TPCC CHIEF: టీపీసీసీ చీఫ్‌ రేసులో నేను కూడా అంటున్న ఎమ్మెల్యే.. పదవి ఇస్తే ఇది చేస్తానంటూ ఇంట్రస్టింగ్ కామెంట్స్..

| Edited By: Pardhasaradhi Peri

Dec 07, 2020 | 5:40 PM

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ తెలంగాణ పీసీసీ చీఫ్‌ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

TPCC CHIEF: టీపీసీసీ చీఫ్‌ రేసులో నేను కూడా అంటున్న ఎమ్మెల్యే.. పదవి ఇస్తే ఇది చేస్తానంటూ ఇంట్రస్టింగ్ కామెంట్స్..
Follow us on

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ తెలంగాణ పీసీసీ చీఫ్‌ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాతో తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ పడే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. కాంగ్రెస్ పార్టీలో అందరూ సీనియర్లు కావడంతో ఆ పదవికి తాము అర్హులమంటే తామే అర్హులమని ప్రకటనలు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి వారు తానే టీపీసీసీ చీఫ్ పదవికి అర్హుడిని అని ప్రకటించుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేరారు. సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కొత్త తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకం కోసం ప్రాసెస్ నడుస్తోందని అన్నారు. అయితే పీసీసీ రేస్‌లో తాను కూడా ఉన్నట్లు స్పష్టమైన ప్రకటన చేశారు. పార్టీని బలోపేతం చేసే మెడిసిన్ తన దగ్గర ఉందని, తనను పీసీసీ చీఫ్‌గా నియమిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవాన్ని తీసుకువస్తానని చెప్పుకొచ్చారు. పీసీసీ అధ్యక్షుడి వద్ద డబ్బులు ఉండాలనేది తప్పుడు అభిప్రాయం అన్నారు. ప్రస్తుతం భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ నేతల్లో ఐక్యత మాత్రం దెబ్బ తినదని జగ్గారెడ్డి అలియాస్ తూర్పు జయప్రకాష్ రెడ్డి చెప్పుకొచ్చారు.

ఇదిలాఉండగా, కేంధ్ర ప్రభుత్వ విధానాలపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తోందని ఆరోపించారు. రైతులను నాశనం చేసే వ్యవసాయ చట్టాలు తెచ్చిందంటూ ధ్వజమెత్తారు. అంబానీ, అదాని, అమెజాన్‌లకు లాభం చేకూర్చడానికే మోదీ ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిందని ఆయన ఆరోపించారు. ఈ చట్టాల వల్ల దేశంలో రైతులు అనేవారే లేకుండా పోతారని అన్నారు. రైతు సంఘాల భారత్‌ బంద్‌కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని జగ్గారెడ్డి ఉద్ఘాటించారు. రైతు ఉద్యమానికి సంఘీభావంగా బాంబే హై వే ను దిగ్బంధిస్తామన్నారు. తాను సంగారెడ్డిలో హై వేపై కూర్చుంటానని జగ్గారెడ్డి ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తున్నారని, అసెంబ్లీని సమావేశ పరిచి వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.