కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచని స్థితిలో పడింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవి చూశాక.. పార్టీకి దిశా నిర్దేశం చేసేవారు లేక ఉసూరుమంటోంది. పార్టీ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ గత మే 25 నే రాజీనామా చేశారు. తన స్థానే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని ఆయన పదేపదే కోరుతూ వచ్చారు. కానీ రెండు నెలలు గడిచినా పార్టీ పరిస్థితి ఎక్కడవేసిన గొంగడి అక్కడే ఉన్న చందంగా ఉంది. చివరకు శనివారం సమావేశమైన అత్యున్నత నిర్ణాయక కమిటీ..సీడబ్ల్యూసీ కూడా మొదట చేతులెత్తేసింది. సోనియా, రాహుల్, ఇతర సీనియర్ నేతలు హాజరైన ఈ మీట్ లో మొదట అయిదు జోనల్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు సోనియా, రాహుల్ మధ్యలోనే సమావేశం నుంచి బయటికి వెళ్లిపోయారు. తిరిగి సమావేశమైనప్పుడు వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షులు, సిఎల్ఫీ నేతలతో విస్తృత సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు. సుమారు 12 గంటల సుదీర్ఘ భేటీ అనంతరం సోనియాకే పార్టీ పగ్గాలు అప్పగించాలని తీర్మానించారు.
కాగా నెహ్రు-గాంధీ కుటుంబం నుంచి కాకుండా బయటి వ్యక్తిని ఈ పదవికి ఎన్నుకోవడంలో పార్టీ విఫలమైంది. ఈ సంవత్సరాంతంలో జరిగే పార్టీ ప్లీనరీ సమావేశాల్లో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని తీర్మానించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
నిన్న వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరైనవారంతా రాహుల్ గాంధీని అధ్యక్ష పదవిలో కొనసాగాలని కోరారు. అయితే ఆయన ససేమిరా అనడంతో వీరి గళం సోనియావైపు మొగ్గింది. దీంతో తాత్కాలిక అధ్యక్షురాలిగా ఆమెను ఎన్నుకున్నారు. కాగా-పార్టీకి రాహుల్ చేసిన సేవలను కొనియాడుతూ తీర్మానం ఆమోదించారు. అలాగే సోనియా నియామకం పైన, జమ్మూ కాశ్మీర్ అంశంపైనా మరో రెండు తీర్మానాలను ఆమోదించారు. రాత్రి 11 గంటలకు సమావేశం ముగిసింది. అసలు కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందా లేక సంప్రదాయబధ్ధ ఆనవాయితీ అయిన నామినేషన్ వైపు మొగ్గుతారా అన్న సస్పెన్స్ కొద్దిసేపు నెలకొంది.
దక్షిణ, ఉత్తర, తూర్పు, పశ్చిమ, ఈశాన్య రాష్ట్రాల ప్రతినిధులతో అయిదు జోనల్ కమిటీలను ఏర్పాటు చేయాలని, ఆయా కమిటీలకు సోనియా, రాహుల్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అంబికా సోని వంటివారు నేతృత్వం వహిస్తారని మొదట వార్తలు వచ్చాయి. ఒక దశలో పార్టీ సీనియర్ నేత ముకుల్ వాస్నిక్, మరో నేత మల్లిఖార్జున్ ఖర్గే వంటివారి పేర్లు వినిపించాయి. అయితే ఇదెంతో సేపు నిలువలేదు. చివరకు నెహ్రు-గాంధీ కుటుంబ సభ్యురాలే పార్టీ అధ్యక్షురాలయ్యారు. త్వరలో కొని రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగే ఎన్నికల్లో ఆమె మళ్ళీ క్రియాశీలక బాధ్యత వహించి పార్టీ విజయాలకు బాటలు వేస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది.