అయ్యప్ప దర్శనానికి ముందు భక్తులు మసీదుకు ఎందుకు వెళ్తారు?

|

Nov 17, 2019 | 11:34 AM

అయ్యప్ప దర్శనానికి ముందు భక్తులు మసీదుకు వెళ్తారని మీకు తెలుసా ? మీకు తెలియని మరో ఆసక్తికర విషయం ఏంటంటే మరికొందరు భక్తులు అయ్యప్ప దర్శనం తర్వాత చర్చికి వెళ్లి ప్రార్థనలు కూడా చేస్తారు. ఎన్నో ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. అసలు అయ్యప్ప భక్తులకు మసీదు, చర్చిల్లో ఏం పని ?..ఈ స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం. అయ్యప్ప ఓ సెక్యులర్‌ దేవుడు ! ఈ మాట స్వయంగా కేరళ ప్రభుత్వమే చెప్పింది. శబరి ఆలయంలో […]

అయ్యప్ప దర్శనానికి ముందు భక్తులు మసీదుకు ఎందుకు వెళ్తారు?
Follow us on

అయ్యప్ప దర్శనానికి ముందు భక్తులు మసీదుకు వెళ్తారని మీకు తెలుసా ? మీకు తెలియని మరో ఆసక్తికర విషయం ఏంటంటే మరికొందరు భక్తులు అయ్యప్ప దర్శనం తర్వాత చర్చికి వెళ్లి ప్రార్థనలు కూడా చేస్తారు. ఎన్నో ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. అసలు అయ్యప్ప భక్తులకు మసీదు, చర్చిల్లో ఏం పని ?..ఈ స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం.

అయ్యప్ప ఓ సెక్యులర్‌ దేవుడు ! ఈ మాట స్వయంగా కేరళ ప్రభుత్వమే చెప్పింది. శబరి ఆలయంలో అన్యమతస్థుల ప్రవేశాన్ని నిషేధించాలంటూ బీజేపీ వేసిన వాజ్యంపై అప్పటి కేరళ సర్కార్‌ ఇదే విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. వాస్తవానికి అయ్యప్ప సన్నిధి గిరిజనుల ఆలయం. చరిత్ర లోతుల్లోకి వెళ్తే ఈ విషయం అర్థమవుతుంది. అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు ఎరుమేలిలోని వావర్‌ స్వామి మసీదును తప్పకుండా దర్శించుకుంటారు. ఆయన అయ్యప్పకు ఆప్తమిత్రుడు. భక్తులు వావర్‌ సన్నిధిలో రంగులతో గిరిజనుల మాదిరిగా వేషాలు వేసుకుని పేటతుళ్లై ఆడుతారు.

అయ్యప్ప మాలధారణ, 41 రోజుల కఠోర దీక్ష అంత సులభం కాదు. అయ్యప్పను దర్శించుకునేందుకు శబరిమల ప్రయాణం కొంచెం కఠినంగా ఉంటుంది. ఈ సుదీర్ఘ యాత్రలో భక్తులకు కఠిన ఆహార నియమాలు, బ్రహ్మచర్యం పాటిస్తారు. చాలా దూరం కాలినడకనే వెళ్తారు. 41 రోజుల పాటు చేసే అయ్యప్ప దీక్షలో భక్తులు ఇంకా ఎన్నో నియమాలు, ఆచారాలు పాటించాల్సి ఉంటుంది. శబరిమల దారిలో ఇరుమలై అనే ఒక చిన్న పట్టణం ఉంది. అది అయ్యప్ప ఆలయానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శబరిమలకు వెళ్లే భక్తులు ఇక్కడ ఆగుతారు. అయ్యప్ప దర్శనం ముందు మసీదులో ప్రదక్షిణలు చేస్తారు. అయ్యప్ప భక్తులు తమ తమ సంప్రదాయాలను అనుసరించి మసీదులో పూజలు చేస్తారు. అక్కడే నమాజు కూడా చేస్తారు. మసీదులో ప్రదక్షిణలు చేసే సంప్రదాయం గత 500 ఏళ్లకు పైగా ఉంది.

ప్రతీ ఏటా శబరిమల ఆలయంతో మసీదుకు ఉన్న సంబంధాలను చెప్పేలా మసీదు కమిటీ ఒక ఉత్సవం నిర్వహిస్తుంది. ఈ వేడుకను చందనకూడమ్‌గా పిలుస్తారు. ఎరుమేలిలో చాలా మంది ముస్లింలు ఉన్నారు. కొండపైకి ఎక్కి వెళ్లే యాత్రికులు చాలా మంది విశ్రాంతి తీసుకోవడానికి వీరి ఇళ్లలో ఆగుతుంటారు. వావర్‌ స్వామి గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. కొంతమంది ఆయన ఇస్లాం ప్రచారం కోసం అరేబియా సముద్రం నుంచి వచ్చిన సూఫీ సన్యాసి అని చెబుతారు. మరికొంత మంది మసీదులో ఓ కత్తి ఉంటుందని అందుకే వావర్‌ ఓ యోధడుని అంటారు. కానీ వావర్ ఒక ముస్లిం, అయ్యప్ప భక్తుడు అనే విషయంలో మాత్రం ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేకపోవడం విశేషం. కేరళ టూరిజం కూడా దీనిని రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా చేర్చింది.

అయ్యప్పను దర్శించుకున్న తర్వాత కొందరు భక్తులు సెయింట్‌ సెబాస్టియన్‌ చర్చ్‌కు వెళ్లి ప్రార్థనలు కూడా చేస్తారు. ఇది మతసామరస్యానికి ప్రతీక ! అయ్యప్ప స్వామి జోల పాట హరివరాసనాన్ని ఆలపించిన ప్రఖ్యాత గాయకుడు జె.యేసుదాసు ఒకప్పుడు క్రైస్తవుడే ! ఆయన కూడా అయ్యప్ప భక్తుడే ! శరణం అనే పదానికి బౌద్ధమతంలో ప్రత్యేక స్థానముంది. కాబట్టి అది బౌద్ధులకు కూడా ఆలయమే. అయ్యప్పను ఏ ఒక్క మతానికి పరిమితం చేయలేం. అందుకే అయ్యప్ప కొందరివాడు కాదు అందరివాడు !