స్వయంభు గణపతి దేవాలయం… గణపతిపూలే!

| Edited By:

Oct 22, 2019 | 6:23 PM

సముద్రతీరానికి ప్రత్యేక అందాన్నిచ్చే పర్వతాలతో కూడిన ప్రకృతి రమణీయ ప్రాంతం గణపతిపూలే. సముద్రపు అలలు పర్వత పాదాలను తాకే అపురూప దృశ్యాలు ఇక్కడ కొత్త అందాలను సృష్టిస్తాయి. అలల తాకిడి వల్ల ఇక్కడి సముద్రపు తీరాలు పసిడి, ధవళ కాంతులీనుతాయి. ఇది కొంకణ్ తీరాన గల మనోహరమైన ఓడరేవు. ఈ ప్రాంతం ముంబైకు 375 కిలోమీటర్ల దూరంలో రత్నగిరి జిల్లాలో ఉంది. మహారాష్ట్ర లోని ఈ చిన్న గ్రామం వేగంగా జరుగుతున్న ఆధునిక నాగరికరణకు దూరంగా తన […]

స్వయంభు గణపతి దేవాలయం... గణపతిపూలే!
Follow us on

సముద్రతీరానికి ప్రత్యేక అందాన్నిచ్చే పర్వతాలతో కూడిన ప్రకృతి రమణీయ ప్రాంతం గణపతిపూలే. సముద్రపు అలలు పర్వత పాదాలను తాకే అపురూప దృశ్యాలు ఇక్కడ కొత్త అందాలను సృష్టిస్తాయి. అలల తాకిడి వల్ల ఇక్కడి సముద్రపు తీరాలు పసిడి, ధవళ కాంతులీనుతాయి. ఇది కొంకణ్ తీరాన గల మనోహరమైన ఓడరేవు. ఈ ప్రాంతం ముంబైకు 375 కిలోమీటర్ల దూరంలో రత్నగిరి జిల్లాలో ఉంది. మహారాష్ట్ర లోని ఈ చిన్న గ్రామం వేగంగా జరుగుతున్న ఆధునిక నాగరికరణకు దూరంగా తన సహజసిద్ధమైన రమణీయతతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

స్వయంభు గణపతి దేవాలయం

గణపతిపూలే లోని స్వయంభు గణపతి దేవాలయం ఈ చిన్ని గ్రామానికి గొప్ప ఆకర్షణ. 400 ఏళ్ళ నాటిదని చెప్పబడే ఇక్కడి గణపతి విగ్రహాన్ని ఏకశిల నుండి చెక్కారు. గౌరీ నందనుడైన గణపతి పేరునే ఈ ఊరికి గణపతిపూలే అని పేరు వచ్చింది. దేశంలోని అష్ట గణపతుల దేవాలయాల్లో గణపతిపూలే ఒకటి.

పశ్చిమ ద్వార దేవత

గణపతిపూలేను పశ్చిమ ద్వార దేవతగా పిలుస్తారు. ప్రతి ఏడాది వేలాదిమంది యాత్రికులు గణపతి ఆశిస్సుల కోసం ఇక్కడకు వస్తారు.గణపతిని దర్శించుకోవటానికి వచ్చే భక్తులు ఆయన వెలసిన కొండ చుట్టూ ప్రదక్షిణ చేసి వస్తారు. గణపతిపూలే ప్రకృతి అందాలతో శోభిల్లుతుంది. గణపతి దేవుని పశ్చిమ ద్వారదేవత అంటారు. గణపతిపులే గ్రామంలో ప్రజలు తమ క్షేమానికి కారణం ఈ దేవుని అనుగ్రహమేనని నమ్ముతారు.

పచ్చదనంతో కూడిన అడవులు, సముద్ర తీరం

పచ్చదనంతో కూడిన అడవులు ఇక్కడ ఉన్నాయి. గణపతిపూలేలో మామిడి, వక్క, అరటి, కొబ్బరి వంటి వనాలు ఉన్నాయి. పశ్చిమ తీరం వెంట ఇటువంటి వనాలు ఎక్కువగా ఉంటాయి. గణపతిపులే లోని తీరప్రాంతాలు స్వచ్చమైన నీటితో బాటు అపరిమితమైన వృక్ష సంపదను కల్గిఉన్నాయి. ఈ తీరప్రాంతం వెంబడి గల కొబ్బరి చెట్లు అనేక పొదలు దూరం నుండి ఎంతో రమ్యంగా కనబడతాయి. ఈ ప్రాంతానికే చెందిన మరో రెండు ప్రదేశాలు రాయగడ్ కోట, రాయగడ్ లైట్ హౌస్ చూడడం మరవకండి.

