కూలీ డబ్బుల కోసం ఇద్దరి మధ్య గొడవ.. రూ.500 కోసం సెల్‌ఛార్జింగ్‌ వైర్‌తో యువకుడి హత్య.. ఛేదించిన గుంటూరు పోలీసులు

|

Dec 27, 2020 | 7:44 PM

మనషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. రూ. 500 కోసం ఓ వ్యక్తి బంధువునే హతమార్చాడు. మాట మాట పెరిగి మర్డర్ దాకా వెళ్లింది. ఎటువంటి ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తపడ్డ నిందితుడు సొంత రాష్ట్రానికి పారిపోయాడు. పోలీసులు చాకచక్యంగా దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి కటకటలాపాలు చేశారు.

కూలీ డబ్బుల కోసం ఇద్దరి మధ్య గొడవ.. రూ.500 కోసం సెల్‌ఛార్జింగ్‌ వైర్‌తో యువకుడి హత్య.. ఛేదించిన గుంటూరు పోలీసులు
Follow us on

మనషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. రూ. 500 కోసం ఓ వ్యక్తి బంధువునే హతమార్చాడు. మాట మాట పెరిగి మర్డర్ దాకా వెళ్లింది. ఎటువంటి ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తపడ్డ నిందితుడు సొంత రాష్ట్రానికి పారిపోయాడు. పోలీసులు చాకచక్యంగా దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి కటకటలాపాలు చేశారు. ఈ ఘటన గుంటూరు అర్బన్‌ జిల్లాలో వెలుగుచూసింది. అర్బన్ ఎస్పీ ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా మోటబడి గ్రామానికి చెందిన కృష్ణచంద్రనాయక్‌, సుకుంటా నాయక్‌లు బంధువులు. కొంతకాలం కిందట చంద్రనాయక్‌ పేరేచర్ల వచ్చి బేల్దారి పనిచేసుకుంటున్నాడు. ఇదే క్రమంలో ఒడిశాలో పనులు లేక ఇబ్బంది పడుతున్న బంధువు అయిన సుకుంటా నాయక్‌ను పిలిపించి గుంటూరులో పనిలో పెట్టించాడు. ఇద్దరూ కలిసి గది అద్దెకు తీసుకొని ఉంటున్నారు.

ఇదిలావుంటే, కూలి డబ్బుల పంపకాల విషయంలో రూ.500 కోసం ఇరువురి మధ్య వివాదం తలెత్తింది. దీంతో ఈనెల 12న ఇద్దరూ మద్యం సేవించి ఘర్షణకు దిగారు. కృష్ణచంద్రనాయక్‌ను చంపేస్తానని, అతడి భార్య, పిల్లలను నాశనం చేస్తానంటూ సుకుంటా నాయక్‌ బెదిరించాడు. ఇది మనసులో పెట్టుకుని సుకుంటాను చంపేయాలని కృష్ణచంద్రనాయక్‌ నిర్ణయించుకున్నాడు. ఈనెల 13న పేరేచర్ల సమీపంలోని ఓ ఫ్యాక్టరీ వద్దకు పిలిపించి కండువాలో రాయి చుట్టి ముఖంపై కొట్టాడు. సెల్‌‌ఫోన్ ఛార్జింగ్‌ వైర్‌తో, కండువాతో మెడకు చుట్టి చంపేసి పక్కనే ఉన్న కాలువలో పడేసి సొంత రాష్ట్రం ఒడిశాకు పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కాలువలో మ‌ృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మృతుడి శరీరంపై గాయాలు, అతడి దుస్తుల్లో లభించిన గుర్తింపు కార్డులు, కాల్‌డేటా, ఇతర సాంకేతిక ఆధారాలతో పోలీసులు విచారణ చేపట్టారు. కృష్ణచంద్రనాయక్‌ అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయాన్ని ఒప్పుకున్నాడు. దీంతో అతడే నిందితుడిగా తేలిందన్నారు. ఒడిశా పారిపోయిన నిందితుడిని చాకచక్యంగా అరెస్టు చేసిన అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి అభినందించి రివార్డులు అందించారు.