Hanuman Junction: హనుమాన్ జంక్షన్ చిత్రానికి తొలుత అనుకున్న హీరోలు ఎవరో తెలుసా..?

దర్శకుడు మోహన్ రాజా తన తొలి చిత్రం హనుమాన్ జంక్షన్ కాస్టింగ్ వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తొలుతు ఈ సినిమాకు హీరోలకు అనుకున్నది అర్జున్ - జగపతిబాబులను కాదు అట. అంతేకాదు.. వేణు తొట్టెంపూడి పాత్ర ఎంపిక భావోద్వేగభరితమని పేర్కొన్నారు.

Hanuman Junction: హనుమాన్ జంక్షన్ చిత్రానికి తొలుత అనుకున్న హీరోలు ఎవరో తెలుసా..?
Hanuman Junction Movie

Updated on: Mar 01, 2026 | 4:33 PM

దర్శకుడు మోహన్ రాజా తన కెరీర్ తొలి చిత్రం హనుమాన్ జంక్షన్ నిర్మాణ అనుభవాలను, ముఖ్యంగా కాస్టింగ్ ప్రక్రియ వెనుక ఉన్న అనేక ఆసక్తికర విషయాలను తాజాగా పంచుకున్నారు. రెండు సమానమైన హీరో పాత్రలున్న ఈ మల్టీస్టారర్ చిత్రానికి సరైన నటులను ఎంపిక చేయడం పెద్ద సవాలుగా మారిందని ఆయన వెల్లడించారు. కాస్టింగ్‌ను ఖరారు చేయడానికి దాదాపు నాలుగు నెలల సమయం పట్టిందని, ఈ క్రమంలో ఎన్నో మలుపులు చోటుచేసుకున్నాయని మోహన్ రాజా తెలిపారు. తొలుత, జగపతిబాబు పోషించిన పాత్రకు మోహన్ బాబు గారిని, అర్జున్ పోషించిన పాత్రకు రాజశేఖర్ గారిని సంప్రదించి, ఖరారు చేశారని మోహన్ రాజా పేర్కొన్నారు. వారికి అడ్వాన్స్‌లు కూడా చెల్లించిన తర్వాత, ఒక వారం రోజుల పాటు వారితో సినిమా చేయబోతున్నామనే ఆనందంలో ఉన్నానని గుర్తుచేసుకున్నారు. అయితే, ఒక వారం తర్వాత వారిద్దరి వర్కింగ్ స్టైల్స్ మధ్య కొంత వ్యత్యాసం ఉండటం గమనించారని, ఇది సినిమా కథనంపై ప్రభావం చూపుతుందని భావించినట్లు వివరించారు. ఆ సమయంలో ఒక నూతన దర్శకుడిగా ఇంత పెద్ద స్టార్స్‌ను డీల్ చేయడంలోనే తన శక్తి అంతా ఖర్చైపోతుందని, కథపై పూర్తి దృష్టి పెట్టలేకపోతాడని గ్రహించి, ఈ కాంబినేషన్‌ను వదులుకోవాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. కథను పక్కన పెట్టి స్టార్స్‌ను మేనేజ్ చేయడం సరికాదని తన తండ్రి భావించినట్లు మోహన్ రాజా పేర్కొన్నారు. ఈ నిర్ణయం తర్వాత, కథలో కొన్ని మార్పులు చేసి, దాదాపు 12 పేజీల కొత్త స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారట. ఆ తర్వాత, అర్జున్, జగపతిబాబు, వేణులతో కూడిన ఒక కొత్త “క్రేజీ కాంబినేషన్” కుదిరిందని మోహన్ రాజా తెలిపారు.

వేణు పాత్ర ఎంపిక వెనుక ఒక భావోద్వేగభరితమైన కథ ఉందని ఆయన చెప్పారు. స్వయంవరం సినిమా నుంచి తమ కుటుంబానికి సన్నిహితుడైన వేణు, దర్శకుడు మోహన్ రాజా తండ్రిపై పూర్తి నమ్మకంతో, మలయాళం ఒరిజినల్ చిత్రాన్ని కూడా చూడకుండానే, చిన్న పాత్ర అయినా పెద్ద పాత్ర అయినా చేస్తానని చెప్పి ఒప్పుకున్నారని మోహన్ రాజా వెల్లడించారు. ఈ విషయంలో వేణుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అర్జున్ గారికి, మోహన్ రాజా తండ్రికి మధ్య మంచి పరిచయం ఉండటంతో, ఆయనను ఒప్పించడం సులువైందని అన్నారు. అయితే, జగపతిబాబు.. ఆయనకు చెప్పిన పాత్రను చేయాలంటే తొలుత చాలా భయపడ్డారని, ఆయన్ను ఒప్పించడం కూడా సవాలుతో కూడుకున్నదని మోహన్ రాజా వివరించారు. ఈ విధంగా ఎన్నో మలుపులు, సవాళ్ల తర్వాత హనుమాన్ జంక్షన్ చిత్రానికి సరైన తారాగణం ఖరారైందని మోహన్ రాజా తెలియజేశారు.

Also Read:  ఆంధ్రా టైగర్ నెల్లూరు కాంతారావు గురించి ఈ విషయాలు మీకు తెలుసా..? 

Follow Us