ఆ లేఖ చూపిస్తేనే జనరల్ బాడీ మీటింగ్…అజారుద్దీన్‌‌కు చక్కలు చూపిస్తున్న కార్యదర్శులు

|

Dec 14, 2020 | 10:04 PM

కార్యవర్గం తీర్మాన లేఖను ఇస్తేనే జనరల్‌ బాడీ మీటింగ్‌కి అనుమతించగలమంటున్నారు సీపీ. అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్ణయం లేకుండా మీటింగ్‌ ఏర్పాటు అనైతికమని అజారుద్దీన్‌ ముందే ఓ బౌన్సర్‌ వేసేశారు. తాజా ప్రతిష్ఠంభనతో వివాదం మరింత ముదిరింది...

ఆ లేఖ చూపిస్తేనే జనరల్ బాడీ మీటింగ్...అజారుద్దీన్‌‌కు చక్కలు చూపిస్తున్న కార్యదర్శులు
Follow us on

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో ఫైటింగ్‌ నడుస్తోంది. జనరల్‌ బాడీ మీటింగ్‌కి అనుమతి విషయంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌, మిగిలిన కార్యవర్గ సభ్యుల మధ్య గ్యాప్‌ పెరిగింది. ఈనెల 20న జనరల్‌ బాడీ మీటింగ్‌కి అనుమతించాలని రాచకొండ సీపీ మహేష్‌భగవత్‌ను కోరారు హెచ్‌సీఏ సెక్రటరీ విజయానంద్‌.

కార్యవర్గం తీర్మాన లేఖను ఇస్తేనే జనరల్‌ బాడీ మీటింగ్‌కి అనుమతించగలమంటున్నారు సీపీ. అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్ణయం లేకుండా మీటింగ్‌ ఏర్పాటు అనైతికమని అజారుద్దీన్‌ ముందే ఓ బౌన్సర్‌ వేసేశారు. తాజా ప్రతిష్ఠంభనతో వివాదం మరింత ముదిరింది.

టీమిండియా మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ అధ్యక్షుడిగా గెలవటంతో… హెచ్‌సీఏలో కొత్త శకం మొదలవుతుందనుకున్నారు. అయితే అజారుద్దీన్‌ ఎన్నికైనప్పట్నించీ కార్యవర్గంలో కుమ్ములాట మొదలైంది. కార్యవర్గం రెండువర్గాలుగా చీలిపోవటం కొత్త వివాదాలకు తెరలేపింది. అజహరుద్దీన్‌, మిగిలిన కార్యవర్గ సభ్యుల మధ్య గ్యాప్‌ పెరిగిపోయింది.

జనరల్‌ బాడీ మీటింగ్‌ విషయంలో ప్రెసిడెంట్‌, సెక్రెటరీ ఏకాభిప్రాయంతో లేరు. సమావేశమై అంతా ఓ మాటనుకునే పరిస్థితి కనిపించడం లేదు. కొత్త కార్యవర్గంలో వివాదాలతో హెచ్‌సీఏ పరిస్థితి మరింత దిగజారిందంటున్నారు క్రికెటర్లు. ఆధిపత్యపోరుతో చివరికి హెచ్‌సీఏ ఉనికే ప్రమాదంలో పడేలా ఉందని ఆందోళన పడుతున్నారు.

అజారుద్దీన్‌ నిర్ణయాలతో హెచ్‌సీఏ కార్యవర్గం విభేదిస్తోంది. అటు తన మాట వినని కార్యవర్గంతో సంబంధం లేదన్నట్లు ఉంటున్నారు హెచ్‌సీఏ అధ్యక్షుడు. హెచ్‌సీఏ రాజ్యాంగం ప్రకారం అంబుడ్స్‌మన్‌ నియామకానికి అజర్‌ చేసిన ప్రతిపాదనను ఐదుగురు కార్యవర్గ సభ్యులు వ్యతిరేకించారు. వారి అభ్యంతరాలను పట్టించుకోకుండా జస్టిస్‌ దీపక్‌ వర్మను అంబుడ్స్‌మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు అజారుద్దీన్‌. కొందరు కోర్టులో సవాలు చేయటంతో.. హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు అజారుద్దీన్‌ ఉత్తర్వుని సస్పెండ్‌ చేసింది. అప్పటినుంచీ అగాధం మరింత పెరిగిపోయింది.

అజారుద్దీన్‌కి, హెచ్‌సీఏ కార్యవర్గంలోని మిగిలిన సభ్యుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు కొందరు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అజారుద్దీన్‌తో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు సభ్యులు. ఎలాగైనా ఈ నెల్లోనే ఏజీఎం నిర్వహించి..అజారుద్దీన్‌కి చెక్‌ పెట్టాలనుకుంటున్నారు. అటు అజార్‌ కూడా వెనక్కి తగ్గకుండా తెగేదాకా లాగేందుకే సిద్ధమవుతున్నారు.