ఎత్తు తగ్గదు.. సమయం దాటదు.. వైఎస్సార్ 100 అడుగుల విగ్రహాన్ని కూడా అక్కడే కట్టిస్తాం: జగన్

|

Dec 02, 2020 | 5:56 PM

ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం ప్రాజెక్ట్‌లో ఒక్క అంగుళం కూడా ఎత్తును తగ్గించేది లేదని.. అనుకున్న ప్రకారం 45.72 మీటర్లు కట్టి తీరుతామని వెల్లడించారు.

ఎత్తు తగ్గదు.. సమయం దాటదు.. వైఎస్సార్ 100 అడుగుల విగ్రహాన్ని కూడా అక్కడే కట్టిస్తాం: జగన్
Follow us on

AP Assembly Session: ఏపీ అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్ట్‌పై వాడీవేడి చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఇక పోలవరంపై సభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం ప్రాజెక్ట్‌లో ఒక్క అంగుళం కూడా ఎత్తును తగ్గించేది లేదని.. అనుకున్న ప్రకారం 45.72 మీటర్లు కట్టి తీరుతామని వెల్లడించారు. ఖరీఫ్ 2022 నాటికి పోలవరం ద్వారా నీళ్లను అందిస్తామని హామీ ఇచ్చారు. యుద్ధ ప్రతిపాదికన పోలవరం పనులు పూర్తి చేస్తామని సీఎం జగన్ కుండబద్దలు కొట్టారు.

భారీ ప్రాజెక్టులు నిర్మాణం జరుగుతున్నప్పుడు అంచనాలు మారుతుంటాయన్న ఆయన.. పోలవరం పూర్తి చేసేందుకు అంచనా వ్యయం పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. భూసేకరణ, పునరావాసానికి రూ. 26,585 కోట్లు.. సివిల్ పనులకు రూ. 7 వేల కోట్లు, పవర్ ప్రాజెక్టుకు రూ, 4,124 కోట్లు వెరసి మొత్తంగా మరో రూ. 37,885 కోట్లు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు అవసరం అవుతాయని చెప్పుకొచ్చారు. ఈ అంశాలన్నింటిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని.. కేంద్ర ఆర్ధిక మంత్రి, జలశక్తి మంత్రితో స్వయంగా మాట్లాడానని సీఎం జగన్ వివరించారు.

దీనికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. జలశక్తి శాఖ నుంచి త్వరలోనే కేబినెట్‌కు కొత్త అంచనాలు వెళతాయని తెలిపారు. ఇక పోలవరం నిర్మాణంలో ఆర్‌ అండ్ ఆర్‌పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. 2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి.. అక్కడ వైఎస్సార్ 100 అడుగుల విగ్రహాన్ని కూడా కట్టిస్తామని సీఎం జగన్ అన్నారు. ఇలా పలు అంశాలపై హాట్ హాట్ చర్చలు జరిగిన తర్వాత ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది.