గుంటూరులో కరోనా విజృంభణకు కారణాలివే

| Edited By: Anil kumar poka

Apr 22, 2020 | 1:30 PM

నాలుగు జిల్లాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతం వున్న గుంటూరు జిల్లాపై ఉన్నతాధికారులు స్పెషల్‌గా ఫోకస్ చేశారు. దాంతో గుంటూరు జిల్లాలో వైరస్ ప్రబలడానికి, అతి వేగంగా విస్తరించడానికి కారణాలు గుర్తించారు.

గుంటూరులో కరోనా విజృంభణకు కారణాలివే
Follow us on

గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడానికి కారణాలను గుర్తించింది అధికార యంత్రాంగం. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కరోనా వేగంగా స్ప్రెడ్ అవుతున్న నాలుగు జిల్లాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతం వున్న గుంటూరు జిల్లాపై ఉన్నతాధికారులు స్పెషల్‌గా ఫోకస్ చేశారు. దాంతో గుంటూరు జిల్లాలో వైరస్ ప్రబలడానికి, అతి వేగంగా విస్తరించడానికి కారణాలు గుర్తించారు.

బుధవారం (ఏప్రిల్ 22వ తేదీ) నాటికి గుంటూరు జిల్లాలో మొత్తం 177 పాజిటివ్ కేసులున్నాయి. ఒక్క గుంటూరు నగరంలోనే 105 కేసులు నమోదయ్యాయి. దీనికి ప్రధాన కారణంగా ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిఘీ జమాత్ సదస్సుకు వెళ్ళిన వారేనని అధికారులు గుర్తించారు. వీరి ద్వారానే గుంటూరు సిటీలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. మొత్తం 180 మంది ఢిల్లీ ప్రార్థనలకు వెళ్ళి వచ్చినట్లు గుర్తించారు. వీరిలో పదిహేను మందిని ప్రైమరీ కాంటాక్ట్స్‌గా ఐడింటిఫై చేశారు. వీరిలో ప్రధానంగా ముగ్గురే సెకండరీ కాంటాక్ట్స్ పెరగటానికి కారణమైనట్లు భావిస్తున్నారు.

విదేశాల నుండి తిరిగి వచ్చిన ఒక్క మహిళకు మాత్రమే పాజిటివ్ వచ్చింది. గుంటూరు నగరంలోని సంగడిగుంట, ఆనంద పేట, కుమ్మరి బజార్ ల్లోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. గుంటూరు రూరల్ జిల్లాలో నర్సరావుపేటలో అత్యధికంగా 35 కేసులు నమోదయ్యాయి. కేబుల్ ఆపరేటర్, హోంగార్డు.. వీరిద్దిరి వల్లే నర్సరావుపేటలో అత్యధిక కేసులు వచ్చాయి. హోంగార్డు చికిత్స చేయించుకున్న ఆసుపత్రిలో మొత్తం పది కేసులు నమోదయ్యాయి.

క్వారంటైన్ కేంద్రాలకు వేలాది మందిని తరలించినా కూడా పాజిటివ్ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గటం లేదు. ముఖ్యంగా నగరంలోని ఒక సామాజిక వర్గం అత్యధికంగా నివసించే ప్రాంతం నుండే అధిక సంఖ్యలో కేసులు వస్తున్నాయి. ఓకే కుటుంబం లో పదకొండు మందికి, మరో కుటుంబంలోని ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. జిల్లాలో ఒక వార్డు వాలెంటీర్, హోంగార్డు, ఆర్ఎంపి వైద్యుడు, వాణిజ్య పన్నుల శాఖాధికారి, పీజీ వైద్య విద్యార్థిని, మరొక వైద్యురాలు ఇలా అన్ని వర్గాల నుండి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

కారణాలను గుర్తించిన అధికారులు జిల్లాలో మొత్తం పన్నెండు రెడ్ జోన్లను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు నిమిది మరణాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఇరవై మూడు మంది ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఐదు వేల మందికి పైగా కరోనా టెస్ట్ లు నిర్వహించారు. మరో పదిహేను వందల కేసుల ఫలితాలు రావాల్సి ఉంది. బాపట్ల మండలం శ్రీరాం నగర్, దాచేపల్లి మండలం నారాయణ పురం, వినుకొండ మండలం ఏనుగు పాలెం వంటి చిన్న చిన్న గ్రామాల్లో సైతం పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రైమరీ కాంటాక్ట్స్‌ను సకాలంలోనే గుర్తించినా.. సెకండరీ కాంటాక్ట్స్‌ని గుర్తించడం, టెస్ట్‌లు చేయడంలో జాప్యం జరగడం వల్లనే పాజిటివ్ కేసులు పెరుగుతున్నట్లు భావిస్తున్నారు.