#Lock-down పోలీసన్నకు సలామ్… ఖాకీల సేవలో ఎమ్మెల్యేలు

|

Apr 01, 2020 | 3:04 PM

లాక్ డౌన్ అమలులో కంటికి కునుకు లేకుండా శ్రమిస్తున్న పోలీసుల సర్వీసును ప్రతీ ఒక్కరు అభినందిస్తున్నారు. ఈ కోవలోకి చేరారు పలువురు ప్రజా ప్రతినిధులు.

#Lock-down పోలీసన్నకు సలామ్... ఖాకీల సేవలో ఎమ్మెల్యేలు
Follow us on

MLAs in service of Police staff: లాక్ డౌన్ అమలులో కంటికి కునుకు లేకుండా శ్రమిస్తున్న పోలీసుల సర్వీసును ప్రతీ ఒక్కరు అభినందిస్తున్నారు. ఈ కోవలోకి చేరారు పలువురు ప్రజా ప్రతినిధులు. చిత్తూరు జిల్లాలో నగరి ఎమ్మెల్యే రోజా.. విశాఖ జిల్లాలో అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ పోలీసుల సేవలకు ఫిదా అయ్యారు. వారిని తమదైన శైలిలో అభినందించారు.

లాక్ డౌన్ అమలులో పోలీసుల పాత్ర సవాల్‌గా మారింది. అయినా కూడా 24 గంటలు కంటికి నిద్ర కూడా సరిగ్గా లేకుండా రోడ్ల మీద పోలీసులు పహారా కాస్తున్నారు. చాలా చోట్ల ప్రజలు విసురుతున్న సవాళ్ళకు ధీటుగా స్పందిస్తున్నారు. నయానా, భయానా.. అవసరమైతే లాఠీలకు పని చెప్పి మరీ లాక్ డౌన్ సక్సెస్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి పోలీసులకు ఏం చేసినా తక్కువే అనుకున్నారో ఏమో అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ తనదైన శైలిలో పోలీసులకు అభినందనలు తెలిపారు.

అరకులోయలో లాక్ డౌన్ కోసం శ్రమిస్తున్న పోలీసుల కాళ్ళు మొక్కారు ఎమ్మెల్యే శెట్టిపాల్గుణ. కరోనా నియంత్రణకు పోలీసుల సేవలు అభినందనీయమని ప్రశంసించారు. నడి రోడ్డుపై పోలీసుల కాళ్ళు మొక్కి మరీ అభినందించారు. ఎమ్మెల్యే చర్యతో అందరూ అవాక్కైనా… పోలీసుల పాత్రకు కాళ్ళు మొక్కినా తప్పులేదంటూ కామెంట్లు చేశారు. ఎమ్మెల్యే కాళ్ళు మొక్కడంతో ఉబ్బి తబ్బిబ్బయిన పోలీసులు.. ఆయన్ను వారించి.. తమ విధులను తాము నిర్వహిస్తున్నామని వ్యాఖ్యానించారు.

మరోవైపు చిత్తూరు జిల్లా నగరిలో పోలీసులు , మున్సిపల్ సిబ్బంది , మెడికల్ స్టాఫ్‌కు భోజనాలు ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే ఆర్కె రోజా. అయితే వంటలను ఇంకెవరి చేతో చేయించి… తాను క్రెడిట్ తీసుకోవడం ఎందుకు అనుకున్నారో ఏమో రోజా స్వయంగా వంట చేసేందుకు సిద్దమయ్యారు. స్వయంగా కూరగాయలు తరిగి, చేత్తో గరిటె తిప్పి మరీ వంటలు చేసి మరీ పోలీసులకు, వైద్య సిబ్బందికి వడ్డించారు రోజా. ఇది ఏ ఒక్కరోజో కాదు లాక్ డౌన్ ముగిసే దాకా ప్రతీ రోజు 500 మందికి తాను వంటలు చేసి పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు నగరి ఎమ్మెల్యే రోజా.