లాక్ డౌన్ పొడిగించాలంటూనే మెలిక పెట్టిన కేసీఆర్

| Edited By: Pardhasaradhi Peri

Apr 11, 2020 | 5:09 PM

దేశంలో లాక్ డౌన్ పొడిగించాలంటూనే మెలిక పెట్టేశారు తెలంగాణ ముఖ్యమంత్రి. మరో రెండు వారాలు పొడిగిస్తే కరోనా కంట్రోల్ అవుతుందంటూనే కొత్త అంశాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందుకు నెట్టారాయన.

లాక్ డౌన్ పొడిగించాలంటూనే మెలిక పెట్టిన కేసీఆర్
Follow us on

దేశంలో మరో రెండు వారాలపాటు లాక్ డౌన్‌ని కొనసాగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సూచించారు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు. ఈ విషయంలో తాము ఇదివరకే తమ అభిప్రాయాన్ని తెలియజేశామని పునరుద్ఘాటించారు కేసీఆర్. కరోనా కట్టడికి మరో మార్గమే లేదని చెప్పిన కేసీఆర్.. కేంద్రం తీసుకునే నిర్ణయాన్ని తాము సమర్థిస్తామని తెలియజేశారు.

లాక్ డౌన్ పొడిగింపును కోరుతూనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ మెలిక పెట్టారు. లాక్ డౌన్ కారణంగా కేంద్ర, రాష్ట్రాలు సమానంగా రాబడిని కోల్పోతున్నాయి. కేంద్ర, రాష్ట్రాల్లో ఆర్థిక వనరుల కొరత ఏర్పడుతోంది. ఈ సమస్య రాష్ట్రంతోపాటు.. జాతీయ స్థాయిలోను వుంది. కానీ కేసీఆర్ కేంద్రాన్ని ఆర్థిక సాయం కోరారు. లాక్ డౌన్ కొనసాగించమంటూనే తెలంగాణకు ఆర్థిక వనరులను కేటాయించాలని విఙ్ఞప్తి చేశారు సీఎం కేసీఆర్.

రాష్ట్రంలో ఈ వ్యవసాయ ఉత్పత్తులను తమ ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది కాబట్టి కేంద్రం ఆర్థిక సహాయం అందించాలి… ఇది మోదీతో శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విఙ్ఞప్తి. అప్పులు, రాష్ట్రం చెల్లించాల్సిన నెలసరి చెల్లింపుల విషయంలో రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించాలని ఆయన మోదీని కోరారు. వచ్చే ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విత్తనాలు, ఎరువులు అందేలా చూడాలని కేసీఆర్ సూచించారు. రాష్ట్రాలతోపాటు కేంద్రం కూడా ఆర్థికంగా పెద్ద ఎత్తున నష్టాల్లో వున్న సమయంలో ఒకవైపు మద్దతిస్తూనే మరోవైపు కొత్త కోరికలు ప్రధాని ముందుంచడం కేసీఆర్ రాజకీయ చతురతకు నిదర్శనమని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.