
సహజంగా పాములను చూస్తేనే పరుగులు తీస్తుంటాం.. ఇక దగ్గరగా చూస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు.. ఇక కింగ్ కోబ్రా లాంటి పాములను చూస్తే ముచ్చెమటలు పడతాయి.. బుసలు కొట్టే విధానంతోపాటు.. వాటి ఆకారాన్ని చూస్తే భయం పుట్టాల్సిందే.. అత్యంత విషపూరితమైన పాములలో కింగ్ కోబ్రా ఒకటి.. అయితే.. పాముల జాతిలోనే అత్యంత విషపూరితమైన, పొడవైన పాముగా పేరొందిన రాచనాగు (కింగ్ కోబ్రా) గురించి ఒక అరుదైన, ఆసక్తికరమైన ప్రకృతి రహస్యం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా పాములు బొర్రలు, తొర్రలు లేదా చెట్ల కింద గుడ్లు పెడతాయి. కానీ, ప్రపంచంలోనే గుడ్ల కోసం ప్రత్యేకంగా గూడు నిర్మించే ఏకైక పాము కింగ్ కోబ్రా మాత్రమే.. అంటూ నిపుణులు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. గుడ్లు పెట్టడానికి గూడు కట్టే ముందు 60 రోజుల పాటు ఉపవాసం ఉండే రాజనాగు.. మాతృత్వం, అద్భుతమైన శాస్త్రీయ రహస్యాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..
సాధారణంగా, పాములు గుడ్లు పెట్టి వెంటనే ఆ ప్రదేశం నుండి వెళ్లిపోతాయి. కానీ ప్రపంచంలోని అన్ని పాములలో, రాచనాగుకు తన జాతిని వృద్ధి చేసుకునే విషయంలో పూర్తిగా భిన్నమైన అలవాటు ఉంది. అది ఒక తల్లిలా తన పిల్లలను కాపాడటానికి ఇంజనీర్‌లా వ్యవహరించడం ఒక సహజ అద్భుతం.. అని పేర్కొంటున్నారు.
ఆడ కింగ్ కోబ్రా తన శరీరాన్ని ఒక రింగులా చుట్టి, ఎండుటాకులు, కొమ్మలను ఒకచోటకు లాగి దాదాపు 3 నుంచి 4 అడుగుల ఎత్తులో డోమ్ ఆకారంలో ఒక గూడును తయారు చేస్తుంది. వర్షపు నీరు చేరకుండా ఉండేలా ఎత్తైన ప్రాంతాల్లో, నీటికి దగ్గరగా ఈ గూళ్లను నిర్మిస్తుంది. గూడులో కింద భాగంలో దాదాపు 20 నుంచి 40 గుడ్ల వరకు పెట్టి, ఆపైన మళ్లీ ఆకులతో కప్పేస్తుంది.
ఎండుటాకులు కుళ్ళే ప్రక్రియ ద్వారా జనించే వేడిని (Compost heat) ఉపయోగించి గుడ్లను వెచ్చగా ఉంచుతుంది. బయట వాతావరణం చల్లగా ఉన్నా, గూడు లోపల ఉష్ణోగ్రత ఎప్పుడూ 26°C – 29°C మధ్య స్థిరంగా ఉండేలా ఈ పాము తన శరీర కలయికతో గాలి వెళ్లే మార్గాలను సర్దుబాటు చేస్తుంది.
పొదిగే కాలం సుమారు 60 నుండి 80 రోజుల పాటు ఉంటుంది. గుడ్లు పెట్టిన తర్వాత దాదాపు 60 నుండి 80 రోజుల పాటు తల్లి పాము ఆ గూడును విడిచి పెట్టకుండా కాపలా కాస్తుంది.
ఈ కాపలా సమయంలో ఆ పాము ఏమీ తినకుండా (ఆహారం తీసుకోకుండా) అలాగే ఉండిపోతుంది. ఈ రెండు నెలల కాలంలో ఒక్క చుక్క నీరు కూడా తాగకుండా, ఎలాంటి ఆహారం తినకుండా కఠినమైన ఉపవాసం పాటిస్తుంది.
గూడు వద్దకు రాబందులు, అడవి పందులు లేదా మనుషులు ఎవరు వచ్చినా అత్యంత భయానకమైన గర్జన (Low frequency hiss) చేస్తూ ఎదురుదాడికి దిగుతుంది.
గుడ్లు పొదిగి పిల్లలు బయటకు వచ్చే సమయానికి.. అంటే వారం ముందు.. తల్లి పాము (రాచనాగు) ఆ గూడును విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతుంది. ఆకలితో ఉన్న తాను సొంత పిల్లలనే తినివేసే ప్రమాదం ఉందనే సహజమైన సంకేతంతోనే అది గుడ్లు పిల్లలుగా మారే సమయానికి అక్కడి నుంచి వెళ్లిపోతుందని వన్యప్రాణి పరిశోధకులు చెప్తారు. సరైన సంరక్షణ, మాతృత్వపు ప్రేమను ప్రదర్శించడంలో అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా ఇతర సరీసృపాలకు భిన్నమైనదని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..