షిరిడి సాయి భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలో తెరుచుకోనున్న ఆలయం

|

Sep 07, 2020 | 7:50 PM

కరోనా మహమ్మారి నేపథ్యంలో మార్చి నుంచి మూతబడిన షిరిడి సాయి ఆలయాన్ని త్వరలో తెరిచేందుకు ఆలయ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. కోవిడ్‌-19 నియంత్రణ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆలయాన్ని నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తోంది...

షిరిడి సాయి భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలో తెరుచుకోనున్న ఆలయం
Follow us on

కరోనా లాక్ డౌన్‌ సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాలు మూత పడ్డాయి. అయితే ఇప్పుడిప్పుడే చాలా దేవాలయాలు నెమ్మదిగా తెరుచుకుంటున్నాయి. ఇందులో కరోనా నిబంధలకు అనుగూణంగా ఆలయాల్లో ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

అయితే కరోనా మహమ్మారి నేపథ్యంలో మార్చి నుంచి మూతబడిన షిరిడి సాయి ఆలయాన్ని త్వరలో తెరిచేందుకు ఆలయ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. కోవిడ్‌-19 నియంత్రణ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆలయాన్ని నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తోంది.

ఈ మేరకు గత మూడు నెలలుగా భక్తులకు సురక్షిత దర్శనం అందిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సాయంను సాయి బోర్డు ఆలయ కమిటీ కోరింది. అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు టీటీడీ బోర్డు సలహా కమిటీని షిరిడీకి ఆహ్వానించింది.

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, బోర్డు సభ్యుడు కె. శివకుమార్, ఇతర అధికారులు ఆదివారం షిరిడికి చేరుకొని ఆలయ బోర్డు కార్యదర్శి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కన్హురాజ్ హరిశ్చంద్ర భగతేతో ఆలయంలో ఏర్పాట్లపై చర్చించారు.

కరోనా నియంత్రణకు అనుసరించాల్సిన విధివిధానాలపై సలహాలు, సూచనలిచ్చారు. లాక్‌డౌన్‌ అనంతరం జూన్ 11 నుంచి టీటీడీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది. ఇప్పటివరకు ఆరు లక్షల మంది దర్శనం చేసుకున్నారు. అయినా ఒక్క పాజిటివ్‌ కేసు నమోదు కాలేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.