Makar Sankranti:పుడమి పుస్తకంలో ప్రకృతి రాసుకున్న మధురమైన కవిత, గీసుకున్న అద్భుతమైన చిత్రిక సంక్రాంతి పండుగ

| Edited By: Pardhasaradhi Peri

Jan 14, 2021 | 11:21 AM

సంక్రాంతి అంటే పెద్ద పండుగ. పెద్దల పండుగ. పంటల పండుగ. పశువుల పండుగ. పుడమి పుస్తకంలో ప్రకృతి రాసుకున్న మధురమైన కవిత.

Makar Sankranti:పుడమి పుస్తకంలో ప్రకృతి రాసుకున్న మధురమైన కవిత, గీసుకున్న అద్భుతమైన చిత్రిక సంక్రాంతి పండుగ
Follow us on

సంక్రాంతి అంటే పెద్ద పండుగ. పెద్దల పండుగ. పంటల పండుగ. పశువుల పండుగ. పుడమి పుస్తకంలో ప్రకృతి రాసుకున్న మధురమైన కవిత. గీసుకున్న అద్భుతమైన చిత్రిక. హరితవర్ణపు చీర ను కట్టుకుని, బంతి చేమంతులను జడలో తురుముకుని, రంగవల్లికల రంగుల దారిలో నడిచి వచ్చే సంక్రాంతి దేవతను చూసి మురిసిపోని మనిషి వుండడు. సంబరపడే కర్షకుడు వుండడు. మనిషికి తెలిసిన తొలి పండుగ సంక్రాంతే! బీడు నేలను దుక్కి దున్ని పంటసిరిగా మార్చిన మానవుడికి ఇదే తొలి పండుగ. అప్పట్నుంచే మనిషి జీవితం బహు ముఖాలుగా, బహు విధాలుగా వికసించింది. అభ్యున్నతి దిశగా అడుగులు వేసింది. దీనంతటికి కారణం సూర్యుడు. సూర్య భగవానుడే మనకు జీవాధారం. సమస్త జీవరాశికి, వృక్షజాతి మనుగడకు ఆయనే కారణం. సంక్రమణం అంటే గమనం. సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి అడుగుపెట్టడాన్ని సంక్రమణం అంటాం. ఏడాదిలో సూర్యుడు పన్నెండు రాశులలో ప్రవేశిస్తాడు. ఈ నెలలో ప్రవేశించేది మకర రాశిలోకి. అందుకే ఇది మకర సంక్రాంతి అయ్యింది. పుష్యమాసంలో వచ్చే మకర సంక్రమణం ఉత్తరాయణానికి నాంది. ఇది పుణ్యప్రదం కూడా. అందుకే మకర సంక్రాంతి శుభవేడుకగా మారింది.

సంక్రాంతి లక్ష్మి ఒంటరిగా రాదు. వణికించే చలిని, కురిసే మంచును తరిమికొట్టే మంటల కిరీటంతో మందు భోగిని, వెనుక కనుమను వెంటేసుకుని చెలికత్తెల మధ్య రాజకుమారిలా వస్తుంది.. సంక్రాంతి కాంతి నిచ్చే పండుగ. అందాల పండుగ. ఆనందాల పండుగ. పతంగుల పండుగ. ముగ్గుల పండుగ. గొబ్బెమ్మల పండుగ. హరిదాసుల పండుగ. గంగిరెద్దుల పండుగ. పాటల పండుగ. జానపదాల పండుగ. జనపదాల పండుగ. సర్వశుభాలను కలిగించే పర్వదినం.. శోభాయమాన పర్వదినం. హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల సందడి ఇవన్నీ సంక్రాంతి పండుగనాళ్ళలో కనిపిస్తుంటాయి. భోగి, మకర సంక్రాంతి, కనుము అనే మూడు రోజుల పెద్దపండుగగా సంక్రాంతిని జరుపుకుంటారు. ప్రళయస్థితిలో భూమండలం సముద్రంలో మునిగి వుండేది. ఆదివరాహ రూపంలో శ్రీమహావిష్ణువు భూమిని మకర సంక్రాంతి రోజునే భూమిని ఉద్దరించాడన్నది పురాణకథనం. వామనావతారంలో విష్ణువు బలిచక్రవర్తి శిరస్సుపై కాలుపెట్టి పాతాళానికి తొక్కింది కూడా ఈ రోజునే. మహాభారత యుద్ధంలో కురువృద్ధుడు భీష్ముడు అవసాన దశలో అంపశయ్యపై వుండి ఉత్తరాయణ పుణ్యకాలం వరకూ వేచివుండి అశువులు విడిచాడట! పుణ్యగతులు మకర సంక్రమణం రోజున సంప్రాప్తిస్తాయని, ఈ నెలలో వైకుంఠ ద్వారాలు తెరిచి వుంటాయని పెద్దలంటారు. ఇలా ఎన్నో విశేషాలు, పుణ్యఫలాలు మూటగట్టుకున్న పండుగ కనుకే ఇది పెద్దల పండగ అయ్యింది. పెద్ద పండుగగా మారింది.

