునూ చూద్దూ కాని పద అంటూ పొన్నలూరి బ్రదర్స్ స్టూడియోకి తీసుకెళ్లారు. అక్కడ ఎన్టీయార్‌ది ఏదో జానపద సినిమా షూటింగ్ జరుగుతుంది. ఫస్ట్‌టైమ్ రామారావును చూసి థ్రిల్లయారు కృష్ణ…చక్రపాణి ఎన్టీయార్‌కు పరిచయం చేసి విషయమంతా చెప్పాడు… ఆయనదీ అదే మాట…మీరు చాలా యంగ్‌గా వున్నారు బ్రదర్…మీరు కొంత కాలం ఆగితే బాగుంటుంది…అయితే ఈ లోపల టైమ్ వేస్ట్ చేసుకోకుండా నాటకాలు గట్రాలు వేస్తూ వుండండి…అనుభవం వస్తుంది.. పర్సనాలిటీ పెరుగుతుంది అని కృష్ణకు సలహా ఇచ్చారు రామారావు. ఎన్టీయార్ సలహా పాటించి కృష్ణ నాటకాలు వేయడం మొదలు పెట్టారు.
నాటకాలు వేస్తుండగానే ఎల్‌వి ప్రసాద్ నుంచి పిలుపొచ్చింది. కొడుకులు కోడళ్లు అనే సినిమా తీస్తున్నాం…వెంటనే బయలు దేరమన్నది సారాంశం..సినిమా కోసం బాలయ్య, రమణమూర్తి, శోభన్‌బాబు ఆల్‌రెడీ బుక్ అయ్యారు. హీరోగా ఎంట్రీ ఇద్దామనుకుంటే వన్ ఆఫ్ ది హీరోస్‌గా చిన్న వేషం ఇస్తామనడం కృష్ణకు ఒకింత బాధకలిగించినా…ఫస్ట్ ఆఫర్ కాబట్టి ఒప్పేసుకున్నారు. వెంటనే మద్రాస్‌లో వాలిపోయాడు. సినిమా కోసం నెల రోజుల పాటు రిహార్సల్స్ చేశారు. ఎందుకో సినిమా ఆగిపోయింది. నలుగురిలో మిగితా ముగ్గరు మాత్రం అప్పటికీ సినిమాల్లో నటిస్తున్నారు. కృష్ణకు నిరాశేసింది. అయినా ఆత్మ విశ్వాసం మాత్రం సడల్లేదు. అక్కడే వుంటూ రెండు మూడు సినిమాల్లో చిన్న వేషాలేశారు. అంతలో తేనె మనసులు సినిమాలో హీరో అవకాశం లభించింది.
ఫస్ట్ పిక్చర్ హిట్టయినా కృష్ణకేమీ ఆఫర్ల మీద ఆఫర్లు రాలేదు. తెనాలి వెళ్లిపోయి ఆరునెలలు హాయిగా విశ్రాంతి తీసుకున్నాడు. ఈ లోపు ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం రెండో సినిమా కన్నెమనసులు షూటింగ్ మొదలైంది. నెలరోజులు గడవక ముందే ఓ రోజు ఆదుర్తి సుబ్బారావు కృష్ణను పిలిచి… డూండీ ఏదో కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నారట… నిన్నే హీరోగా తీసుకోవాలనుకుంటున్నాడట… ఓసారి వెళ్లి కలువు.. అని చెప్పాడు. వెళ్లి కలిసారు కృష్ణ… అలా గూఢచారి 116లో హీరో అయ్యారు కృష్ణ…కన్నెమనసులు…గూఢచారి 116 సినిమాలు రెండు వారాల తేడాతో విడుదలయ్యాయి. కన్నెమనసులు యావరెజ్‌గా పోయింది. గూఢచారి 116 మాత్రం సూపర్ డూపర్ హిట్టయింది. అప్పటి వరకు ఎన్‌టిఆర్, ఎ ఎన్ ఆర్ సినిమాలు మాత్రమే బిసి సెంటర్లలో బాగా ఆడేవి. కృష్ణకు మాత్రం మూడో సినిమాకే మాస్ ఇమేజ్ వచ్చేసింది. ఈ సినిమా సిఐడి 116గా తమిళంలో డబ్ అయింది. అక్కడ కూడా బాగా ఆడింది. ఓవర్‌నైటే కృష్ణకు స్టార్‌డమ్ వచ్చింది. దాదాపు 20 మంది నిర్మాతలు కృష్ణను బుక్ చేయడానికి ముందుకొచ్చారు. ఎవరికి ఏ సినిమా ఎందుకు చేస్తున్నాడో కూడా తెలియనంత బిజీ అయ్యాడు.
