తెలంగాణ పార్టీలకు కొత్త టెన్షన్.. గడువు రెండ్రోజులే

|

Jan 10, 2020 | 5:49 PM

తెలంగాణ మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. భారీ ఎత్తున నామినేషన్లు దాఖలు కాగా.. మెదక్ వంటి చోట్ల స్వల్పపాటి ఘర్షణలు చివరి రోజున చోటుచేసుకున్నాయి. అదే సమయంలో అన్ని ప్రధాన పార్టీల తరపున భారీ సంఖ్యలో రెబల్స్ బరిలోకి దిగారు. రెబల్స్ బెడద తలెత్తకుండా పార్టీల నేతలు చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలితమివ్వని పరిస్థితి కనిపిస్తోంది. దాంతో రెబల్స్ నామినేషన్లను ఉపసంహరింప చేసే పని షురూ చేశారు ప్రధాన పార్టీల నేతలు. 118 […]

తెలంగాణ పార్టీలకు కొత్త టెన్షన్.. గడువు రెండ్రోజులే
Follow us on

తెలంగాణ మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. భారీ ఎత్తున నామినేషన్లు దాఖలు కాగా.. మెదక్ వంటి చోట్ల స్వల్పపాటి ఘర్షణలు చివరి రోజున చోటుచేసుకున్నాయి. అదే సమయంలో అన్ని ప్రధాన పార్టీల తరపున భారీ సంఖ్యలో రెబల్స్ బరిలోకి దిగారు. రెబల్స్ బెడద తలెత్తకుండా పార్టీల నేతలు చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలితమివ్వని పరిస్థితి కనిపిస్తోంది. దాంతో రెబల్స్ నామినేషన్లను ఉపసంహరింప చేసే పని షురూ చేశారు ప్రధాన పార్టీల నేతలు.

118 మునిసిపాలిటీల్లో భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇటు పది కార్పొరేషన్లలో కూడా పోటీ పడి నామినేషన్లు వేశారు. ప్రధాన పార్టీల నుంచి టిక్కెట్లు ఆశిస్తున్న అభ్యర్థులు చాలా మంది ఉన్నారు. ఒక్కో వార్డుకు ఐదు నుంచి పది మంది పోటీపడుతున్నారు. వీరంతా ఇప్పుడు నామినేషన్లు వేశారు. దీంతో ఇప్పటి వరకూ ప్రధాన పార్టీలు బీ-ఫామ్‌లు జారీ చేయలేదు. నామినేషన్ల ఉపసంహరణ రోజు బీఫామ్‌లు ఇవ్వాలని ప్రధాన పార్టీలు నిర్ణయించాయి. దీంతో ఆశావహల్లో టెన్షన్‌ కొనసాగుతోంది. ఇటు హైదరాబాద్ శివారులోని కొత్త మునిసిపాలిటీలు అమీన్‌పూర్‌, తెల్లాపూర్‌, ఆదిభట్లతో పాటు పలు చోట్ల భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి.

మరోవైపు పార్టీ ఏదైనా లోకల్‌గా తమ పట్టు ఉండాలని అనుకున్న నేతలు…టిక్కెట్‌ రాకపోతే వేరే పార్టీలోకి జంప్‌ అవుతున్నారు. నిర్మల్‌లో నిన్నమొన్నటివరకు కాషాయ జెండా కప్పుకున్న ద్వితీయ శ్రేణి నేత సడెన్‌గా పార్టీ మారిపోయారు. రాత్రికి రాత్రే వేరే పార్టీ కండువా కప్పుకుని నామినేషన్ వేసిన నేతలు తెలంగాణవ్యాప్తంగా కోకొల్లలుగా కనిపిస్తున్నారు.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి బయటపడింది. 20 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ కోసం పనిచేస్తే తనను కాదని టీడీపీ నుంచి ఇటీవల వచ్చిన వ్యక్తికి టికెట్‌ ఇచ్చారని షేక్‌ ఖాదర్‌ అలీ అనే నేత దీక్షకు దిగారు. తనకు బీ-ఫామ్‌ ఇవ్వకుండా మోసం చేశారని కన్నీరు పెట్టుకున్నారు.

మొత్తానికి నామినేషన్ల ఘట్టం ముగియడంతో ఇప్పుడు రెబెల్స్‌ను బుజ్జగించడంపై కీలక నేతలు దృష్టి పెట్టారు. సాధ్యమైనంతవరకు పదవులు ఇస్తామని అధికార పార్టీ ఆశ పెడుతుంటే.. పార్టీలో మంచి పదవి ఇస్తామని ప్రతిపక్ష పార్టీలు రెబెల్స్‌ను బుజ్జగిస్తున్నాయి. మొత్తానికి అన్ని పార్టీల్లో ఇప్పుడు రెబెల్స్‌ బెడద తీవ్రస్థాయిలో ఉంది.