 

సంక్రాంతి వేడుక నిజంగా కనుల పండుగ. ఈ రోజుల్లో స్త్రీలు తెలవారుజామున లేచి వాకిళ్లలో ముగ్గులు పెడతారు. వాటి చుట్టూ వైకుంఠ ద్వారాలు తెరుస్తారు. వేకువజామున సాతాని జియ్యర్లు, జంగమదేవరలు, బుడబుక్కల దొరలు, పంబలవాండ్లు, గంగిరెద్దుల మేళాలు ఇంటింటికీ వస్తారు. ఆటపాటలతో అలరిస్తారు. దీవెనలందిస్తారు. ఇలా పర్వదినాలన్నీ ఇలా సంబరాల పర్వంలా గడుస్తాయి. తెలంగాణ ప్రాంతంలో నీలాకాశాన్ని పంతంగులు రంగుల హరివిల్లులా మార్చేస్తాయి. కనువిందుచేస్తాయి. ఈ పండుగకి లక్ష్మీదేవికి సంబంధం వుందని ఒరిస్సా ప్రజల నమ్మకం. ఈ శుభదినాల్లో పేదలకు వరాలిస్తూ ఆమె దళితుల ఇళ్లలోకి ప్రవేశించిందట! అప్పుడు జగన్నాథుడు తన సోదరుడైన బలభద్రుని ప్రేరణతో ఆమెని వెలివేశాడట! అయినా లక్ష్మీదేవి లెక్కచేయలేదు. మార్గశిర, పుష్యమాసాల్లో మరింత మంది బీదల ఇళ్లకు వెళ్లి వరాలు కురిపించిందట! అందువల్లనే ఈ మాసాల్లో లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ప్రతి ముంగిలిలోనూ రంగవల్లులు తీర్చిదిద్దుతారు. ఆమె మెత్తని పాదాలు కందిపోకుండా వుండటానికి ఆవుపేడ ముద్దలపై తామరలు, గుమ్మడి పువ్వులు అమరుస్తారు. ఈ మాసంలో గొబ్బి లక్ష్మిని పూజించటం కూడా ఆనవాయితీ. గొబ్బి లక్ష్మి అంటే భూమాతే! ఆమెను కొలిస్తే సస్యాలను ప్రసాదిస్తుందని జనుల విశ్వాసం. ఒక్కో ప్రాంతంలో ఒక్కో కథనం. ఒక్కో విధానం.

సంక్రాంతి ముచ్చటైన పండుగ. మూడు రోజుల పండగ. మొదటి రోజు భోగి. రెండవనాడు సంక్రాంతి. మూడో రోజు కనుమ. మొదటిరోజున ఇళ్లముందు, కూడళ్లలోనూ భోగిమంటలు వేస్తారు. విరిగిన కొయ్యలు, పాత చెక్క సామాన్లు మంటల్లో వేస్తారు. చిన్నారులు భోగిదండలు వేసి మంటల చుట్టూ తిరుగుతూ పాటలు పాడతారు. చలినుంచి తరిమేసి వెచ్చని గాలుల్ని ఆహ్వానిస్తారు. నవ్యతకు నాంది పలకడటానికి ఇది చక్కటి ప్రతీక. భోగి పండుగ నాడు సాయంత్రం చిన్న పిల్లలకు రేగుపళ్లు, చిల్లర నాణాలు, శనగలు, పువ్వులు వంటివన్నీ కలిపి భోగిపళ్లు పోస్తారు. ఈ పళ్లు పిల్లలపై పోస్తే విష్ణుమూర్తి కరుణాకటాక్షాలు లభిస్తాయని ఓ నమ్మకం. భోగభాగ్యాలను స్వాగతించే ఆకాంక్షకి ఈ వెడుక అద్దంపడుతుంది.ఇదేరోజున వైష్ణవాలయాలలో గోదాదేవి కల్యాణం జరుగుతుంది. ఊళ్లలో కోళ్ల పందాలు ఊపందుకుంటాయి. పొట్టేళ్ల పందాలు పోటాపోటీగా జరుగుతాయి.

