ప్రధాని పీఠంపై 16 ఏళ్ల బాలిక.. ఫిన్లాండ్ పీఎంగా రికార్డు

|

Oct 09, 2020 | 11:32 AM

ఫిన్లాండ్ ఉత్తర యూరోపియన్ దేశం . మానవ హక్కుల పరిరక్షణ, లింగ సమానత్వ సాధన, మహిళా సాధికారత అధిక ప్రాధాన్యత ఇస్తున్న దేశమిది. అచ్చం సినిమాలో జరిగినట్టే ఏకంగా దేశానికి ఒక్కరోజు ప్రధానమంత్రిగా పనిచేసి వార్తల్లోకెక్కారు

ప్రధాని పీఠంపై 16 ఏళ్ల బాలిక..  ఫిన్లాండ్ పీఎంగా రికార్డు
Follow us on

ఒక్క రోజు ముఖ్యమంత్రి, ఒక్కరోజు పాలన.. ఇదేదో సినిమా సీన్ లా అనిపిస్తుంది కదూ..! అచ్చం అదే తీరు.. ఒకే ఒక్కడు సినిమాలాగే జరిగింది. నిజంగా దేశానికి ప్రధానిగా ఒక్కరోజు వ్యవహరించిందామె. ఎక్కడ జరిగింది..ఎవరామె?

ఫిన్లాండ్ ఉత్తర యూరోపియన్ దేశం . మానవ హక్కుల పరిరక్షణ, లింగ సమానత్వ సాధన, మహిళా సాధికారత అధిక ప్రాధాన్యత ఇస్తున్న దేశమిది. అచ్చం సినిమాలో జరిగినట్టే ఏకంగా దేశానికి ఒక్కరోజు ప్రధానమంత్రిగా పనిచేసి వార్తల్లోకెక్కారు. 16 ఏళ్ల వయస్సు కలిగిన అవా ముర్టో ఒక్కరోజు ఆ దేశానికి ప్రధానిగా పూర్తిస్థాయిలో పరిపాలనా బాధ్యతలు చేపట్టారు. సినిమాలో జరిగినట్టు ఛాలెంజ్ లు జరగలేదు. అలాగని మేక్ ఎ విష్ లాంటి కార్యక్రమం అంతకంటే కాదు. ఇప్పటికే 34 ఏళ్ల ప్రాయంలో ప్రదానిగా బాధ్యతల స్వీకరించడం ద్వారా అతి చిన్న వయస్సులో అత్యున్నత పదవి చేపట్టిన మహిళగా ఖ్యాతి గాంచిన ఫిన్ లాండ్ ప్రదానమంత్రి సనా మారిన్ స్వయంగా… ఈ 16 ఏళ్ల బాలిక అవా ముర్టోను ఆ పదవిలో కూర్చోబెట్టి.. తాను ఓ రోజు విశ్రాంతి తీసుకున్నారు.

వాస్తవానికి గర్ల్స్ టేకోవర్ పేరుతో ప్లాన్ ఇంటర్నేషనల్ అనే సంస్థ వివిధ రంగాల్లోని బాలికల్ని ప్రోత్సాహిస్తోంది. బాలికల్లో నైపుణ్యత, ఐటీ రంగంలో అవకాశాల్ని పెంచడం, మహిళలపై ఆన్ లైన్ వేధింపుల నుంచి రక్షించడం లాంటివి మహిళా సాధికారత కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగానే ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్.. 16 ఏళ్ల అవా ముర్టోకు ప్రధానిగా పనిచేసే అవకాశాన్ని కల్పించారు.

ఒక్కరోజంతా ఫిన్లాండ్ దేశ ప్రధానిగా పనిచేసిన అవా ముర్టో తన అనుభవాల్ని మీడియాతో పంచుకున్నారు. పాలనలో ఇబ్బందులు, ప్రధాని హోదాలో రోజంతా ఉత్కంఠగా గడిచిందని చెప్పారు. పరిపాలనకు సంబంధించి కొన్ని క్లిష్టమైన విషయాలు తెలుసుకున్నానని.. ఛాన్సలర్, మంత్రులు, ఉన్నతాధికారులతో విడివిడిగా సమీక్షా సమావేశాలు నిర్వహించానన్నారు. అభివృద్ది, విదేశీ వాణిజ్యంపై పలు సూచనలు చేశానని తెలిపారు. వాస్తవానికి రాజకీయ నేతలు మరింత సృజనాత్మకతతో సరికొత్తగా ఆలోచించడానికి టీనేజర్ల సలహాలు, సూచనలు పనికొస్తాయనేది తన అభిప్రాయమన్నారు. ఒక్క రోజు ప్రధానిగా బాగానే పని చేశాననుకుంటున్నానని… భవిష్యత్తులో పూర్తికాలం ప్రధాని కావాలని ఉందని అవా ముర్టో అశాభావం వ్యక్తం చేశారు.