గణపతి పూలే బీచ్

గణపతి పూలే బీచ్ లో వెండి లాంటి తెల్లటి ఇసుక ధగధగ మెరుస్తూ ఉంటుంది. తీరం వెంబడి మామిడి, జీడిపప్పు వృక్షాలు వరుసగా కనపడతాయి. సాయంత్రం పూట బీచ్ వద్దకు వెళ్లి, సేదతీరుతూ మరాఠా రుచులను తిని చూడండి. వీలుంటే ఒంటె సవారీ కూడా ప్రయత్నించండి.

ఇతర ఆకర్షణలు

మాల్గుండ్ గణపతి పూలే కు కిలోమీటరు దూరంలో ఉండే మాల్గుండ్ గ్రామం, ద్వీపకల్పపు కోన భాగాన గల సిద్ధ బురుజ్ లోని జైగడ్ లైట్ హౌస్, 35 కిలోమీటర్ల దూరంలో గల జైగడ్ కోట, 38 కిలోమీటర్ల దూరంలోని వెల్నేశ్వర్ చూడదగ్గవి.మరాఠీ కవి కేశవ్ సూత్ జన్మించిన ప్రాంతం ఇది. కేశవ్ సూత్ సేవలను గుర్తించుకునే విధంగా కేశవ్ సూత్ స్మారక్ అనే మందిరాన్ని నిర్మించారు.

పావస్

ప్రకృతి రమణీయతకు నెలవైన ప్రాంతం పావస్. ప్రముఖ ఆథ్యాత్మిక వేత్త స్వామి స్వరూపానంద్ ఇక్కడే జన్మించారు.

రత్నగిరి

పశ్చిమ కోస్తా తీరంలో అందమైన ప్రాంతంతో పాటుగా జిల్లా కేంద్రం రత్నగిరి. ప్రముఖ స్వాత్రంత్య సమరయోధుడు బాల గంగాధర్ తిలక్ జన్మస్థలం ఇదే. ఆయన సేవలను గుర్తుపెట్టుకునే విధంగా తిలక్ స్మారక్‌ను ఇక్కడ ఏర్పాటుచేశారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిలక్ స్వదేశీ ఉద్యమాన్ని నడిపించారు. సమీపంలో రత్నదుర్గ్ కోట కూడా ఉంది.

ఆహారపు అలవాట్లు

ఇక్కడి రుచులు ఎండు మామిడి అప్పడం అంబాపోలి, పనస అప్పడం ఫనస్పోలి తినడం మరవకండి . ప్రసిద్ధి చెందిన ఇంకో వంటకం కోకంకడి. మీరు వేసవిలో గణపతిపులే వెళ్తే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దేవగడ్ హపస్ మామిడి తినడం మరవొద్దు. గణపతి దేవునికి ఇష్టమైన రుచికరమైన తీపి వంటకం కుడుములు తినకుండా మీరు ఇక్కడినుండి రాలేరు.

అరేబియన్ సముద్రానికి చేరువలో 

గణపతిపులే గ్రామ ప్రజలు గొప్ప గణపతి భక్తులు. అతిధులను చాలా మర్యాదగా చూస్తారు. ఇక్కడ మరాఠీ ఎక్కువగా వాడినా యాత్రికులు తరచూ సందర్శించే ప్రాంతమైనందున ఇంగ్లీష్, హిందీ కూడ మాట్లాడతారు. గణపతిపులే అరేబియన్ సముద్రానికి దగ్గరగా ఉండటంవల్ల ఇక్కడి వాతావరణం చాలా అధ్భుతంగా ఉంటుంది. వేసవి కాలం కొంత వేడిగా ఉండటం వల్ల సాధారణంగా యాత్రికులు ఈ కాలంలో రారు.

ఎలా వెళ్ళాలి?

వాయు మార్గం

25 km ల దూరంలో రత్నగిరి విమానాశ్రయం, 327 km ల దూరంలో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం కలదు.

రైలు మార్గం

రత్నగిరి సమీప రైల్వే స్టేషన్. పూణే, ముంబై నుండి ప్రతి రోజూ ఇక్కడికి రైళ్లు వస్తుంటాయి.

రోడ్డు మార్గం

ముంబై, గోవా, పూణే, కొల్హాపూర్, రత్నగిరి మోడైన ప్రాంతాల నుండి గణపతి పూలే కు ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు నడుస్తాయి.