సంక్రాంతి నాడు ఇంటింటా సంబర వాతావరణం నెలకొంటుంది. ముగ్గులు తీర్చిన వాకిళ్ల అందాలు వర్ణనాతీతం. పసుపు మిసమిసలతో గడపలు మెరిసిపోతాయి. పచ్చని తోరణాలతో గుమ్మాలు కళకళలాడతాయి. సంక్రాంతి రోజున సూర్యారాధనతోపాటు పూజలు, తర్పణాలు, దానాలు లాంటివి చేస్తుంటారు. వ్యవసాయాధారిత దేశం కాబట్టి ఈ పండుగలో ఎక్కువగా ఆ సంబంధమైన విషయాలే కనిపిస్తుంటాయి. సంక్రాంతి పండుగకు పంట ఇంటికి రావడం, ధనధాన్యాలతో ఇళ్ళన్నీ కళకళలాడుతుండటం జరుగుతుంటుంది. పండుగపూట ఉదయాన్నే లేచి ఇంటందరూ తలారా స్నానాలుచేసి కొత్తబట్టలు కడతారు. పిండివంటలు మామూలే.. కొత్త అల్లుళ్ల సందడి సరేసరి. బావామరదళ్ల హాస్యోక్తులు, సరదాలకు లొటుండదు. ఈ కారణంగానే గ్రామాల్లో బావామరదళ్ల సయ్యాటలతో కూడిన జానపద గీతాలు వినిపిస్తాయి. సంక్రాంతి వేడుక అంటే సరదాల వేడుక అని చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి.?

కనుమ… ఇది ప్రధానంగా వ్యవసాయదారులకు ప్రీతిప్రాప్తమైన పండుగ. తమకు సహకరించిన గోవులను, పశువులను, వ్యవసాయపనిముట్లను భక్తి శ్రద్ధలతో అర్చిస్తారు. ఆవులు, పాడిగేదెలు, కోడెదూడలు, పెయ్యలు, ఎడ్లకు కుంకుమ బోట్లు పెట్టి భక్తి చాటుకుంటారు. కొన్నిచోట్ల తప్పెట్లు తాళాలతో వీటిని ఊరేగిస్తారు. ఈరోజు ప్రయాణాలు పెట్టుకోరు. సంక్రాంతి పండుగలో అంతర్లీనంగా శాస్ర్త, సామాజిక అంశాలు ఎన్నెన్నో వున్నాయి.. నువ్వులు, జొన్నలు, సజ్జలు, బియ్యం వంటి ధాన్యాలు-బీర, పొట్ల, చిక్కుడు, గుమ్మడి వంటి కూరగాయలతో ఆహార పదార్ధాలను వండి తినడం ఆరోగ్యకరం.. కొంత మంది ముక్కనుమ పండుగను కూడా జరుపుకుంటారు. ఇలా ఆ మూడునాళ్లూ మురిపాలతో, ముచ్చట్లతో గడిచిపోతుంది. ప్రతిఇల్లూ ఆనందాల లోగిలిగా మారిపోతుంది.

