ఏపీలో వందకే 5 రకాల పళ్ళు.. స్పందన సూపర్

|

Apr 18, 2020 | 4:55 PM

ఏపీలో కరోనా ప్రభావిత ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్న వంద రూపాయలకే అయిదు రకాల పళ్ళ పథకానికి రెస్పాన్స్ సూపర్ అంటున్నారు అధికారులు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌కు నివేదించింది అధికార యంత్రాంగం....

ఏపీలో వందకే 5 రకాల పళ్ళు.. స్పందన సూపర్
Follow us on

ఏపీలో కరోనా ప్రభావిత ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్న వంద రూపాయలకే అయిదు రకాల పళ్ళ పథకానికి రెస్పాన్స్ సూపర్ అంటున్నారు అధికారులు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌కు నివేదించింది అధికార యంత్రాంగం. ఈ పథకానికి చక్కని స్పందన లభిస్తుండడంతో వెరైటీ మార్కెటింగ్ విధానాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్.

కోవిడ్‌ –19 నివారణా చర్యలపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌. శుక్రవారం (ఏప్రిల్ 17వ తేదీ) ఒక్కరోజే రాష్ట్రంలో ల్యాబ్‌లు, ట్రూనాట్‌ మిషన్ల ద్వారా 4వేలకుపైగా పరీక్షలు చేశామని అధికారులు సీఎంకు వివరించారు. ర్యాపిడ్‌ పరికరాలు, స్క్రీనింగ్‌ కోసం వాడే కొత్త పరికరాల సహాయంతో గణనీయంగా పరీక్షల సామర్థ్యం పెరుగుతుందంటున్నారు అధికారులు.

కోవిడ్‌ పరిస్థితులకు ముందు తిరుపతిలో ఒకటే ల్యాబ్‌ వుండేదని, ఆ తర్వాత తిరుపతిలో ల్యాబుల సంఖ్యను ఏడుకు పెంచామని వారు తెలిపారు. వారం రోజుల్లో ల్యాబుల సంఖ్య 12కు పెంచుతామని, తిరుపతిలో అదనంగా 2, కర్నూలులో ఒకటి, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా ఒక్కో ల్యాబ్‌ చొప్పున పెంచుతున్నామని అధికారులు తెలిపారు. టెలిమెడిసిన్‌కు మంచి స్పందన వస్తుందన్న అధికారులు…. ఇప్పటి వరకు 5219 మిస్డ్‌ కాల్స్‌ వచ్చాయని, వారికి రిటర్న్ కాల్ చేసి మరీ వైద్యసాయం అందించామని వివరించారు.

అవసరమైన వారికి ప్రిస్కిప్షన్లు పంపించామని, వారికి మందులు కూడా ఇస్తున్నామని సీఎంకు తెలిపిన అధికారులు.. 100 రూపాయలకు ఐదు రకాల పండ్ల పంపిణీ బాగుందని చెప్పారు. వారిని సీఎం అభినందించి, మరిన్ని వినూత్న మార్కెటింగ్‌ విధానాలపై మార్కెటింగ్‌శాఖ అగ్రెసివ్‌గా ముందుకు వెళ్లాలని ఆదేశాలిచ్చారు.