నిమ్మగడ్డ కేసులో మంగళవారమే తీర్పు!

|

Apr 27, 2020 | 12:51 PM

ఒకవైపు కరోనా వైరస్ తీవ్రస్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ప్రభావం చూపుతున్న తరుణంలో మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తొలగించబడిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం కూడా అదే స్థాయిలో రాజకీయ ప్రకంపనలు రేపు తోంది.

నిమ్మగడ్డ కేసులో మంగళవారమే తీర్పు!
Follow us on

ఒకవైపు కరోనా వైరస్ తీవ్రస్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ప్రభావం చూపుతున్న తరుణంలో మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తొలగించబడిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం కూడా అదే స్థాయిలో రాజకీయ ప్రకంపనలు రేపు తోంది. తను తొలగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వం తాను అడిగిన తాను లేవనెత్తిన సవాళ్లపై స్పందించకుండా ఎన్నికల సంస్కరణలపై మాత్రమే స్పందించడానికి తప్పుపడుతున్నారు.

65 సంవత్సరాలకు లోబడి ఉన్న వ్యక్తిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించాల్సి ఉండగా రిటైర్డ్ జడ్జి అనే పేరుతో 74 సంవత్సరాల కనకరాజు జగన్ ప్రభుత్వం నియమించింది నిమ్మగడ్డ రమేష్ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తనను తొలగించడానికి తనపై కక్ష సాధించడానికి ప్రత్యేక ఆర్డినెన్స్‌ను జగన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తీసుకు వచ్చిందని రమేష్ హైకోర్టుకు నివేదించారు.

తన తొలగింపుపై తాను అడిగిన, కోర్టు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం దాఖలు చేసిన ఫైనల్ కౌంటర్‌కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ సోమవారం నాడు ఫైనల్ రిజాయిండర్ దాఖలు చేశారు. ప్రభుత్వం తాను అడిగిన అంశాలను ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టి కేవలం ఎన్నికల సంస్కరణల ఆధారంగానే హై కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని ఆరోపించారు. ఈ మేరకు 17 పేజీలున్న ఫైనల్ రిజాయిండర్‌ను ఆయన కోర్టు ముందుంచారు.

ఎన్నికల సంఘం కార్యదర్శి బాధ్యత కేవలం తనకు సహకరించడం వరకేనని, తాను తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని కార్యదర్శికి చెప్పాల్సిన అవసరం లేదని నిమ్మగడ్డ తన రిజాయిండర్‌లో పేర్కొన్నారు. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా స్టేట్ ఈసీ పదవీ కాలాన్ని తగ్గించినా..ప్రస్తుతం ఉన్న కమిషనర్‌కు అది వర్తించదని రమేశ్ కుమార్ వాదిస్తున్నారు. తన రిజాయిండర్‌లో పలు వివాదాస్పద అంశాలను సైతం రమేశ్ ప్రస్తావించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిన తర్వాత జరిగిన పలు హింసాత్మక సంఘటనలపై కేంద్ర హోంశాఖకు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగలేదు అనడానికి ఏకగ్రీవాల సంఖ్యే నిదర్శనమని ఆయన అంటున్నారు. ఎన్నికలు వాయిదా వేసే నిర్ణయం పూర్తిగా కమిషనర్ పరిధిలోనిదని, దానిపై ఎవరితోను చర్చించాల్సిన అవసరం లేదని ఆయన వాదిస్తున్నారు.

ఇదిలా ఉండగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వ్యవహారంలో దాఖలైన అన్ని పిటిషన్లను, ప్రభుత్వం ఇచ్చిన ఫైనల్ కౌంటర్‌ను, దానిపై నిమ్మగడ్డ దాఖలు చేసిన ఫైనల్ రీజాయిండర్‌ను ఏపీ హైకోర్టు రేపు తుది విడతగా విచారించనుంది. అనంతరం మంగళవారం సాయంత్రానికి హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశం కనిపిస్తుంది.