జనవరి మాసంలో వాతావరణం ఆహ్లాదంగా వుంటుంది. మంచుకురిసే వేళలో శీతగాలులు గిలిగింతలు పెట్టే కాలంలో సూర్యుడు మకర సంక్రాంతి రోజున ఉత్తరాయణ పథంలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఈ సమయంలో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి, సూర్యభగవానుని అనుగ్రహం పొందిన వారికి సిరిసంపదలకు, సుఖసంతోషాలకు లోటుండదని భక్తుల భావన. తెలుగు వారు అత్యంత ప్రీతిపాత్రంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలలో ఈ పండగని సంక్రాంతి అనే పిలుస్తారు. తమిళులు పొంగల్‌ అంటారు. మహారాష్ట్రులు, గుజరాతీలు మకర్‌ సంక్రాంతి అని, పంజాబ్‌, హర్యాలలో లోరీ అని వ్యవహరిస్తారు. ఈ పుణ్యదినాల్లో చేసే దానాలు ఎంతో శ్రేష్టమని పురాణాలు చెప్తున్నాయి. ధాన్యం, పళ్లు, బట్టలు, కాయగూరలు, నువ్వులు, చెరకు మొదలైనవి దానం చేస్తే మంచిదంటారు. పితృలకు తర్పణలు ఇచ్చే ఆచారమూ వుంది. సంక్రాంతినాడు పాలుపొంగించి, దానితో పరమాన్నం చేస్తారు. ఇదే కాదు- అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, సకినాలు, పాలతాలికలు, సేమియా పాయసం, పులిహోర, గారెలు వంటి వంటకాలు తయారుచేస్తారు. ఇళ్లముందు తీర్చే ముగ్గుల ముచ్చట్ల విషయానికి వస్తే అలికిన వాకిళ్లు నిర్మలాకాశంతో సమానం. ఒక పద్దతి ప్రకారం పెట్టే చుక్కలు రాత్రివేళ కనిపించే నక్షత్రాలకు దర్పణం. చుక్కల చుట్టూ వేసే అల్లికలు ఆకాశంలో కనిపించే మార్పులకు సంకేతం. ముగ్గు మధ్యలో కేంద్రంగా వుండే ముద్దు సూర్యుడి స్థానానికి సూచిక. పండగ ఆఖరి రోజున రథం ముగ్గు వేయడం ఆనవాయితీ..! ముగ్గుల మధ్యలో పెట్టే గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళ్లయిన గోపికలకు సంకేతం. మధ్యలో పెద్దే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవిగా భావిస్తారు. గంగిరెద్దుల మేళానికి ఒక పరమార్ధముంది. శివగణంతో సహా ఆ పరమశివుడు సంక్రాంతి సంబరాలకు హాజరయినట్టుగా గంగిరెద్దుని పెద్దలు వివరిస్తారు. హరిని కీర్తించే భక్తులకు హరిదాసు రాక అనేది పరమ పవిత్ర కార్యంతో సమానం. హరిదాసుని వారు సాక్షాత్‌ శ్రీకృష్ణుడి ప్రతిరూపంగా భావిస్తారు. హరిదాసు తల మీద గుమ్మడి కాయ ఆకారంలో వుండే రాగి అక్షయపాత్ర గుండ్రటి భూమికి సంకేతం. దాన్ని తలపై పెట్టుకోవడం ద్వారా శ్రీహరి అయిన తానే భూమిని ఉద్దరిస్తున్నానని చెప్పడంగా పెద్దలు వివరిస్తారు. “హరిలో రంగ హరీ…” అంటూ కంచుగజ్జెలు ఘల్లుఘల్లున మోగిస్తూ, చిడతలు వాయిస్తూ హరిదాసులు ఇల్లిల్లూ తిరుగుతూ పర్వదిన శోభకే వన్నె తెస్తారు.