భేషజం లేని మనిషి కృష్ణ….అందుకే అన్నేసి మల్టీస్టారర్ సినిమాలు చేయగలిగాడు. నొప్పింపక తానొవ్వక ఇండ్రస్టీలో మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నాడు. దాదాపు అగ్రశ్రేణి దర్శకులందరి సినిమాల్లోనూ చేసిన నటుడాయన. కీర్తి కండూతి లేని సహృదయుడు. ఆయనతో సినిమాలు తీసిన నిర్మాతలెవ్వరూ నష్టపోలేదు. తొలిచిత్రం హిట్టయినా.. మూడో చిత్రం గూఢచారి 116 ఇచ్చిన సక్సెస్ కృష్ణకి ఎంతో ఆనందాన్నిచ్చింది. తరవాత కాంతారావుతో కలిసి ఇద్దరుమొనగాళ్లు చేశారు. తొలిచిత్రంలో రాంమోహన్‌తో కలిసి నటించారు కృష్ణ. అయితే అప్పటికి స్టార్ ఇమేజ్ లేదు. కాబట్టి.. అది మల్టిస్టారర్ చిత్రంగా లెక్కకు రాదు. తరవాత కాలంలో ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్, శోభన్‌బాబు, కృష్ణంరాజు, చిరంజీవి… ఇలా అందరితో కలిసి కృష్ణ ఎన్నో మల్టిస్టారర్ చిత్రాల్లో చేశాడు. అయితే కృష్ణ చేసిన మొదటి మల్టిస్టారర్ చిత్రంగా ఇద్దరు మొనగాళ్లు నిలిచిపోతుంది.
తరవాతి చిత్రం బాపు డైరెక్షన్లో సాక్షి. విజయనిర్మలతో మొదటిసారి కాంబినేషన్. అప్పుడు మొదలైన ఆ కాంబినేషన్ దశాబ్దాల తరబడి సాగింది. యాభై చిత్రాల్లో ఇద్దరూ కలిసి నటించారు. వాటిలో ముప్ఫై చిత్రాలు విజయనిర్మల దర్శకత్వంలో వచ్చినవే. పులిదిండిలో సాక్షి షూటింగ్ జరిగినప్పుడు… అక్కడ ఉన్న మీసాల కృష్ణుడి గుళ్లో కృష్ణ, విజయనిర్మలల పెళ్లిసీన్ తీశారు. ఈ టైమ్‌లోనే ఓ తమాషా జరిగింది. షూటింగ్ టైమ్‌లో హాస్యనటుడు రాజబాబు , ఆ గుడి గురించి చెబుతూ… ఇది చాలా పవర్‌ఫుల్ గుడి. ఇక్కడ సినిమా పెళ్లి జరిగింది కానీ తొందరలోనే మీకు నిజం పెళ్లీ జరుగుతుంది… అన్నాట్ట. కృష్ణ నమ్మలేదు గానీ చివరికి ఆ సెంటిమెంటే నిజమయింది. . తరవాత పరిచయం ప్రణయంగా మారి, తిరుపతిలో కృష్ణ, విజయనిర్మలల పెళ్లి నిజంగానే జరిగిపోయింది.
కృష్ణ సంక్రాంతి సెంటిమెంట్ అసాధ్యుడుతో మొదలైంది. అసాధ్యుడు కృష్ణ పదకొండో సినిమా. 1968 సంక్రాంతికి అది రిలీజైంది. అదే సంక్రాంతికి కెవిరెడ్డి డైరెక్షన్‌లో ఎన్టీయార్, బి సరోజాదేవి కాంబినేషన్‌లో ఉమాచండీగౌరి శంకరుల కథ కూడా విడుదలైంది. అయితే అసాధ్యుడు హిట్టయింది. విజయావారి చరిత్రలో ఉమా చండీ గౌరి శంకరుల కథ తొలి ఫెయిల్యూర్ చిత్రంగా నమోదైంది. అప్పట్నుంచి సంక్రాంతికి విడుదలైన కృష్ణ సినిమాలన్నీ దాదాపుగా విజయవంతమయ్యాయి. అసాధ్యుడు తర్వాత కృష్ణ మరీ బిజీ అయిపోయారు. ఎంతగా అంటే రోజుకు మూడు షిప్టులు చేసేటంతగా… అలా వర్క్ చేసి చేసి అలసిపోయి కాస్త కునుకు తీస్తుంటే… ఓ నిర్మాత వచ్చి ఆ నిద్రపోయేదేదో మా డ్రెస్ వేసుకుని నిద్రపోండి.. కథ ప్రకారం మీరు నిద్రపోతున్న సీన్ వుంది…మేము తీసుకుని వెళ్లిపోతాం అనేంత వరకు వచ్చింది. 1965లో ఒక్క సినిమాతో ప్రారంభమైన కృష్ణ కెరీర్ 66లో రెండు.. 67లో ఏడు సినిమాలు… 68లో నేనంటేనేనే, లక్ష్మీ నివాసం, నాగేశ్వరరావుతో మంచి కుటుంబం…రామారావుతో నిలువుదోపిడి…విశ్వనాథ్ డైరెక్షన్‌లో ఉండమ్మా బొట్టు పెడతా ఇలా పదకొండు సినిమాల వరకు వెళ్లింది. ఆ తర్వాతి రెండేళ్లు ఏకంగా ఏడాదికో పదిహేను సినిమాల చొప్పున కృష్ణ నటించారు.
