
ఆధార్ నమోదు, ధ్రువీకరణలో బయోమెట్రిక్ వివరాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఒక వ్యక్తి వేలిముద్రలు, ఐరిస్ నమూనాలను మరో వ్యక్తి వివరాలతో సరిపోల్చడం సాధారణంగా సాధ్యం కాదనే ఉద్దేశంతో ఈ వ్యవస్థ పనిచేస్తుంది. అయితే ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో జరిగిన ఓ ఘటన ఈ సాంకేతిక విధానానికే అరుదైన సవాల్‌ను ఎదురుచూపించింది.
రాంపూర్‌కు చెందిన పదో తరగతి విద్యార్థినులు ఖిజ్రా జుబేర్, తూబా జుబేర్ కవలలు. వీరిద్దరి ఆధార్ వివరాలను విద్యా అవసరాల కోసం అప్‌డేట్ చేయించే సమయంలో అధికారులు ఊహించని సమస్యను గుర్తించారు. ఒకరి బయోమెట్రిక్ వివరాలు నమోదు చేసిన తర్వాత.. రెండో విద్యార్థిని వివరాలను నమోదు చేయడానికి ప్రయత్నించగా, సిస్టమ్ ఆ సమాచారాన్ని కొత్త రికార్డుగా కాకుండా ఇప్పటికే నమోదైన వివరాల నకలుగా గుర్తించింది.
ఈ పరిణామంతో ఇద్దరు విద్యార్థినుల ఆధార్ ప్రక్రియ ముందుకు సాగలేదు. ముఖ్యంగా పదో తరగతి బోర్డు పరీక్షల రిజిస్ట్రేషన్‌కు బయోమెట్రిక్ ధ్రువీకరణ అవసరం కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. సమస్య పరిష్కారం కాకపోతే విద్యా సంబంధిత ప్రక్రియల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని భావించారు.
దీంతో కుటుంబం రాంపూర్ జిల్లా మేజిస్ట్రేట్ అజయ్ కుమార్ ద్వివేదిని ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న జిల్లా యంత్రాంగం దీనిని సాధారణ సాంకేతిక సమస్యగా కాకుండా అసాధారణమైన కేసుగా పరిగణించింది. యూఐడీఏఐకి చెందిన న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయం, లఖ్‌నవూ ప్రాంతీయ కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరిపి పరిష్కార మార్గాలను అన్వేషించారు.
కేసును పరిశీలించిన సాంకేతిక నిపుణులు అందుబాటులో ఉన్న రికార్డులను మరోసారి పరిశీలించారు. సాధారణ ఆటోమేటెడ్ ప్రక్రియతో పాటు అదనపు ధ్రువీకరణ, మాన్యువల్ పరిశీలన వంటి విధానాలను ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియకు సుమారు మూడు నుంచి నాలుగు నెలల సమయం పట్టింది.
చివరికి పాత రికార్డుల్లో అవసరమైన మార్పులు చేసి ఇద్దరు కవల విద్యార్థినులకు ప్రత్యేక ఆధార్ గుర్తింపులను కొనసాగించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో వారి విద్యా ప్రక్రియకు ఎదురైన అడ్డంకి తొలగిపోయింది. అత్యంత అరుదుగా ఎదురయ్యే ఇలాంటి ఘటనలు బయోమెట్రిక్ ఆధారిత గుర్తింపు వ్యవస్థలకు ఎదురయ్యే సాంకేతిక సవాళ్లను చూపిస్తున్నాయి. అదే సమయంలో జిల్లా యంత్రాంగం, యూఐడీఏఐ అధికారులు సమన్వయంతో వ్యవహరించడంతో విద్యార్థినుల సమస్యకు పరిష్కారం లభించింది.
Twins With Identical Biometrics
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..