ఎన్డీయేకు రామ్..రామ్.. చిన్న పార్టీలతో బీజేపీకి పెద్ద తలనొప్పి

|

Sep 18, 2020 | 12:42 PM

నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే సర్కార్ పైకి బలంగా కనిపిస్తున్నా.. క్రమంగా బలహీన పడుతున్న సంకేతాలు బలపడుతున్నాయి. మొన్నటి వరకు బీహార్ రాష్ట్రంలో రెండు మిత్ర పక్షాల మధ్య సయోధ్య కుదర్చలేక చతికిల పడిన బీజేపీ అధినేతలు..

ఎన్డీయేకు రామ్..రామ్.. చిన్న పార్టీలతో బీజేపీకి పెద్ద తలనొప్పి
Follow us on

నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే సర్కార్ పైకి బలంగా కనిపిస్తున్నా.. క్రమంగా బలహీన పడుతున్న సంకేతాలు బలపడుతున్నాయి. మొన్నటి వరకు బీహార్ రాష్ట్రంలో రెండు మిత్ర పక్షాల మధ్య సయోధ్య కుదర్చలేక చతికిల పడిన బీజేపీ అధినేతలు.. ఇపుడు చిరకాలంగా మిత్ర పక్షంగా కొనసాగిన అకాళీదళ్ దూరం కావడంతో ఖంగుతిన్నది. మరోవైపు హర్యానాలో మరో మిత్ర పక్షం జననాయక్ జనతాపార్టీ కూడా ఎన్డీయేకు దూరమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ పార్టీలన్నీ చిన్న పార్టీలే అయినా బలంగా వున్న ఎన్డీయే నుంచి దూరమవ్వాలన్న వారి నిర్ణయం మాత్రం మిగిలిన మిత్ర పక్షాలపై ప్రభావం చూపే పరిస్థితి వుంది.

వచ్చే ఏడాది తొలి భాగంలో ఎన్నికలను ఎదుర్కోబోతున్న బీహార్‌లో బీజేపీ ప్రధాన మిత్ర పక్షం జేడీయూ పార్టీకి, రామ్ విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని లోక్ జనశక్తి పార్టీకి సీట్ల తకరారు తలెత్తడంతో వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు కమలనాథులు వీలైనన్ని మార్గాల్లో ప్రయత్నించి విఫలమయ్యారు. మీరే తేల్చుకోండంటూ చివరికి జేడీయూ, ఎల్జేపీలకు వదిలేసిన పరిస్థితి. కరోనా నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడు జరిగేదీ తేలడం లేదు కానీ.. వెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే బీహార్‌లో బీజేపీకి సరికొత్త తలనొప్పి జేడీయూ, ఎల్జేపీల కలహం రూపంలో వచ్చేది. తాత్కాలికంగా సద్దుమణిగినట్లు కనిపిస్తున్నా.. ఎన్నికల షెడ్యూల్‌పై ప్రకటన వచ్చిన వెంటనే ఈ రెండుపార్టీల మధ్య సీట్ల పంచాయితీ మళ్ళీ తిరగబెట్టక మానదు. ఎన్డీయే మిత్ర పక్షాలతో కలిసి బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటామని బీజేపీ నేతలు చెబుతున్నా.. ఎల్జేపీ, జేడీయూ మధ్య సీట్ల పంచాయితీ తెంచడం అంత ఈజీ కాదనిపిస్తోంది.

గత ఎన్నికల్లో 40 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసి కేవలం రెండు సీట్లను గెలుచుకున్న ఎల్జేపీ.. ఈసారి ఏకంగా 143 సీట్ల కోసం పట్టుపడుతోంది. దానికి జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ససేమిరా అనడంతో ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు చిరాగ్ పాశ్వాన్. కోవిడ్ కంట్రోలింగ్‌లో నితీశ్ ప్రభుత్వం విఫలమైందన్నది ఆయన ప్రధాన ఆరోపణ. ఒకవైపు విమర్శలు, ఆరోపణలు చేస్తున్న లోక్ జనశక్తి నాయకత్వంలో సీట్ల చర్చలకు నితీశ్ సుముఖంగా లేరని సమాచారం. ఈక్రమంలో బీజేపీ ఎలాంటి మార్గాన్ని అన్వేషించి.. ఆ రెండు మిత్ర పక్షాల మధ్య సయోధ్య కుదురుస్తుందో.. లేక కాస్త కటువుగా మారిన ఎల్జేపీని వదిలేసుకుంటుందో చూడాలి.

ఇక బీజేపీతో గత రెండున్నర దశాబ్దాలుగా కలిసి కొనసాగిన శిరోమణి అకాళీదళ్.. వ్యవసాయ రంగంలో మోదీ సర్కార్ తీసుకొచ్చిన సంస్కరణలను వ్యతిరేకిస్తూ ఎన్డీయేకి దూరమైంది. ఆ పార్టీ తరపున మోదీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న హర్సిమ్‌రత్ కౌర్ బాదల్ గురువారం రాజీనామా చేశారు. ఎన్డీయే నుంచి వైదొలుగుతున్నట్లు కూడా ఆపార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో హర్యానాలో బీజేపీ మిత్ర పక్షం జననాయక్ జనతాపార్టీపై ఒత్తిడి ప్రారంభం అయ్యింది. బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వంలో కొనసాగుతున్న జననాయక్ జనతాపార్టీ కూడా ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగే పరిస్థితి కనిపిస్తోంది. సంకీర్ణ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న దుష్యంత్ సింగ్ చౌతాలాపై ఒత్తిడి పెరుగుతోంది.

మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ రంగ సంస్కరణలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోనే పెద్ద ఎత్తున రైతులు ఉద్యమిస్తున్న తరుణంలో విపక్షాలు బీజేపీతో కలిసి పయనిస్తున్న పార్టీలను టార్గెట్ చేస్తున్నాయి. ఈక్రమంలోనే కాంగ్రెస్ విమర్శలను తట్టుకోలేక అకాళీదళ్ ఎన్డీయేకు దూరం కాగా.. తాజాగా దుష్యంత్ సింగ్ చౌతాలా సారథ్యంలోని జననాయక్ జనతాపార్టీ కూడా బీజేపీకి దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అకాళీదళ్, జననాయక్ జనతాపార్టీ, లోక్ జనశక్తి పార్టీలు చిన్న పార్టీలే అయినా.. నెంబర్ పరంగా చూస్తే మోదీ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేకపోయినా.. మిత్ర పక్షాలు క్రమంగా దూరమవడం మాత్రం భవిష్యత్తులో బీజేపీకి ఇబ్బందికరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.