కుప్పకూలిన క్రూడాయిల్‌ ధరలు..

|

Apr 21, 2020 | 10:36 PM

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధరలు కుప్పకూలాయి. కరోనా దెబ్బకు చరిత్రలో ఎన్నడూ లేనంతగా పతనమయ్యాయి. డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఆయిల్‌ ధర.. ఏకంగా మైనస్‌ 28డాలర్లకు దిగజారింది. ఇది 21 ఏళ్ల కనిష్టానికి పడిపోయినట్టు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇక డబ్ల్యూటీఐ బాటలోనే నడిచింది బ్రెంట్‌ ధర కూడా. 6 పాయింట్లు క్షీణించి 26 డాలర్లకు దిగొచ్చింది. కరోనా కల్లోలంతో క్రూడాయిల్‌ ధరలు కనీవినీ ఎరుగని రీతిలో పాతాళానికి పడిపోయాయి. అమెరికా మార్కెట్లో ముడి చమురు ధరలు తొలిసారిగా […]

కుప్పకూలిన క్రూడాయిల్‌ ధరలు..
Follow us on

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధరలు కుప్పకూలాయి. కరోనా దెబ్బకు చరిత్రలో ఎన్నడూ లేనంతగా పతనమయ్యాయి. డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఆయిల్‌ ధర.. ఏకంగా మైనస్‌ 28డాలర్లకు దిగజారింది. ఇది 21 ఏళ్ల కనిష్టానికి పడిపోయినట్టు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇక డబ్ల్యూటీఐ బాటలోనే నడిచింది బ్రెంట్‌ ధర కూడా. 6 పాయింట్లు క్షీణించి 26 డాలర్లకు దిగొచ్చింది.

కరోనా కల్లోలంతో క్రూడాయిల్‌ ధరలు కనీవినీ ఎరుగని రీతిలో పాతాళానికి పడిపోయాయి. అమెరికా మార్కెట్లో ముడి చమురు ధరలు తొలిసారిగా ప్రపంచ చరిత్రలో మైనస్‌లోకి వెళ్లిపోయాయి. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర ఏకంగా మైనస్ 38 శాతం కుప్పకూలింది. ఇలా జరగడం చరిత్రలో ఇదే మొదటిసారి. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఈ పరిస్థితి నెలకొంది. ఇక బ్రెంట్‌ ధర క్రూడ్‌ 6 శాతం క్షీణించి 26.32 డాలర్లకు చేరింది. న్యూయార్క్ ఫ్యూచర్స్ మార్కెట్ నైమెక్స్ లో డబ్ల్యూటీఐ మే నెల కాంట్రాక్టు క్రూడ్ ధర ఒక దశలో మైనస్ 28 డాలర్లకు పడిపోయింది. 1983 ఏప్రిల్‌లో ట్రేడింగ్‌ మొదలైనప్పటినుంచి చూస్తే ఇదే కనిష్ట ధర. ఐతే జూన్‌ డబ్ల్యూటీఐ కాంట్రాక్ట్‌ ఫ్యూచర్స్‌ మాత్రం 22.25 వద్ద ట్రేడవుతోంది. మే, జూన్‌ ఫ్యూచర్స్‌ కాంట్రాక్ట్‌ల ధరల తేడా 40 డాలర్లకు మించి ఉంది. రెండు వరుస నెలల ఫ్యూచర్స్‌ కాంట్రాక్ట్‌ల ధరల తేడా ఈ రేంజ్‌లో ఉండటం చరిత్రలో ఇదే మొదటిసారి. సమీప భవిష్యత్తులో ఆర్థిక రికవరీ కనిపించడం లేదని, తమ వద్ద అధికంగా ఉన్న నిల్వలను ఎలాగైనా తగ్గించుకోవాలని చమురు ఉత్పత్తి దేశాలు ప్రయత్నిస్తున్నాయి.

వాస్తవానికి ఈ సంవత్సరం ఆరంభంలో క్రూడాయిల్ ధర భారీగా పెరిగి 52వారాల గరిష్ఠానికి చేరింది. జనవరిలో యూఎస్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ మేజర్ ఖాసీమ్ సులేమానీ మరణంతో ఏర్పడిన ఉద్రిక్తతలతో ముడి చమురు ధర పైకి ఎగబాకింది. ఆ తర్వాత ఇరాన్ పై అమెరికా ఆంక్షలు, రష్యా, సౌదీ అరేబియాలు పోటాపోటీగా చమురును ఉత్పత్తి చేయడంతో ధర తగ్గుతూ వచ్చింది. తాజాగా ఇప్పుడు కరోనా ప్రభావం, లాక్ డౌన్ కారణంగా ధర మరింత క్రాష్‌ అయింది. ఇక చమురు గండం నుంచి గట్టెక్కేందుకు ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిని రోజుకు 10 మిలియన్ బ్యారళ్ల మేరకు తగ్గించాలని నిర్ణయించాయి. అదే జరిగితే, ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతుంది. అయినా, అంతకుమించి మరో మార్గం వారికి కనిపించడం లేదు. ఉత్పత్తిని తగ్గించినా, డిమాండ్ తో పోలిస్తే, అధిక చమురు అందుబాటులో ఉంటుందని, నిల్వలు పెరిగిపోతూనే ఉంటాయన్న ఆందోళన కూడా ఉంది. ఇకపోతే క్రూడ్ ధరలు తగ్గినా ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. దేశీ ఇంధన ధరలు ఏకంగా 34 రోజులకు సరిపడా నిల్వ ఉంటూ వస్తున్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.73.97 వద్ద, డీజిల్ ధర రూ.67.82 వద్ద స్థిరంగా ఉంది. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర రూ.74.61 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. డీజిల్‌ ధర కూడా రూ.68.52 వద్దనే నిలకడగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో, ముడిచమురు నిల్వలు పేరుకుపోతున్నాయి. ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుతున్నట్టు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో కొనుగోలుదారులకు ఎదురు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని చమురు రంగ వ్యాపారులు వాపోతున్నారు.