ధాన్యం సేకరణకు కొత్త మార్గదర్శకాలు.. ఇవి తప్పనిసరన్న సర్కార్

|

Apr 25, 2020 | 1:02 PM

రాష్ట్రంలో ధాన్యం సేకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. మార్గదర్శకాలను శనివారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని మీడియాకు విడుదల చేశారు.

ధాన్యం సేకరణకు కొత్త మార్గదర్శకాలు.. ఇవి తప్పనిసరన్న సర్కార్
Follow us on

ఒకవైపు కరోనా వైరస్ వ్యాప్తి, మరోవైపు లాక్ డోన్ కఠినతరమైన నిబంధనలు వెరసి ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి సమస్యాత్మకంగా పరిణమించాయి. ఖరీఫ్ పంట చేతికొచ్చినా ధాన్యాన్ని కొనేవారు లేక రైతాంగం అల్లాడి పోతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ధాన్యం సేకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. మార్గదర్శకాలను శనివారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని మీడియాకు విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం రైతాంగం మధ్య దళారీల వల్ల మోసపోకుండా, వారికి కనీస మద్దతు ధర లభించేలా ప్రత్యేక చర్యలు తీసుకోబోతున్నారు. గ్రామ స్థాయిలోనే మినిమం సపోర్ట్ ప్రైస్ లభించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులను, మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు సివిల్ సప్లైస్ ఎక్స్ అఫిషియో సెక్రెటరీ కోన శశిధర్.. రాష్ట్రంలోని జాయింట్ కలెక్టర్లు, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా మేనేజర్లు, డి.ఎస్.వో.లకు నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అ ప్రకారం సాధారణ రకం వరి క్వింటాలుకు 1,815 రూపాయలు, ఏ గ్రేడ్ రకం వరి ధాన్యానికి క్వింటాలుకు 1,835 రూపాయలు రైతాంగానికి లభించేలా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

గ్రామాల వారీగా ప్రతిరోజు వరి కోతలు, ధాన్యం సేకరణ వివరాలను రాష్ట్రస్థాయికి నివేదిక పంపాలని జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు. పొలాల వద్ద సేకరించిన ధాన్యాన్ని నేరుగా రైస్ మిల్లులకు రవాణా చేసేందుకు జిపిఎస్ ఉన్న వాహనాలను వినియోగించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ధాన్యం కొనుగోళ్లలో ఎటువంటి సమస్యలు ఎదురైనా టోల్ ఫ్రీ నెంబర్ 1902 నెంబరుకు ఫిర్యాదు చేయాలని అధికారులకు తెలిపారు.

ధాన్యం ఏ రైతు వద్ద సేకరించింది.. ఆ వివరాలను నమోదు చేసేందుకు గ్రామ సచివాలయ స్థాయిలో గ్రామ వ్యవసాయ సహాయకులు (వీఏఏలు) ప్రతి రైతు వద్ద నుంచి వారి ఆధార్ కార్డు, మొబైల్ ఫోన్ నెంబరు, పట్టాదారు పాసు బుక్, బ్యాంకు పాస్ బుక్ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలలో పేర్కొంది. ఈ రకంగా సేకరించిన రైతుల వివరాలను గ్రామ సచివాలయంలో ప్రదర్శించాలని నిర్దేశించింది. రైతులు, కౌలు రైతుల వివరాలను ఈ పంటలో నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చారు.

ఎవరైనా కనీస మద్దతు ధర కంటే తక్కువ సొమ్ము చెల్లించి రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తే ఆ దళారుల వివరాలను మండల వ్యవసాయ అధికారి దృష్టికి తీసుకువెళ్లాలని రైతులకు ప్రభుత్వం సూచించింది. జన్ ధన్ ఖాతా ఉన్న రైతులకు గరిష్ఠంగా 50 వేల రూపాయలు మాత్రమే ఖాతాలో జమ చేసే వెసులుబాటు ఉన్నందున మిగిలిన మొత్తాన్ని చెల్లించేందుకు మార్గాలను తెలుసుకోవాలని ప్రభుత్వం.. వ్యవసాయ శాఖ అధికారులకు, మార్కెటింగ్ శాఖ అధికారులకు తెలియజేసింది.