కృష్ణ మంచి నిర్మాత కూడా. ఆయన బ్యానర్‌లో తెలుగు చిత్ర సీమలో మైలురాళ్లుగా నిలిచిపోయే చిత్రాలు అనేకం వచ్చాయి. వ్యయ ప్రయాసలకు జడవనివాడు కాబట్టే ఆయన సినిమాల్లో రిచ్‌నెస్ కనిపిస్తుంది. సీతారామరాజు నుంచి ఈనాడు వరకు అన్నీ సన్సేషన్లే…
ఇలా సినిమాలు చేస్తున్న కాలంలోనే కృష్ణ సొంత బ్యానర్ పద్మాలయ ఫిలింస్ సంస్థను మొదలు పెట్టారు. ఆ బ్యానర్‌పై తొలి ప్రయత్నంగా అగ్నిపరీక్ష తీశారు. ఇందులో చాలా సీన్లు కలర్‌లో ఉంటాయి. అది పెద్దగా విజయవంతం కాలేదు. కృష్ణలో కసి పెరిగింది. నెక్ట్స్ అటెంప్ట్‌లో మోసగాళ్లకు మోసగాడు తీశారు. ఆరుద్ర స్క్రిప్ట్ రాశారు. డైరెక్టరేమో కేఎస్‌ఆర్ దాస్. రాజస్థాన్ థార్ ఎడారిలో కొంత భాగం…సిమ్లాలో మరికొంత భాగం పిక్చరైజ్ చేశారు. సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. సినిమా ప్రివ్యూ చూసిన ఎన్టీయార్ ఖచ్చితంగా హిట్టవుతుందని చెప్పారు. ఈ సినిమా ఇంగ్లీషు, తమిళం, హిందీ ఇలా అన్ని భాషల్లోకి డబ్ అయింది. అన్ని చోట్లా హిట్టే! కృష్ణను ఆంధ్రా జేమ్స్‌బాండ్‌గా పిలవడం మొదలు పెట్టారు జనం. ఆ తర్వాత పండంటి కాపురం తీశారు. అదీ విజయవంతమైంది. కృష్ణకు మహిళా అభిమానులు తోడయ్యింది ఈ సినిమాతోనే! అంతకు ముందు ఎన్టీయార్‌తో స్త్రీ జన్మ, నిలువుదోపిడి, విచిత్ర కుటుంబం సినిమాల్లో కలిసి నటించినా దేవుడు చేసిన మనుషులు సినిమాతోనే వీరిద్దరి కాంబినేషన్‌కు క్రేజ్ వచ్చింది. అల్లూరి సీతారామారాజు సినిమా కృష్ణ నట జీవితంలో ఓ మైలు రాయిగా నిలిచిపోయింది. ఇండస్ట్రీ నుంచి నెగటివ్ రెస్పాన్స్ వచ్చినా… ఎవరెన్ని కామెంట్లు చేసినా పట్టించుకోకుండా ధైర్యంగా ఆ సినిమా తీశారు. అన్నట్టు కృష్ణ నటించిన వందో సినిమా ఇది. సినిమా
సీతారామరాజు తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఫ్లాపులే..దాదాపు పదిహేను సినిమాల వరకు ఇదే పరిస్థితి. పదేళ్ల పాటు విసుగు విరామం లేకుండా రోజుకు మూడు షిఫ్టులు పని చేసిన కృష్ణ కు సినిమాలు లేకుండా పోయాయి. సొంత బ్యానర్‌లో వచ్చిన పాడిపంటలు మళ్లీ కృష్ణకు లైఫ్ ఇచ్చింది. సినిమా తర్వాత కృష్ణ వందలకొద్దీ సినిమాలు చేశాడు. అందులో సూపర్ హిట్లున్నాయి. హిట్లున్నాయి. యావరేజ్‌లున్నాయి. ఫ్లాపులున్నాయి. అయినా కృష్ణ మాత్రం సూపర్‌స్టార్‌గానే వున్నారు. తానో గొప్ప యాక్టర్‌నని కృష్ణ ఏనాడు చెప్పుకోలేదు. బిరుదులకు ఆశపడలేదు. అవార్డుల కోసం వెంపర్లాడలేదు. మూడువందల యాభైకి పైగా సినిమాలలో నటించిన ఏకైక హీరో కృష్ణనే! నిర్మాతల పాలిటి పెన్నిధి కృష్ణ.. అందుకే .