Importance of Kanuma Festival: వ్యవ‘సాయానికి‘ కృతఙ్ఞతగా కనుమ పండుగ.. ఆ పర్వదినాన ప్రయాణం కూడదు.. కారణమేంటో తెలుసా?

|

Jan 13, 2021 | 12:40 PM

పంటలు ఇంటికి వచ్చినందుకు ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో జరుపుకునే పండుగే సంక్రాంతి. మూడు రోజుల్లో మూడో రోజున కనుమును పశువుల పండుగగా జరుపుకుంటారు. వ్యవసాయంలో సాయం చేసిన పశువులను కుటుంబ సభ్యుల్లా భావిస్తారు. కొత్త ధాన్యం ఇంటికి వచ్చే..

Importance of Kanuma Festival: వ్యవ‘సాయానికి‘ కృతఙ్ఞతగా కనుమ పండుగ.. ఆ పర్వదినాన ప్రయాణం కూడదు.. కారణమేంటో తెలుసా?
Follow us on

Importance of Kanuma Festival: పంటలు ఇంటికి వచ్చినందుకు ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో జరుపుకునే పండుగే సంక్రాంతి. మూడు రోజుల్లో మూడో రోజున పశువులకు కృతజ్ఞతగా కనుమ పండుగగా జరుపుకుంటారు. వ్యవసాయంలో సాయం చేసిన పశువులను కుటుంబ సభ్యుల్లా భావిస్తారు. కొత్త ధాన్యం ఇంటికి వచ్చే సందర్భంగా జరుపుకునే వేడుక. పంటల కోసం ఆరుగాలం శ్రమించే రైతన్నలకు వ్యవసాయంలో అండగా నిలిచేవి పశువులే. అందుకే మూడు రోజుల సంక్రాంతి వేడుకల్లో ఒక రోజును పశువులకు కృతజ్ఞతలు తెలపడానికి కేటాయిస్తారు. అదే కనుమ పండుగ. మరి పశువులకు కృతజ్ఞతలు తెలపడానికి రైతులు ప్రత్యేకంగా అలంకరిస్తారు. రైతులు ఆవులు, ఎద్దులతో తమకున్న అనుబంధాన్ని చాటుకుంటారు. వాటితో కనుమ రోజున ఎటువంటి పనీ చేయించరు. ఉదయమే పశువులను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో పూజిస్తారు. మెడలో గల్లుగల్లుమనే మువ్వల పట్టీలు కడతారు. కొమ్ములకు కూడా ప్రత్యేకంగా రంగులు వేసి అలంకరిస్తారు. పశువులకు కొత్త ధాన్యంతో వండిన పొంగలి తినిపిస్తారు.పశువులను తమ కుటుంబంలో ఒకరిగా భావించి వేడుక చేస్తారు. ప్రత్యేకంగా చేసిన పిండివంటలను వాటికి నైవేద్యంగా పెడతారు.

రైతన్నకు వ్యవసాయంలో అరక దున్నుతూ, బండి లాగుతూ ఏడాదిలో 364 రోజులూ ఎడ్లు కష్టపడతాయి. వ్యవసాయ పనుల్లో రైతన్నకు అండగా నిలుస్తాయి. రైతుల కుటుంబం సంతోషంగా ఉండడానికి పశువులు తమ వంతు సహకారం అందిస్తున్నాయి. అందుకే ఆ పశువులకు కనుమ రోజున రైతన్నలు కృతజ్ఞతలు తెలపడం ఆనవాయితీ. ఇక తెలంగాణలో ఎడ్లను అందంగా అలంకరించి, ఆవులు, గేదెలను చెరువులకు తీసుకెళ్తారు. అక్కడే మట్టితో ఇళ్లలాంటి గడులను నిర్మించి వాటి మధ్యన నిల్చోబెట్టి ఆరాధిస్తారు

ఇక కనుమ రోజున జోరుగా కోడిపందాలు నిర్వహించడం కూడా ఆనవాయితీ. అయితే ఈ పందాలపై కోర్టు నిషేధం విధించింది. కోట్ల రూపాయల పందాలు నిర్వహించే పందెం రాయుళ్లు… పందెంలో మరణించిన కోడిపుంజును వండుకు తినడానికి పోటీ పడతారు. కనుమ రోజున మాంసాహారం తినడం కూడా ఆనవాయితీ. ఇక కనుమ రోజున మినుము తినాలనేది సామెత. అయితే శాఖహారులు ఎక్కువగా మినుముతో చేసిన గారెలు, ఆవడలు తినడానికి ఇష్టపడతారు. కనుమ రోజున ప్రయాణాలు చేయడం అరిష్టంగా భావిస్తారు.

అందుకే తెలుగువారికి సంక్రాంతి అంటే కేవలం ఒక్కరోజు పండుగ కాదు… భోగి, సంక్రాంతి, కనుమలు కలిసిన మూడు రోజుల పండుగ. కనుమ రోజు ఇంత హడావుడి ఉంటుంది కాబట్టి, ఆ రోజు కూడా ఆగి… పెద్దలను తల్చుకుని, బంధువులతో కాస్త సమయం గడిపి, విశ్రాంతి తీసుకుని… మర్నాడు ప్రయాణించమని చెబుతారు. అందుకే ‘కనుమ రోజు కాకి కూడా కదలదు’ అన్న సామెత పుట్టి ఉండవచ్చు. కనుమ రోజు ప్రయాణం చేయకూడదని పెద్దలు చెప్పిన మాట వెనుక ఇంత కథ ఉంది. అత్యవసరం అయితే తప్ప.. ఆ మాట దాటకూడదనీ… ఒకవేళ కాదూకూడదంటూ కనుమ రోజు ప్రయాణం చేస్తే ఆటంకాలు తప్పవని అంటారు. ఇక కొన్ని ప్రాంతాల్లో కనుమ మరుసటి రోజును ముక్కనుమ అంటారు.

Also Read: మకర సంక్రాంతి అంటే ఏమిటి..? ఈరోజుని పెద్దల పండుగని ఎందుకు అంటారో తెలుసా..?