కోహ్లీ తప్పకుండా ఫామ్‌లోకి వస్తాడంటున్న గవాస్కర్‌

|

Sep 29, 2020 | 4:20 PM

విరాట్‌కోహ్లీపై ఓ మాటన్నందుకే పెద్ద రాద్ధాంతం అయిందనుకున్నారో ఏమో ఈసారి గవాస్కర్‌ జాగ్రత్తగా మాట్లాడారు.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మూడు మ్యాచుల్లో ఫ్లాప్‌ అయినంత మాత్రనా కొంపలేమీ అంటుకుపోవని..

కోహ్లీ తప్పకుండా ఫామ్‌లోకి వస్తాడంటున్న గవాస్కర్‌
Follow us on

విరాట్‌కోహ్లీపై ఓ మాటన్నందుకే పెద్ద రాద్ధాంతం అయిందనుకున్నారో ఏమో ఈసారి గవాస్కర్‌ జాగ్రత్తగా మాట్లాడారు.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మూడు మ్యాచుల్లో ఫ్లాప్‌ అయినంత మాత్రనా కొంపలేమీ అంటుకుపోవని, త్వరలోనే మళ్లీ ఫామ్‌లోకి వస్తాడని అన్నాడు.. కోహ్లీ చాలా గొప్ప క్లాస్‌ బ్యాట్స్‌మన్‌ అని, ఆ విషయం అందరికీ తెలిసిన విషయమేనని గవాస్కర్‌ చెప్పుకొచ్చారు. ఐపీఎల్‌ టోర్నీ ముగిసేనాటికి కోహ్లీ తప్పకుండా 500 పరుగులు అధిగమిస్తాడన్న నమ్మకం తనకు ఉందని గవాస్కర్‌ అన్నాడు. 2016లో పరుగుల వరద పారించిన విషయాన్ని గవాస్కర్‌ గుర్తు చేశారు.. ఇప్పటికే మూడు మ్యాచ్‌లు అయిపోయాయి కాబట్టి ఈసారి అన్ని పరుగులు చేయడం కష్టమే కానీ గుర్తించుకునేంత పరుగులు మాత్రం కోహ్లీ చేస్తాడని అన్నారు. మొదటి మూడు మ్యాచుల్లోనూ బ్యాట్‌కు పని చెప్పి ఉంటే ఈజీగా వెయ్యి పరుగులు చేసేవాడని తెలిపాడు. కోహ్లీ విషయంలో ఓపిక అవసరమన్న అభిప్రాయాన్ని గవాస్కర్‌ వెలిబుచ్చాడు. 2016 సీజన్‌లో విరాట్‌ కోహ్లీ నిజంగానే విరాట్‌ స్వరూపాన్ని చూపించాడు.. ఏకంగా నాలుగు సెంచరీలు చేశాడు.. మొత్తం 973 పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు.. అయితే ఈసారి ఇప్పటి వరకు కోహ్లీ బ్యాట్‌ నుంచి పెద్దగా పరుగులు రాలేదు.. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 13 బంతుల్లో 14 పరుగులు చేసిన కోహ్లీ తర్వాత పంజాబ్‌పై ఒక పరుగు, నిన్న ముంబాయితో జరిగిన మ్యాచ్‌లో మూడు పరుగులు చేశాడు.. కోహ్లీ ఫామ్‌లోకి వస్తే, డిలివియర్స్‌ ధాటిగా ఆడితే ఇక బెంగళూరు జట్టుకు తిరుగే ఉండదని అభిమానులు అనుకుంటున్నారు..