జస్టిస్ కనకరాజ్ నియామకం వెనుక జగన్ సూపర్ వ్యూహం

|

Apr 11, 2020 | 12:45 PM

ఏపీలో రాజకీయ దుమారం రేపిన ఎన్నికల కమిషనర్ మార్పు వెనుక జగన్ పెద్ద వ్యూహమే దాగున్నట్లు తెలుస్తోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు మార్చడంతోపాటు కొత్త ఎన్నికల కమిషనర్‌గా తమిళనాడుకు చెందిన రిటైర్డ్ జస్టిస్ కనకరాజ్‌ను నియమించడం వెనుక పెద్ద వ్యూహం దాగుందని తెలుస్తోంది.

జస్టిస్ కనకరాజ్ నియామకం వెనుక జగన్ సూపర్ వ్యూహం
Follow us on

ఏపీలో రాజకీయ దుమారానికి తెరలేపిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు, రిటైర్డ్ జస్టిస్ కనకరాజ్ నియామకం ఇపుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందరిలోను చర్చనీయాంశమైంది. ఒకవైపు కరోనా మహ్మామారి దేశాన్ని.. ఆ మాటకొస్తే సమస్త భూగోళాన్ని వణికిస్తున్న తరుణంలో ఏపీ ముఖ్యమంత్రి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ని సడన్‌గా ఎందుకు మార్చారు ? సరే స్థానిక సంస్థల ఎన్నికలను తనకు చెప్పకుండా వాయిదా వేశారన్న కారణం తొలగింపునకు కారణం కావచ్చు. మరి అంతే వేగంగా తమిళనాడుకు చెందిన రిటైర్డ్ జస్టిస్ జే.కనకరాజ్‌ని ఆగమేఘాల మీద ఎందుకు ఎంపిక చేసుకున్నారు? ఇదిప్పుడు ఏపీలో హాట్ టాపిక్.

1936లో తమిళనాడులోని తూత్తుక్కుడి దగ్గరలోని మరమ్మడంలో పుట్టిన జే. కనకరాత్.. మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఎంఏలో పీజీ చేశారు. న్యాయవాద పట్టా పుచ్చుకున్నారు. 1959లో ఆయన మద్రాస్ హైకోర్డులో న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1989లో కనకరాజ్ అదనపు ప్రభుత్వ ప్లీడర్‌గా నియమితులయ్యారు. 1990లో హైకోర్టు జడ్జిగా పదవిని చేపట్టారు. 1994లో రాకేశ్ మిట్టల్ కేసుతో కనకరాజ్ జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు. ఇదే కేసులో ఆ తర్వాత జయలలిత ఇబ్బందులపాలయ్యారు.

హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన తర్వాత జస్టిస్ కనకరాజ్.. తమిళనాడు వాణిజ్య పన్నుల స్పెషల్ ట్రిబ్యునల్ ఛైర్మెన్‌గా నియమితులయ్యారు. మూడేళ్ళ కాలం కొనసాగారు. హైకోర్టు జడ్జిగా కొనసాగిన కాలంలో ఆయన పలు కీలక తీర్పులను వెలువరించడమే కాకుండా పలు కమిటీలకు సారథ్యం వహించారు. వృత్తి పట్ల నిబద్ధత కలిగిన న్యాయకోవిదునిగా కనకరాజ్ ప్రసిద్ది గాంచిన నేపథ్యంలో ఆయన ఎంపికకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.