రసాబాసగా అఖిలపక్షం.. కాంగ్రెస్ వాకౌట్

|

Dec 31, 2019 | 8:14 AM

మునిసిపల్ ఎన్నికల నిర్వహణ అంశాన్ని చర్చించేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన అఖిల పక్ష సమావేశం రసాబాసగా ముగిసింది. రిజర్వేషన్లను వెల్లడించక ముందే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడాన్ని కాంగ్రెస్, బిజెపి సహా హాజరైన అన్ని పార్టీలు తప్పుపట్టాయి. ప్రభుత్వం నిర్దేశించిన గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ఎన్నికల అధికారి నాగిరెడ్డి వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ సమావేశం నుంచి వాకౌట్ చేసింది. కాగా కాంగ్రెస్ నేతలు ఎన్నికల అధికారిని దుర్భాషలాడారని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. తెలంగాణ ఎన్నికల సంఘం […]

రసాబాసగా అఖిలపక్షం.. కాంగ్రెస్ వాకౌట్
Follow us on

మునిసిపల్ ఎన్నికల నిర్వహణ అంశాన్ని చర్చించేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించిన అఖిల పక్ష సమావేశం రసాబాసగా ముగిసింది. రిజర్వేషన్లను వెల్లడించక ముందే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడాన్ని కాంగ్రెస్, బిజెపి సహా హాజరైన అన్ని పార్టీలు తప్పుపట్టాయి. ప్రభుత్వం నిర్దేశించిన గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ఎన్నికల అధికారి నాగిరెడ్డి వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ సమావేశం నుంచి వాకౌట్ చేసింది. కాగా కాంగ్రెస్ నేతలు ఎన్నికల అధికారిని దుర్భాషలాడారని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.

తెలంగాణ ఎన్నికల సంఘం శనివారం నిర్వహించిన అఖిల పక్ష సమావేశం వాడీవేడిగా కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ పక్షాన హాజరైన మర్రి శశిధర్ రెడ్డి, నిరంజన్ రావు.. ముందుగా రిజర్వేషన్లను ప్రకటించాలని, వాటిపై అభ్యంతరాలు లేకుంటేనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని ఎన్నికల అధికారి నాగిరెడ్డిని కోరారు. ఈ విఙ్ఞప్తిని టీఆర్ఎస్, ఎంఐఎం ప్రతినిధులు మినహా మిగిలిన అందరూ ఎన్నికల అధికారి ముందుంచారు. ఎన్నికల షెడ్యూల్ మార్చి, సంక్రాంతి పండగ తర్వాత తాజా షెడ్యూల్ విడుదల చేయాలని కోరారు.

అయితే, ఎన్నికల షెడ్యూల్ ఇదివరకే ప్రకటించినందున దాని ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల అధికారి నాగిరెడ్డి స్పష్టం చేశారు. దాంతో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు నాగిరెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నారంటూ నాగిరెడ్డిని తీవ్రస్థాయిలో విమర్శించారు. రిజర్వేషన్లు ప్రకటించకుండా ఎన్నికలు పెట్టడం మొదటిసారి చూస్తున్నామంటూ సమావేశం నుంచి కాంగ్రెస్ నేతలు వాకౌట్ చేశారు.

మరోవైపు కాంగ్రెస్ నేతల ఆరోపణలకు తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు తిప్పి కొట్టారు. అఖిలపక్షానికి హాజరైన టీఆర్ఎస్ నేతలు గట్టు రామచందర్ రావు కాంగ్రెస్ పార్టీ నేతల తీరును తప్పుపట్టారు. అధికారులను తిడతామంటే ఎలా అని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ పై తమకు పూర్తి నమ్మకం ఉందని, ప్రతిపక్షాల్లో అప్పుడే ఓటమి భయం కనపడుతుందని అన్నారాయన.