అనపర్తిలో పొలిటికల్ హీట్.. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య సవాళ్లు.. అనపర్తి, బిక్కవోలు మండలాల్లో 144 సెక్షన్‌

|

Dec 22, 2020 | 6:16 PM

తూర్పు గోదావరి జిల్లాలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య వివాదం చినికి చినికి ప్రమాణాల దాకా వచ్చింది. పరస్పరం విమర్శలకు దిగిన సత్తి సూర్యనారాయణరెడ్డి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.. భగవంతుడి ముందు ప్రమాణానికి సిద్ధమయ్యారు

అనపర్తిలో పొలిటికల్ హీట్.. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య సవాళ్లు.. అనపర్తి, బిక్కవోలు మండలాల్లో 144 సెక్షన్‌
Follow us on

తూర్పు గోదావరి జిల్లాలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య వివాదం చినికి చినికి ప్రమాణాల దాకా వచ్చింది. పరస్పరం విమర్శలకు దిగిన సత్తి సూర్యనారాయణరెడ్డి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.. భగవంతుడి ముందు ప్రమాణానికి సిద్ధమయ్యారు. ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డిపై అవినీతి ఆరోపణలు ఎక్కుపెట్టారు మాజీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి. ఈ క్రమంలో అనపర్తి, బిక్కవోలులో 144 సెక్షన్‌ విధించారు. ఈ నెల 26 వరకు ఎవరూ గుమిగూడొద్దని పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో గ్రామాల్లో టెన్షన్‌ నెలకొంది.

ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో అనపర్తి రాజకీయం సెగలు పుట్టిస్తోంది. తాజా ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే అవినీతి ఆరోపణలు ఎక్కుపెడితే.. గణపతి దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తా.. నేనొక్కడినే కాదు.. ఫ్యామిలీ.. ఫ్యామిలీ అంతా ప్రమాణం చేస్తామంటూ సవాలు విసిరారు ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి. రేపు మధ్యాహ్నం ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా స్థానిక పోలీసులు అనపర్తి, బిక్కవోలు మండలాల్లో 144 సెక్షన్‌ విధించారు.

రాజకీయ ప్రమాణాలకు బిక్కవోలు గణపతి ఆలయం వేదికకాబోతోంది. ప్రమాణాలకు సిద్ధమయ్యారు వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా పొలిటికల్‌ వార్‌ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు చేశారు మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. ఏలాంటి అక్రమాలు చేయలేదంటూ గణపతి ఆలయంలో భార్యతో సహా ప్రమాణానికి సిద్దమైన ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి. ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి దంపతులతో సహా ఐదుగురికి మాత్రమే అనుమతి ఇచ్చిన పోలీసులు ఎవరు వచ్చినా రాకపోయినా రేపు మధ్యాహ్నం 2:30గంటలకు ప్రమాణానికి సిద్ధమని ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి ప్రకటించారు.

అంతే ధీటుగా ప్రతి సవాల్ విసిరారు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. వెన్నుచూపడం మా ఇంటావంటా లేదన్నారు. అనపర్తిలో అధికారాన్ని ఉపయోగించి 144 సెక్షన్ పెట్టి ప్రజలను ఇబ్బందిపెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే సత్యనారాయణరెడ్డి చర్చనుంచి తప్పుకునే యత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అనపర్తి నియోజక వర్గంలో ఎమ్మెల్యే చేసే అక్రమ గ్రావెల్ మైనింగ్ పర్మిషన్ లు, నాటు సారా, పేకాట క్లబ్ లు నడిపిస్తున్నారంటూ ఆరోపించారు రామకృష్ణారెడ్డి. సాక్షాలతో నిరూపిస్తానంటున్నారు. గణపతి ఆలయంకు నేను వస్తా అంటున్న సత్యనారాయణరెడ్డి స్పష్టం చేశారు.