“బాపు మ్యూజియం”ను ప్రారంభించిన సీఎం జగన్..

|

Oct 01, 2020 | 2:36 PM

టెక్నాలజీ సాయంతో శిల్పకళ సంపద విశిష్టతను తెలిపే బాపు మ్యూజియాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. విజయవాడలో పదేళ్ల కిందట మూతబడిన మ్యూజియాన్ని మళ్లీ పురాతన శిల్పకళా సంపదతో తీర్చిదిద్దారు...

బాపు మ్యూజియంను ప్రారంభించిన సీఎం జగన్..
Follow us on

టెక్నాలజీ సాయంతో శిల్పకళ సంపద విశిష్టతను తెలిపే బాపు మ్యూజియాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. విజయవాడలో పదేళ్ల కిందట మూతబడిన మ్యూజియాన్ని మళ్లీ పురాతన శిల్పకళా సంపదతో తీర్చిదిద్దారు. మ్యూజియాన్ని ప్రారంభించి అందులోని పురాతన వస్తువులు, వాటి విశిష్టతను తెలుసుకున్నారు ముఖ్యమంత్రి.

రూ.8 కోట్లతో ఈ మ్యూజియంను అభివృద్ధి చేశారు. సీఎం జగన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు స్వాగతం పలికారు. మ్యూజియం వద్ద పింగళి వెంకయ్య విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం విక్డోరియా మహల్‌లోని బాపూజీ చిత్రపటానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి .. జాతీయ నాయకుల విగ్రహాలను పరిశీలించారు.

ఆది మానవ చరిత్రకు సాక్షిగా నిలిచే పురాతన వస్తువులు, శిల్పకళ సంపదతో పాటు ఆధునిక హంగులతో మ్యూజియాన్ని తీర్చిదిద్దారు. 10 లక్షల ఏళ్ల చరిత్రకు సాక్షిగా నిలిచే అరుదైన 1,500 వస్తువులను బాపు మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. ఆది మానవుడి నుంచి 19వ శతాబ్ధపు ఆధునిక మానవుడు వరకు ఉపయోగించిన వస్తువులు, కళాఖండాలు, వస్త్రాలు, వంట సామగ్రి తదితరాలను భద్రపరిచారు. సుమారు 1500 రకాల వస్తువులు ఇక్కడ ఉన్నాయి.

బౌద్ద జైన గ్యాలరీ, శిల్ప గ్యాలరీ, నాణేలు, ఆయుధాలు, రక్షణ కవచాలు ఉన్నాయి. మధ్య యుగంలో మట్టితో తయారైన శవపేటిక ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఆంధ్రుల వైభవాన్ని భవిష్యత్‌ తరాలకు అందించేలా, మన సంస్కృతి వారసత్వ ఘనతను చాటిచెప్పేలా గ్యాలరీలను తీర్చదిద్దారు. ప్రతి వస్తువు దగ్గర క్యూఆర్‌ కోడ్‌ ఉంది.

గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి “బాపు మ్యూజియం” యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని… క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే ఆ వస్తువు విశేషాలను తెలుసుకోవచ్చు. ఈ ప్రత్యేకతలను సీఎం జగన్‌కు వివరించారు ఆర్కియాలజీ విభాగం కమిషనర్‌ వాణీమోహన్‌.