బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు వెన్నుముక కులాలు.. బీసీ సంక్రాంతి సభలో ఏపీ సీఎం జగన్ ఏం చెప్పారంటే..

|

Dec 18, 2020 | 5:44 AM

బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు, మన సంస్కృతికి వెన్నుముక కులాలని కొనియాడారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.

బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు వెన్నుముక కులాలు.. బీసీ సంక్రాంతి సభలో ఏపీ సీఎం జగన్ ఏం చెప్పారంటే..
Follow us on

బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు, మన సంస్కృతికి వెన్నుముక కులాలని కొనియాడారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన బీసీ సంక్రాంతి వేడుకల్లో సీఎం జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇదే వేదికపై 18 నెలల క్రితం సీఎంగా ప్రమాణ స్వీకారం చేశానని గుర్తుచేశారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన మేరకు వెనుకబడిన వర్గాలన్నింటికి ప్రాధాన్యత కల్పిస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లలో దాదాపు 728 స్థానాలు కల్పించడం ద్వారా ఆ సామాజిక వర్గాలను బలోపేతం చేశామని తెలిపారు. కార్పొరేషన్ చైర్మన్ల ఎంపికలో మహిళలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని 56 మందిలో 26 మంది మహిళలు ఉండటం ఎంతో గర్వకారణంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.మీ సామాజిక వర్గంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కార్పొరేషన్ చైర్మన్లు బాధ్యత తీసుకోవాలన్నారు. రాజకీయాలకు సంబంధం లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలన్నారు. టీడీపీ అధికారంలో ఉండగా కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిందని, కార్పొరేషన్లలో సమూల మార్పులు రావాలన్నారు. అమరావతి ఉద్యమం గురించి జగన్ మాట్లాడుతూ.. ఉద్యమం పేరుతో కొంతమంది జనాలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో రాజధాని ఏర్పాటుచేయాలని ముందుగానే భావించారని విమర్శించారు. బినామీల ద్వారా అమరావతి చుట్టుపక్కల భూములను కొని ఉద్యమం పేరుతో నాటకాలు ఆడుతున్నారని పేర్కొన్నారు. వారి స్వలాభం కోసం ఇన్‌సైడర్ ట్రేడింగ్ చేసి ఇవాళ భూముల ధరలు పడిపోతాయేమో అనే భయంతో ఉద్యమం లేవదీస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు ఇవన్ని గమనిస్తున్నారని మళ్లీ మంచి గుణపాఠం చెబుతారని ఎద్దేవా చేశారు.