బ్రెజిల్‌ను వెనక్కి నెట్టేసి రెండోస్థానం దిశగా భారత్‌!

|

Sep 04, 2020 | 10:56 AM

భారత్ మొత్తం కేసుల విషయంలో బ్రెజిల్‌ను సమీపిస్తున్నప్పటికీ.. ఆ దేశంతో పోలిస్తే మన దగ్గర మరణాల శాతం తక్కువగా ఉండటం కాస్త ఊరటను ఇచ్చే అంశం.

బ్రెజిల్‌ను వెనక్కి నెట్టేసి రెండోస్థానం దిశగా భారత్‌!
Follow us on

Corona Positive Cases In India: దేశంలో కరోనా వైరస్ మరణ మృదంగం వాయిస్తోంది. గత కొద్దిరోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 83,341 పాజిటివ్ కేసులు, 1,096 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా కేసుల సంఖ్య 39,36,748కి చేరింది. ఇందులో 8,31,124 యాక్టివ్ కేసులు ఉండగా.. 30,37,152 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 68,472 కరోనా మరణాలు సంభవించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. ఇక గడిచిన 24 గంటల్లో 66,659 మంది మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేట్ 77.09 శాతం ఉండగా, మరణాల రేట్ 1.75 శాతం, యాక్టివ్ కేసులు 21.16 శాతంగా ఉంది. అలాగే 24 గంటల్లో 11,69,765 కోవిడ్-19 పరీక్షలు జరగగా.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 4,66,79,145 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.

నాలుగు రాష్ట్రాల్లో కరోనా విలయం..

మహారాష్ట్ర, ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా విలయం సృష్టిస్తోంది. ప్రతీ రోజూ 5 వేలు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో కరోనా కేసులు 8 లక్షల 50 వేలకు చేరువలో ఉండగా.. ఏపీలో 4 లక్షల 65 వేలు, తమిళనాడులో 4 లక్షల 45 వేల కేసులు నమోదయ్యాయి. ఇక కర్ణాటకలో 3 లక్షల 70 వేలు పైగా కేసులు నమోదు కాగా.. మహారాష్ట్రలో అత్యధికంగా 25 వేలు పైచిలుక మంది కరోనా కారణంగా మరణించారు.

బ్రెజిల్‌ను మించనున్న విలయం…

ప్రపంచంలోనే కరోనాతో తీవ్రమైన ప్రభావితమైన దేశాల్లో ఒకటి బ్రెజిల్‌. అక్కడ ఇప్పటివరకు 4,046,150 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 124,729 మరణాలు సంభవించాయి. ఇప్పుడు ఆ దేశానికి చేరువలో భారత్ ఉంది. మన దేశంలో ఇప్పటివరకు 3,936,747 కరోనా కేసులు నమోదయ్యాయి. 68,569 మరణాలు సంభవించాయి. అయితే మొత్తం కేసుల విషయంలో బ్రెజిల్‌ను సమీపిస్తున్నప్పటికీ.. ఆ దేశంతో పోలిస్తే మన దగ్గర మరణాల శాతం తక్కువగా ఉండటం కాస్త ఊరటను ఇచ్చే అంశం.