రేపు భాగ్యనగరంలో పర్యటించనున్న మంత్రి కేటీఆర్… శాటిలైట్‌ బస్‌ టెర్మినల్‌కు భూమి పూజ.. జంట రిజర్వాయర్ల ప్రారంభం

|

Jan 08, 2021 | 10:09 PM

హైదరాబాద్‌ మహానగరంలో పలు అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్‌ శనివారం ప్రారంభించనున్నారు.

రేపు భాగ్యనగరంలో పర్యటించనున్న మంత్రి కేటీఆర్... శాటిలైట్‌ బస్‌ టెర్మినల్‌కు భూమి పూజ.. జంట రిజర్వాయర్ల ప్రారంభం
Follow us on

దేశంలోనే తొలి ఏసీ శాటిలైట్‌ బస్‌ టెర్మినల్‌ నిర్మాణానికి రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీ.రామారావు శ్రీకారం చుట్టబోతున్నారు. అలాగే హైదరాబాద్‌ మహానగరంలో పలు అభివృద్ధి పనులను కేటీఆర్‌ శనివారం ప్రారంభించనున్నారు. నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎల్బీనగర్‌ సర్కిల్‌లో జలమండలి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన జంట రిజర్వాయర్లను మధ్యాహ్నం 12 గంటల 30నిమిషాలకు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా రూ. 9.42 కోట్ల వ్యయంతో వాసవీనగర్‌, కొత్తపేటలో ఒక్కొక్క రిజర్వాయర్‌ను 2.5 మిలియన్‌ లీటర్ల సామర్థ్యంతో జలమండలి నిర్మించింది. దాదాపు నగరవ్యాప్తంగా 88 వేల గృహాలకు కొత్త రిజర్వాయర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు వీలవుతుందని హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా వనస్థలిపురం జింకల పార్కు సమీపంలో శాటిలైట్‌ బస్‌ టెర్మినల్‌ నిర్మాణానికి కేటీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఎల్‌బీనగర్‌ వనస్థలిపురం జింకల పార్కు సమీపంలో బస్‌ టెర్మినల్‌ నిర్మాణానికి శనివారం మధ్యాహ్నం ఒంటి గంట 15 నిమిషాలకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. తొలిదశలో రూ.10కోట్ల అంచనా వ్యయంతో బస్ టర్మినల్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. అంతర్‌ జిల్లాల బస్సుల రాకపోకల కోసం ఈ బస్‌ టెర్మినల్‌ను నిర్మిస్తున్నారు. ఎల్‌బీనగర్‌ మీదుగా ఏపీతోపాటు తెలంగాణలోని ఖమ్మం, భద్రాచలం, నల్లగొండ, సూర్యాపేటకు రోజూ సుమారు 20 వేల నుంచి 25 వేల మంది ప్రయాణికులు వెళ్తుంటారు. సుమారు 680 మీటర్ల పొడవుతో అధునాతన బస్‌ బేలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో హెచ్‌ఎండీఏ 3 బస్‌ బేలను నిర్మించనుంది. ప్రతి బస్‌ బేలో ఏసీతో కూడిన వెయిటింగ్‌ రూంలతోపాటు ఫార్మసీ, బ్యాంకు, నీటి ఏటీఎంలు, ఎంక్వైరీ కేంద్రం, ఫుడ్‌ కోర్టులు, మరుగుదొడ్లు, బైకులు, కార్లు, ట్రక్కుల పార్కింగ్‌ కేంద్రాలతోపాటు లోకల్‌ బస్టాప్‌లను ఏర్పాటు చేస్తారు. ఆరు నెలల్లోగా పనులు పూర్తిచేయాలని హెచ్‌ఎండీఏ లక్ష్యంగా పెట్టుకుంది.
AP Local Body Elections Live Updates: ఏపీలో మోగిన స్థానిక సంస్థల ఎన్నికల నగారా.. కొత్త పంచాయితీకి తెరలేపేనా.!