ఆయనతో సినిమా తీసిన నిర్మాతలు మళ్లీ మళ్లీ తీస్తారు. కృష్ణది గొప్ప సెన్సాఫ్ హ్యూమర్.. బాపు డైరెక్షన్‌లో కృష్ణావతారం అనే సినిమా వచ్చింది. సినిమా షూటింగప్పుడు ..పాపం బాపుగారు సాక్షి తర్వాత పదిహేనేళ్లయింది కదా నాతో సినిమా తీసి…నటనలో ఇంప్రూవ్ అయివుంటాననుకుని రెండో టేక్ అడుగుతున్నారు.. నేను ఏం మారలేదని ఆయనకు తెలియనట్టుగా ఉంది అని డాన్స్ డైరెక్టర్ శ్రీనుతో చెప్పి పకపకా నవ్వేశారట కృష్ణ. ఆ సినిమాతో బాపు రమణలకు బాగా డబ్బులొచ్చాయి. పాత అప్పులన్నీ తీర్చేసుకోగలిగారు.
ప్రతి నటుడికి వెనక్కి తిరిగి చూసుకుంటే గుర్తుకొచ్చే సినిమాలు కొన్ని వుంటాయి. కృష్ణకూ వున్నాయి. ఇప్పుడొచ్చే నటులకు లేనిది ఇదే! జయాపజయాలను పక్కన పెడితే ఎన్టీయార్ సినిమాలకు పోటీ పెట్టడం ఒక్క కృష్ణ వల్లనే సాధ్యమైంది. కృష్ణ దాదాపు అన్ని రకాల పాత్రలూ వేశారు. సాంఘికాలు. జానపదాలు…చారిత్రకాలు… పౌరాణికాలు… ఫైటింగ్ సినిమాలు…అపరాధపరిశోధనా సినిమాలు…. బాండ్ సినిమాలు… ఫ్యామిలీ ఎంటరైనర్లు… అన్నీ చేశారు. అడపదడపా కామెడీ రోల్సూ వేశాడు. అన్నింటినీ పండించాడు. అన్నింటికీ న్యాయం చేశారు. పద్మభూషణుడు కృష్ణ మూడు తరాలకు ముచ్చటైన హీరో… తేనెలాంటి మనసాయనది. ఆపదలో ఆదుకునే సహృదయుడు. రాష్ట్రాన్ని ప్రకృతి పగపట్టిన ప్రతీసారి కృష్ణ ముందుకొచ్చేవారు. గొప్పగా సాయాన్ని అందించేవారు. జేమ్స్‌బాండ్, కౌబాయ్, సినిమాస్కోప్ లాంటి ప్రయోగాలతో అలరించిన హీరో కృష్ణ తొలిసారి దర్శకుడై చేసిన మరో సాహసం సింహాసనం. తెలుగులో తొలి 70 ఎం.ఎం–6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్ చిత్రంగా అది ఆ రోజుల్లో ఓ సంచలనం. 40 – 50 లక్షల్లో సిన్మాలు తీసే ఆ రోజుల్లో ఈ జానపదం కోసం దర్శక, నిర్మాత, హీరో కృష్ణ మూడు కోట్ల 20 లక్షలదాకా ఖర్చు పెట్టారు.. బిజినెస్ కూడా అదే రేంజ్‌లో భారీగా జరిగిందనుకోండి.. కృష్ణ మంచి నటుడే కాదు, దర్శకుడు కూడా.. దాదాపు 14 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు.. మంచి ఎడిటర్ కూడా! కృష్ణకు ఏ పాత్ర ఇచ్చినా ఇది తన వల్ల కాదు, చేయలేని అనే మాట అనేవారు కాదు. తనకు ఇచ్చిన ప్రతి పాత్రను తరదైన రీతిలో అవలీలగా నటించారు. అందుకే అన్ని రకాల పాత్రలు చేయగలిగారు. తెలుగు సినిమాకు దొరికిన రత్నం కృష్ణ.. ఆయన మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటోంది టీవీ 9.
మరిన్ని ఇక్కడ చూడండి: అవన్నీ ఊహాగానాలే నమ్మొద్దు.. మహేష్ – రాజమౌళి సినిమాపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..