కామెరూన్ ఫుడ్స్‌తో కంత్రీ వ్యాపారం… రేవంత్ గుట్టు ఇదేనన్న క్రిశాంక్

|

Mar 13, 2020 | 5:40 PM

కేటీఆర్ ఫామ్ హౌజ్‌పై డ్రోన్ వదిలి అరెస్టైన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై గులాబీ నేతలు దూకుడు పెంచారు. ఆయన వ్యాపార అక్రమాలపై దృష్టి సారించారు. ఏపీలో రేవంత్ రెడ్డి అక్రమ వ్యాపారాలు చేస్తున్నారంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేస్తామంటున్నారు టీఆర్ఎస్ నాయకులు.

కామెరూన్ ఫుడ్స్‌తో కంత్రీ వ్యాపారం... రేవంత్ గుట్టు ఇదేనన్న క్రిశాంక్
Follow us on

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాపార అక్రమాల కూపీ లాగుతోంది టీఆర్ఎస్ పార్టీ. తాజాగా భూ కబ్జా ఆరోపణలతోపాటు అనుమతి లేకుండా డ్రోన్ వినియోగించారన్న ఆరోపణలతో రిమాండ్ ఖైదీగా వున్న రేవంత్ రెడ్డి విషయంపై అటు ఢిల్లీలోను, ఇటు హైదరాబాద్‌లోను తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు గులాబీ నేతలు. తాజాగా రేవంత్ రెడ్డి తన కూతురు పేరిట భీమవరంలో నెరపుతున్న వ్యాపారంపై ఆరోపణలతో ముందుకొచ్చారు టీఆర్ఎస్ నేత క్రిశాంక్.

కామెరూన్ ఫుడ్స్ పేరుతో రేవంత్ రెడ్డి కూతురు భీమవరంలో వందల కోట్ల రూపాయల చేపల వ్యాపారం చేస్తున్నారని, ఈ వ్యాపారంలో అక్రమాలకు పాల్పడుతున్నారని క్రిశాంక్ అంటున్నారు. త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి రేవంత్ రెడ్డి అక్రమ వ్యాపారాల నిగ్గు తేల్చాలని కోరనున్నట్లు క్రిశాంక్ వెల్లడించారు. 2011లో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జన్వాడలో అనుమతులు ఇస్తే ఆయన క్యాబినెట్‌లో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదని క్రిశాంక్ ప్రశ్నిస్తున్నారు.

గోపన్‌పల్లిలో రేవంత్ రెడ్డి అడ్డంగా ఇరుక్కుపోయారని, ఆయన దగ్గర సమాధానం లేకే జన్వాడ మీద డ్రామా అడుతున్నారని ఆయన ఆరోపించారు. ఆధారాలతో సహా అడ్డంగా దొరికపోయిన రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేస్తే.. దాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండిచడం సిగ్గు చేటని క్రిశాంక్ వ్యాఖ్యానించారు. సొంత పార్టీ నేతలే రేవంత్ రెడ్డి వ్యవహారాలను అసహ్యించుకుంటున్నారని ఆయనంటున్నారు. సోషల్ మీడియాలో ఎంపీ రేవంత్ రెడ్డి మాఫియా చేస్తున్న అసత్య ప్రచారాలపై కోర్టుల్లో కేసులు వెయ్యబోతున్నామని హెచ్చరించారు క్రిశాంక్.