
మామిడి చెట్టు అనగానే మనకు పెద్ద తోటలు, విశాలమైన స్థలం గుర్తుకు వస్తాయి. కానీ ఆధునిక గార్డెనింగ్ పద్ధతులతో ఇప్పుడు మీ ఇంటి బాల్కనీ లేదా చిన్న టెర్రస్ పైన కూడా మామిడి పండ్లను పండించవచ్చు. తక్కువ స్థలంలో మామిడి చెట్టును పెంచడానికి అవసరమైన గ్రాఫ్టింగ్ పద్ధతులు, కుండీ ఎంపిక గురించి ముఖ్య సమాచారం ఇక్కడ ఉంది. ముఖ్యంగా మ్యాంగో బోన్సాయ్ లేదా డ్వార్ఫ్ వెరైటీ (కురచ రకాలు) మొక్కలను ఎంచుకోవడం ద్వారా తక్కువ కాలంలోనే పండ్లను పొందవచ్చు. సరైన మట్టి మిశ్రమం, ఎండ తగిలే ప్రదేశం, క్రమబద్ధమైన కత్తిరింపులు (Pruning) ఉంటే, మీ ఇంట్లోనే రసాయనాలు లేని తీయని మామిడి పండ్లను ఆస్వాదించవచ్చు.
సరైన రకాన్ని ఎంచుకోవడం (Select the Right Variety): కుండీల్లో పెంచడానికి సాధారణ మామిడి చెట్లు పనికిరావు. వీటికి బదులుగా డ్వార్ఫ్ వెరైటీ (Dwarf Varieties) లేదా కురచ రకాలను ఎంచుకోవాలి. ఉదాహరణకు ఆమ్రపాలి, తైవాన్ ఆల్ టైమ్ మ్యాంగో వంటి రకాలు కుండీల్లో పెరగడానికి అనువుగా ఉంటాయి. ఇవి తక్కువ ఎత్తులోనే ఎక్కువ కాపును ఇస్తాయి.
మామిడి చెట్టు వేర్లు బలంగా ఉంటాయి. కాబట్టి, కనీసం 20 నుండి 24 అంగుళాల వెడల్పు, లోతు ఉన్న పెద్ద కుండీ లేదా డ్రమ్మ్‌ను ఎంచుకోవాలి. కుండీ అడుగున నీరు బయటకు వెళ్లడానికి తగినన్ని రంధ్రాలు ఉండాలి. ఇక ముఖ్యంగా సారవంతమైన మట్టి మామిడి చెట్టుకు చాలా అవసరం. ఇందుకోసం 40శాతం ఎర్రమట్టి, 30శాతం వర్మీ కంపోస్ట్ లేదా పశువుల ఎరువు, 20శాతం కోకోపీట్,10శాతం ఇసుకను తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కలిపి కుండీలో నింపాలి. వేప పిండిని కలపడం వల్ల వేర్లకు చీడపీడలు పట్టకుండా ఉంటాయి.
మరీ ముఖ్యంగా మామిడి చెట్టుకు కనీసం 6 నుండి 8 గంటల పాటు నేరుగా ఎండ తగలాలి. కాబట్టి, కుండీని ఎండ బాగా తగిలే బాల్కనీ లేదా మేడ మీద ఉంచండి. మట్టి పైపొర ఎండిపోయినప్పుడు మాత్రమే నీరు పోయాలి. అతిగా నీరు పోస్తే వేర్లు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఇక మొక్క మరీ పొడవుగా పెరగకుండా, పక్కలకు కొమ్మలు వచ్చేలా ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉండాలి. దీనివల్ల మొక్క గుబురుగా తయారై ఎక్కువ పూత వస్తుంది. విత్తనం నుండి పెంచే చెట్టు కంటే, నర్సరీ నుండి తెచ్చిన గ్రాఫ్టెడ్ (అంటు కట్టిన) మొక్కలు త్వరగా (2-3 ఏళ్లలో) కాపుకు వస్తాయి. ఈ వేసవిలో మీరు కూడా ఒక మామిడి మొక్కను నాటి చూడండి!
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..