మోదీకి రాహుల్‌గాంధీ మూడు ప్రశ్నలు

|

Jul 19, 2020 | 1:05 PM

ఆదివారం ట్విట్టర్ వేదికగా స్పందించిన ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వం మూడంశాల్లో నిజాలను దాస్తోందని ఆరోపించారు. దేశంలో ...

మోదీకి రాహుల్‌గాంధీ మూడు ప్రశ్నలు
Follow us on

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మూడు ప్రశ్నలు సంధించారు కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ. కేంద్ర ప్రభుత్వం అసత్య ప్రచారంతో ముందుకెళుతుందని, మోదీ ప్రభుత్వ అభూత కల్పనల కారణంగా భారతదేశం త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకోబోతోందని రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా కేంద్రంపై విరుచుకుపడ్డారు. రాహుల్ ట్వీట్‌పై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు.

ఆదివారం ట్విట్టర్ వేదికగా స్పందించిన ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వం మూడంశాల్లో నిజాలను దాస్తోందని ఆరోపించారు. దేశంలో కోవిడ్ పరీక్షలను తక్కువ సంఖ్యలో జరపడం ద్వారా కేసుల సంఖ్యను తక్కువగా చూపుతోందని, మరణాల సంఖ్యను కూడా మసిపూసి మారేడు కాయ చేస్తోందన్నది రాహుల్ గాంధీ మొదటి ఆరోపణ. దేశంలో పది లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అసలు నెంబర్ కాదన్నది రాహుల్ గాంధీ అభిప్రాయంగా కనిపిస్తోంది. కరోనా పరీక్షలపై నిషేధం విధించిన కేంద్రం.. మరణాల సంఖ్యను తక్కువగా చూపుతోందని రాహుల్ గాంధీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

దేశ జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) దారుణ స్థితికి చేరినా దానికి భిన్నమైన సూత్రీకరణ చేస్తున్న మోదీ ప్రభుత్వాధినేతలు.. ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నది రాహుల్ గాంధీ రెండో ఆరోపణ. ప్రముఖ ఆర్థిక వేత్తలు జీడీపీకి ఇచ్చిన నిర్వచనాలను తోసి పెడుతున్న కమలనాథులు.. ఆర్థిక రంగంలో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు జీడీపీకే కొత్త నిర్వచనాన్ని చెబుతున్నారని రాహుల్ గాంధీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇక చైనా దేశం మనదేశానికి చెందిన భూభాగాన్ని ఆక్రమించలేదన్న ప్రధానమంత్రి మోదీ వాదనలో నిజం లేదని చెబుతున్న రాహుల్ గాంధీ… చైనా దురాక్రమణపై నిజాలను ప్రసారం చేయకుండా మీడియాపై మోదీ ప్రభుత్వం తెరవేస్తోందని ఆరోపించారు. మీడియాను భయానికి గురి చేస్తోన్న మోదీ.. చైనా దురాక్రమణపై అసత్య ప్రచారానికి ఒడిగట్టారన్నది రాహుల్ గాంధీ మూడో ఆరోపణ.

ఈ మూడు అంశాలపై మోదీ ప్రభుత్వ ధోరణి కారణంగా మనదేశం భవిష్యత్తులో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని రాహుల్ గాంధీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా రాహుల్ గాంధీ ట్వీట్‌పై నెటిజన్లు తలోరకంగా స్పందిస్తుండగా.. సోషల్ మీడియాలో రాహుల్ ట్వీట్ తెగ వైరలవుతోంది.