Corona times సాయం పేరిట ఓట్ల బేరం.. బాబు గారి కంప్లైంట్

| Edited By: Pardhasaradhi Peri

Apr 08, 2020 | 2:49 PM

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ఆ ఇక్కట్లను వీలైనంత వరకు తగ్గించాలని ప్రభుత్వాలు కృషి చేస్తుంటే.. మరోవైపు రాజకీయాంశాలు కూడా అడపాదడపా పతాక శీర్షికల్లో కనిపిస్తూనే వున్నాయి.

Corona times సాయం పేరిట ఓట్ల బేరం.. బాబు గారి కంప్లైంట్
Follow us on

Chandrababu complaint to state election commissioner: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ఆ ఇక్కట్లను వీలైనంత వరకు తగ్గించాలని ప్రభుత్వాలు కృషి చేస్తుంటే.. మరోవైపు రాజకీయాంశాలు కూడా అడపాదడపా పతాక శీర్షికల్లో కనిపిస్తూనే వున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో కొనసాగుతున్న కరోనా ఆర్థిక సాయంపై రాజకీయ రగడ రాజుకుంటోంది.

లాక్ డౌన్ నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రతీ పేద కుటుంబీకునికి వేయి రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఏప్రిల్ నాలుగో తేదీ నుంచి ఈ వేయి రూపాయల పంపిణీని ప్రారంభించారు. ఇంతవరకు బాగానే వున్నా.. ఇపుడు ఈ అంశమే రాజకీయ దుమారానికి తెరలేపింది. ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సాయాన్ని ప్రభుత్వ అధికారుల చేతుల మీదుగానో.. లేక కనీసం గ్రామ, వార్డు వాలెంటీర్ల ద్వారాలో పంపిణీ చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులతో పంపిణీ చేయిస్తున్నారన్నది టీడీపీ అధినేత చంద్రబాబు ఫిర్యాదు.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కరోనా ప్రభావం పేరిట ఆరు వారాలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పటికే లోకల్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం ముగిసింది. బరిలో పలు పార్టీల నేతలు వున్నారు. వారంతా ఇప్పటికీ ఎన్నికల బరిలో రేసుగుర్రాలు.. అదే అభ్యర్థులుగానే పరిగణింపబడుతున్నారు. ప్రభుత్వం తాజాగా చేస్తున్న కరోనా ఆర్థిక సాయాన్ని ఈ అభ్యర్థులు చేతుల మీదుగా పంపిణీ చేయడం ద్వారా ఎన్నికల్లో పరోక్షంగా నగదు పంపిణీకి వైసీపీ నేతలు ప్లాన్ చేశారంటూ చంద్రబాబు బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్‌కు లేఖ రాశారు.

తన ఫిర్యాదుకు అనుకూలంగా దాదాపు 250 ఉదంతాలను చంద్రబాబు తన లేఖలో ఉదహరించారు. దానికి సంబంధించిన ఆధారాలను తన లేఖతోపాటు జత చేశారు. 250కి పైగా సంఘటనలతో కూడిన వీడియోలు, ఫోటోలను, పెన్ డ్రైవ్‌లను తన లేఖకు జతచేసి ఎన్నికల కమిషనర్‌కు పంపారు. లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో వైసీపీ నేతలు, స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓట్ల కొనుగోలుకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు చంద్రబాబు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఎన్నికల సంఘం బాధ్యతతో వ్యవహరించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.