KCR desicion కేసీఆర్ తాజా నిర్ణయం.. ఆ నిబంధనకు సడలింపు

|

Apr 03, 2020 | 4:50 PM

లాక్ డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రజలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి కార్యాలయం శుక్రవారం వెల్లడించింది.

KCR desicion కేసీఆర్ తాజా నిర్ణయం.. ఆ నిబంధనకు సడలింపు
Follow us on

KCR relaxed one of lack-down condition: లాక్ డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రజలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. కరోనా వ్యాప్తి భయం ఒకపక్క, లాక్ డౌన్ పీరియడ్‌లో సమస్యలు మరోపక్క… జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి నిర్ణయం ప్రజలకు చల్లని కబురు మోసుకొచ్చిందని అధికారవర్గాలంటున్నాయి.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 2.80 కోట్ల మంది రేషన్ లబ్ధిదారులకు ఉచితంగా 12 కిలోల బియ్యాన్ని అందిస్తామని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి లబ్ధిదారుడికి బియ్యం అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని పౌరసరఫరాల శాఖ ప్రకటించింది. రేషన్ పంపిణీపై శుక్రవారం విడుదలైన కేసీఆర్ ఆదేశాల మేరకు కూపన్ తీసుకున్న వారు, తీసుకోని వారు ఒకేసారి రేషన్ షాపులకు రావడంతో రద్దీ పెరుగుతోందని, కూపన్ తీసుకున్న వారు మాత్రమే రేషన్ షాపులకు రావాలని అధికారులు అంటున్నారు.

స్టేట్ డాటా సెంటర్ (ఎడీసీ)లో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కొన్ని చోట్ల సర్వర్ డౌన్ అయిందని, దీనిపై పౌరసరఫరాల శాఖ కమిషనర్, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరించారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ప్రజలకు చల్లని కబురు తెచ్చిందంటున్నారు. రేషన్ సరుకుల పంపిణీని 15 రోజుల పాటు కొనసాగించాలని ముఖ్యమంత్రి తాజాగా ఆదేశించారని, దాంతో రేషన్ కోసం ఎవరూ కంగారు పడొద్దని అధికారులు చెబుతున్నారు.

ఏప్రిల్ నెల మొత్తం రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తామని, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు రేషన్ షాపులు నిరంతరాయంగా తెరిచే ఉంటాయని అధికారులు వెల్లడించారు. గతంలో ఉన్న 15వ తేదీ వరకు రేషన్ ఇచ్చే నిబంధనను ఎత్తివేస్తున్నామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్నవితరణ్ పోర్టల్‌లో రేషన్ వివరాలు నమోదు కోసం తప్పనిసరిగా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయవలసి వస్తోందని, అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కొన్ని నిబంధనలను సడలించిందన్నారు.

వారికి బయో మెట్రిక్ అక్కర్లేదు

వరుసగా మూడు నెలలు రేషన్ తీసుకున్న వారు వేలిముద్ర వేయకుండానే అంటే బయో మెట్రిక్ లేకుండానే రేషన్ తీసుకునే సదుపాయం కల్పించిందని, పోర్టబిలిటీ ద్వారా రేషన్ తీసుకునే వారికి మాత్రం వేలిముద్రను వేసి బియ్యం తీసుకోవాలన్నారు. రేషన్ బియ్యం తీసుకుంటేనే 1500 రూపాయల నగదు ఇస్తారనే ప్రచారాన్ని నమ్మొద్దని లబ్ధిదారులకు విజ్ఞప్తి చేశారు. బియ్యం తీసుకున్నా, తీసుకోకపోయినా రెండు, మూడు రోజుల్లో 87.59 లక్షల కుటుంబాలకు ఆన్ లైన్ ద్వారా 1500 నగదును వారి ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన కసరత్తును అధికార యంత్రాంగం ఇప్పటికే పూర్తిచేసిందని అన్నారు.