సంక్రాంతి అనేది ఉమ్మడి సంస్కృతికి నిదర్శనం. ప్రకృతి శక్తులకు ప్రణమిల్లే పండగ. కాలగమనానికి, సూర్యభగవానుడికి సంబంధించిన సంబరం. మధుర రసాలతో జీవితం రసమయం అయ్యే పండగ. తియ్యని చెరుకుగడలతో, పాలపొంగులతో వర్ధిల్లే పచ్చని వేడుక. ఇది ఇటీవలి భావన కాదు. అనాదిగా వస్తున్న నమ్మకం. మన దేశానికే పరిమితం కాదు. దేశదేశాల్లోనూ వున్నదే. సూర్యభగవానుడు ఎల్లెడలా అనాదిగా ఆరాధనీయుడు. మంచు ప్రదేశాల్లో వెచ్చిన కాంతులు విరజిమ్మే దేవుడు ప్రత్యక్ష దైవంతో సమానం కనుక- ఉత్తరాయణ పథంలో ఆయన ప్రవేశం వారికి కూడా పండగే. లాటిన్‌ అమెరికాలో పురాతత్వ పరిశోధకులు జరిపిన అధ్యయనాల్లో ఆరువేల ఏళ్ల క్రితమే మయ జాతీయులు సంక్రాంతి వంటి పండగని ఘనంగా జరుపుకునే తెలిసింది. ఆచార వ్యవహారాలలో, పేర్లలో కొద్దిపాటి ప్రాంతీయ వ్యత్యాసాలతో దాదాపు దక్షిణాసియాలో అనేక దేశాల్లో ఈ పండుగని ఘనంగా నిర్వహిస్తారు. నేపాల్‌లోని థారూ ప్రజలు ఈ పండగని మాఘీగా, ఇతరులు మాఘే సంక్రాంతిగా జరుపుకుంటారు. థాయ్‌లాండ్‌లో జరిగే సోంగ్‌క్రాన్‌, లావోస్‌లో జరిగే పి మ లావో, మయన్మార్‌లో జరిగే థింగ్‌యాన్‌, కంబోడియాలో నిర్వహించే మోహ సంగ్‌క్రాన్‌ పండగ వంటివి సంక్రాంతి వేడుకలే. ఇక ఉత్తరభారతంలోని అస్సాంలో మాఘ్‌ బిహు లేదా భోగలీ బిహూ అని, కశ్మీర్‌లో శిశుర్‌ సంక్రాంత్‌ అని వ్యవహరిస్తారు.

ఇక సంక్రాంతి పురాణ ప్రాశస్త్యం విషయానికి వస్తే సంక్రాంతి పర్వదినాలలో మహావిష్ణువు రాక్షసులని హతమార్చి, వాళ్ల శిరస్సులు మంధర పర్వతం కింద పాతిపెట్టి దేవతలకి సుఖసంతోషాలు సమకూర్చిపెట్టాడట. అందుకే ఈ పండుగని అశుభాలకి స్వస్తిగా, శుభాలకి స్వాగతంగా భక్తులు విశ్వసిస్తారు. భగీరథుడు కఠోర తపస్సు చేసి గంగానదిని భూమికి అవతరింపచేసింది కూడా సంక్రాంతినాడేనట. అందుకే గంగ సముద్రంలో సంగమించే స్థలంలో మకర సంక్రాంతి పర్వదినాన లక్షలాది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి పితృదేవతలకి తర్పణలిస్తారు. సంక్రాంతి ధర్మాలతో పాటు వైద్య ధర్మాలను కూడా మనకు బోధిస్తుంది.. ధనుర్మాసంలో ఉదయాన్నే పొంగలి తినడం కూడా ఆరోగ్య సూత్రమే! చలికాలంలో చలికి శరీరంలోని చర్మ రంధ్రాలన్నీ మూసుకుపోతాయి. అంచేత శరీరంలోని వేడి బయటికి వెళ్లే మార్గం లేక జీర్ణ కోశాన్ని చేరుతుంది.ఫలితంగా జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది.. అంతేకాకుండా పగటి కంటే రాత్రి హెచ్చు కావడం వల్ల రాత్రి చేసిన భోజనం త్వరగా జీర్ణమైపోతుంది.. అందుకే ఉదయానికల్లా ఆకలి వేస్తుంది…అప్పుడు ఆహారం తీసుకోకపోతే రోగాలు రావడం ఖాయం.. అందుకే భక్తి పేరు చెప్పి ప్రసాదం పేరుతో ఉదయాన్నే పొంగలి పంపకం జరుగుతుంటుంది. భోగి రోజు నువ్వు పిండిని వంటికి పట్టించుకుని పిడుకల మంట దగ్గర శరీరాన్ని కాచుకుంటే చర్మం మెత్తదనం సంతరించుకుంటుంది. కఫం నశిస్తుంది.. గోధుమలు…మినుములు వంటి ధాన్యాలతో చేసిన వంటకాలను తినడం వల్ల వాతం హరించుకుపోతుంది. శరీరానికి బ్రహ్మతేజస్సు లభిస్తుంది..