నిండు గర్భిణికి గుండెపోటు.. కవల పిల్లలతో సహా మృతి

|

Jun 05, 2020 | 4:47 PM

ఐవీఎఫ్​సెంటర్​ వైద్యంతో గర్భందాల్చింది ఆ మహిళ. ఏకంగా కవల పిల్లలకు జన్మనిస్తుందని తేలడంతో సంబురంలో మునిగిపోయింది ఆ కుటుంబం. నిండు గర్భిణీ గుండెపోటుతో పిల్లలతో సహా మృతి చెందడంతో తీవ్ర విషాదం.

నిండు గర్భిణికి గుండెపోటు.. కవల పిల్లలతో సహా మృతి
Follow us on

పెళ్లై 13 ఏళ్లుగా పిల్లల కోసం ఆ దంపతులు పరితమించారు. ఎట్టకేలకు ఐవీఎఫ్​సెంటర్​ వైద్యంతో గర్భందాల్చింది ఆ మహిళ. ఏకంగా కవల పిల్లలకు జన్మనిస్తుందని తేలడంతో సంబురంలో మునిగిపోయింది ఆ కుటుంబం. అంతలోనే ఆ ఫ్యామిలీని విషాదం వెంటాడింది. నిండు గర్భిణి గుండెపోటుతో పిల్లలతో సహా మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండకు చెందిన జూపాక కనకయ్య, సైదాపూర్ మండలం ఎలబోతారం గ్రామానికి చెందిన స్వరూప(38)లకు 13 ఏళ్ల కిందట వివాహం జరిగింది. ఏళ్లు గడుస్తున్నా ఆ దంపతులకు పిల్లలు కలగలేదు. పిల్లల కోసం అనేక గుళ్లు గోపురాలతో సహా ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. చివరికి వరంగల్​ జిల్లాలోని ఓ ఐవీఎఫ్​సెంటర్​లో వైద్యంతో ఎనిమిది నెలల కిందట స్వరూప గర్భం దాల్చింది. స్కానింగ్ చేసిన వైద్యులు కవల పిల్లలుగా తేల్చారు. దీంతో తమ కల సాకారం కాబోతుందని ఆ దంపతులు ఆనందంలో మునిగిపోయారు. 8 నెలలు నిండటంతో స్వరూప ఇటీవలే ఎలబోతారంలోని తన పుట్టినింటికి వెళ్లింది. గురువారం చాతినొప్పి రావడంతో హుజూరాబాద్​ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. బీపీ అధికమవ్వడంతో పరిస్థితి విషమించడంతో ఐసీయూకు తరలిస్తుండగా.. స్వరూప తుదిశ్వాస విడిచింది. కనీసం పిల్లలనైనా బతికించాలని స్వరూప భర్త కనకయ్య డాక్టర్లను ప్రాథేయపడ్డాడు. దీంతో స్వరూపకు ఆపరేషన్​ నిర్వహించిన వైద్యులు. అప్పటికే కవలలు కూడా మృతిచెందారని తెలిపారు. దీంతో ఆ కుటుంబం తీవ్ర శోకసముద్రంలో మునిగిపోయింది.