ట్రంప్ ఓటమికి.. ఇవే ఐదు కారణాలు…

|

Nov 08, 2020 | 8:01 AM

ఇరాన్‌పై దండయాత్ర....చైనాపై దూకుడు...కీప్‌ అమెరికా గ్రేట్‌...అమెరికా ఫస్ట్‌...ఎన్నికల ప్రచారంలో ఇవీ ట్రంప్‌ నినాదాలు. ఇవేవీ విజయానికి వర్కౌట్‌ కాలేదు. అంతా అనుకున్నట్లే జరిగింది. ఎగ్జిట్‌ పోల్స్‌ చెప్పిందే నిజమైంది. ట్రంప్‌ ఓటమి ఎప్పుడో ఖరారైంది..! కాకపోతే కాస్త ఆలస్యమైంది అంతే..! మరి ఇంతలా పోరు ఏకపక్షం కావడానికి కారణాలేంటీ..? ఆ ఐదు తప్పిదాలే ట్రంప్‌ కొంపముంచాయా..?

ట్రంప్ ఓటమికి.. ఇవే ఐదు కారణాలు...
Follow us on

Five Reasons For Trump’s Defeat : అమెరికా ఎన్నికల ఫలితాలు క్షణక్షణం ఉత్కంఠగా మారినా….సంచలనం నమోదు కాలేదు. రాజకీయ విశ్లేషకులు, ఎగ్జిట్‌ పోల్స్ చెప్పినట్లే బైడెన్‌ అగ్రరాజ్య అధ్యక్ష పగ్గాలను అందుకున్నారు. బైడన్‌ గెలుపుకన్నా… ట్రంప్‌ ఓటమే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంసంగా మారింది. గట్టి పట్టున్న ప్రాంతాలు, రిపబ్లికన్ల కంచుకోటల్లోనూ ట్రంప్ ఓడిపోవడం అమెరికాలో ప్రకంపనలు రేపుతోంది. డొనాల్డ్ ట్రంప్ ఓటమికి ముఖ్యంగా 5 కారణాలు కనిపిస్తున్నాయి.

జాతి వివక్ష…

జాతి వివక్షే ట్రంప్​ ఓటమికి ఓ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ట్రంప్ పాలనలో వర్ణవివక్ష తాండవం చేసింది. జార్జ్ ఫ్లాయిడ్‌ అనే నల్ల జాతీయుడు పోలీసు కిరాతకానికి బలైపోవడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. అల్లర్లు కూడా చెలరేగాయి. ట్రంప్‌ వైఖరి పట్ల నల్లజాతీయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.

కరోనా రక్కసి..

అటు కరోనాను కట్టడి చేయడంలో ట్రంప్‌ దారుణంగా విఫలమయ్యారు. లక్షలాది మంది మరణాలకు కారణమయ్యారనే అపవాదు మూటగట్టుకున్నారు. ట్రంప్‌ నిర్లక్ష్యంతోనే కరోనా మరణాలకు అమెరికా కేంద్ర బిందువుగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాదు ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ ర్యాలీలు కరోనా వ్యాప్తికి కారణమయ్యాయి. రెండోసారి అమెరికా అధ్యక్ష పీటంపై కూర్చోవాలన్న ట్రంప్‌ ఆశలపై కరోనా ఈ విధంగా నీళ్లు చల్లింది.

నిరుద్యోగ సమస్య..

కరోనా సమయంలో అమెరికాలో నిరుద్యోగం తీవ్ర స్థాయికి చేరింది. 1948 సంవత్సరం తర్వాత నిరుద్యోగం ఈ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. అదే సమయంలో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. కరోనా సమయంలో 33 లక్షల మంది నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

అఫర్డ్‌బుల్‌ కేర్‌ యాక్ట్..

అఫర్డ్‌బుల్‌ కేర్‌ యాక్ట్‌ అనే పథకం కూడా ఈ ఎన్నికల్లో కీలకంగా నిలిచింది. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఒబామా తెచ్చిన ‘అఫర్డ్‌బుల్‌ కేర్‌ యాక్ట్‌’ రద్దు అంశం ట్రంప్​ పదవికి ఎసరు పెట్టింది. అప్పటికే కరోనాతో కుదేలైన ప్రజలు దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశారు.

వీసా నిబంధనలు..

ఇది కూడా ట్రంప్‌ ఓటమికి కారణంగా చెప్పుకోవచ్చు. అంతేకాదు రష్యాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు, వీసా నిబంధనలు కఠినతరం చేయడం, ఎన్నికల వ్యవస్థపై ఆరోపణలు సహా ఆయన తరుచూ చేసే నిరాధార వ్యాఖ్యలు కూడా కొంప ముంచాయి.