
చిన్నారుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్లోర్‌ఫెనిరమైన్ మాలియేట్, ఫినైల్‌ఫైన్ హైడ్రోక్లోరైడ్ కలిగిన ఫిక్స్‌డ్-డోస్ కాంబినేషన్ (FDC) ఔషధాలను ఆంక్షలు విధించింది. నాలుగేళ్లలోపు పిల్లలకు ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. ఈ కాంబినేషన్‌తో తయారయ్యే ఔషధాలపై ప్రత్యేక హెచ్చరికను తప్పనిసరిగా ముద్రించాలని ఔషధ కంపెనీలను ఆదేశించింది.
కేంద్ర ప్రభుత్వం శనివారం ఆగస్టు 22, 2026న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఈ రెండు ఔషధ పదార్థాలు కలిగిన అన్ని సంబంధిత ఫార్ములేషన్లకు కొత్త నిబంధనలు వర్తించనున్నాయి. ఇకపై ఔషధాల లేబుల్స్, ప్యాకేజీ ఇన్సర్ట్స్, ప్రచార సామగ్రిపై నాలుగేళ్లలోపు పిల్లల వినియోగానికి ఈ కాంబినేషన్ తగదనే విషయాన్ని స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. ఇప్పటికే 2025 ఏప్రిల్ 15న ఈ రెండు పదార్థాలు కలిగిన కొన్ని FDCల విషయంలో ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంది. తాజాగా నిబంధనలను విస్తరించి.. క్లోర్‌ఫెనిరమైన్ మాలియేట్, ఫినైల్‌ఫైన్ హైడ్రోక్లోరైడ్ రెండింటినీ కలిగి ఉన్న అన్ని సంబంధిత కాంబినేషన్లకు ఈ హెచ్చరికను వర్తింపజేసింది.
నిపుణుల సిఫార్సులతో నిర్ణయం!
ఈ నిర్ణయం వెనుక నిపుణుల కమిటీ, డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ (DTAB) సిఫార్సులు ఉన్నాయని కేంద్రం తెలిపింది. నాలుగేళ్లలోపు పిల్లలకు ఈ ఔషధ కాంబినేషన్ వల్ల ఆరోగ్యపరమైన ప్రమాదాలు ఉండే అవకాశం ఉందని నిపుణులు సూచించిన నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చిన్నారుల కోసం సురక్షితమైన ప్రత్యామ్నాయ చికిత్సా మార్గాలు అందుబాటులో ఉన్నాయని కూడా పేర్కొంది.
తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి!
పిల్లలకు జలుబు, దగ్గు లేదా ఇతర అనారోగ్య లక్షణాలు కనిపించినప్పుడు తల్లిదండ్రులు స్వయంగా మందులు ఇవ్వకుండా వైద్యుల సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నాలుగేళ్లలోపు పిల్లలకు ఏదైనా కాంబినేషన్ ఔషధాన్ని ఇచ్చే ముందు వైద్యుడిని సంప్రదించడం అవసరం. ప్రజా ప్రయోజనం, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1940లోని సెక్షన్ 26A కింద కేంద్ర ప్రభుత్వం ఈ ఆదేశాలను జారీ చేసింది. ఈ నిర్ణయంతో చిన్నారులకు మందుల వినియోగంలో మరింత భద్రత కల్పించడమే లక్ష్యంగా కేంద్రం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..