Hyderabad: మంచినీళ్లు, ఉచితంగా భోజనం.. గణేష్‌ నిమజ్జనానికి జీహెచ్ఎంసీ ఏర్పాట్లు పూర్తి..

| Edited By: Basha Shek

Sep 15, 2024 | 7:35 AM

హైదరాబాద్‌లో ఈనెల 17 న జరిగే గణేష్‌ నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. హుస్సేన్‌సాగర్‌ సహా GHMC పరిధిలోని భారీ చెరువులు, ప్రత్యేకంగా కొలనులు ఏర్పాటు చేశారు.

Hyderabad: మంచినీళ్లు, ఉచితంగా భోజనం.. గణేష్‌ నిమజ్జనానికి జీహెచ్ఎంసీ ఏర్పాట్లు పూర్తి..
Ghmc Commissioner Amrapali
Follow us on

హైదరాబాద్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈనెల 17వ తేదీన హుస్సేన్‌సాగర్‌లో జరిగే మహాగణపతి నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జంట నగరాల్లో 11 రోజులపాటు నవరాత్రి పూజలు అందుకున్న గణనాథుడు నిమజ్జనానికి లక్షలమంది భక్తులు తరలివస్తారు. గణేషుల నిమజ్జనంతోపాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని GHMC కమిషనర్‌ ఆమ్రపాలి తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఐదు పెద్ద చెరువులతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీటి కొలనులలో నిమజ్జనం చేయాలని ఆమె సూచించారు. మొత్తం 140 స్టాటిక్ క్రేన్లు, 295 మొబైల్ క్రేన్లు, 102 మినీటిప్పర్లు, జేసీబీలు, యాక్షన్ టీమ్స్ సిద్ధం చేశామన్నారు. 15 వేల మంది జీహెచ్‌ఎంసీ సిబ్బంది నిమజ్జనం విధుల్లో ఉంటారని వెల్లడించారు.

ట్యాంక్‌బండ్‌తో సహా పలు ముఖ్యమైన చెరువుల వద్ద శానిటేషన్ సిబ్బంది, గజఈతగాళ్లను కూడా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. గణేషుడి నిమజ్జనానికి తరలివచ్చే భక్తుల కోసం ట్యాంక్‌ బండ్‌, సరూర్‌నగర్‌ ప్రాంతాల్లో GHMC తరఫున మంచినీళ్లు, ఉచితంగా భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతంలో నిమజ్జనాల వేళ జరిగిన అనుభవాలను పరిగణలోకి తీసుకుని.. ఈసారి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

నిమజ్జనానికి వచ్చే ప్రధాన రహదారులు, వీధుల్లో స్ట్రీట్‌లైట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గణేష్ నిమజ్జనానికి జోనల్ కమిషనర్లతో పాటు పోలీస్‌శాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ పనిచేస్తారన్నారు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి. మొత్తానికి ఎక్కడా..ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈసారి జీహెచ్ఎంసీ ముందుగానే అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..