ఓటు చెల్ల‌క‌పోవ‌డంపై టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భ‌వాని క్లారిటీ…

|

Jun 20, 2020 | 12:20 PM

ఏపీ రాజ్యస‌భ ఎన్నిక‌ల్లో అధికార వైసీపీ పార్టీ నాలుగు స్థానాల్లో పోటీ చేసి విజ‌యం సాధించింది. ప్ర‌తిప‌క్ష టీడీపీ ఒక స్థానానికి పోటీ చేయ‌గా..ఆ పార్టీ అభ్య‌ర్థి వ‌ర్ల రామ‌య్య‌కు 17 ఓట్లు ప‌డ్డాయి.

ఓటు చెల్ల‌క‌పోవ‌డంపై టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భ‌వాని క్లారిటీ...
Follow us on

ఏపీ రాజ్యస‌భ ఎన్నిక‌ల్లో అధికార వైసీపీ పార్టీ నాలుగు స్థానాల్లో పోటీ చేసి విజ‌యం సాధించింది. ప్ర‌తిప‌క్ష టీడీపీ ఒక స్థానానికి పోటీ చేయ‌గా..ఆ పార్టీ అభ్య‌ర్థి వ‌ర్ల రామ‌య్య‌కు 17 ఓట్లు ప‌డ్డాయి. టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, మద్దాల గిరి, వల్లభనేని వంశీ చెల్ల‌కుండా ఓటు వేశారు. మ‌రో టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కామ్ కేసులో రిమాండ్ లో ఉన్న కార‌ణంగా ఓటు వేయ‌లేక‌పోయారు. అన‌గాని స‌త్య ప్ర‌సాద్ క్వారంటైన్ లో ఉన్న కార‌ణంగా ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌డానికి అవ‌కాశం కుద‌రలేదు. అయితే మ‌రో టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భ‌వాని ఓటు కూడా చెల్ల‌క‌పోవ‌డం పార్టీ వ‌ర్గాల్లో క‌ల‌కలం రేపింది. ఈ విష‌యంపై చంద్ర‌బాబు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలో త‌న ఓటు చెల్ల‌క‌పోవ‌డంపై క్లారిటీ ఇచ్చారు ఆదిరెడ్డి భ‌వాని.

ఓటింగ్ సమయంలో అక్కడ ఉండే వ్యక్తి ఇచ్చిన వివ‌ర‌ణ‌లో వ‌చ్చిన‌ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల పొరపాటు జరిగిందని ఆమె వెల్ల‌డించారు. అచ్చెన్నాయుడు రిమాండులో ఉండ‌టం వల్ల ఇలా చేశానని కొంద‌రంటున్నార‌ని, ఆ వార్త‌ల్లో వాస్తవం లేద‌ని తెలిపారు. పార్టీకి తానెప్పుడూ వ్య‌తిరేకంగా పనిచెయ్య‌డంలేద‌ని, రెబల్ ఎమ్మెల్యేల వైపు చూడటం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యంలో అక్క‌డ ఉన్న సిబ్బందితో పాటు త‌న త‌ప్పు కూడా ఉంద‌ని తెలిపారు. తప్పు జ‌రిగింద‌ని తెలిసిన వెంట‌నే..సరిదిద్దుకుందామ‌ని చూశాన‌ని..కానీ మళ్ళీ  ఓటు వేయడం..కుదరలేద‌ని వెల్ల‌డించారు. ఈ విష‌యం వెంట‌నే పార్టీ అధినేత‌ చంద్రబాబు గారికి తెలిపాన‌ని..దయచేసి ఎవ్వరు కూడా వేరే విధంగా ఆలోచించ‌వ‌ద్ద‌ని కోరారు ఆదిరెడ్డి భ‌వాని.