
అభినయశ్రీ గుర్తుందా.? ఎన్నో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించారు అభినయశ్రీ. ఈ అమ్మడు స్పెషల్ సాంగ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది ముఖ్యంగా.. అల్లు అర్జున్ నటించిన ఆర్య సినిమాలో ఆ అంటే అమలాపురం సాంగ్ తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆర్య సినిమా తన సినీ జీవితంలో ఎలా ప్రత్యేక స్థానాన్ని పొందిందో, ఆ సినిమాతో ముడిపడిన అనేక గుర్తుండిపోయే క్షణాలను పంచుకున్నారు. దర్శకుడు సుకుమార్ మొదట ఆర్యలో తనను ఎంపిక చేయడానికి ఇష్టపడలేదని ఆమె అన్నారు. అప్పటికి ఆయనకు సాక్షి శివానంద్ లేదా సిమ్రాన్ వంటి కొంచెం పాపులర్ అయిన నటీమణులు కావాలనే అభిప్రాయం ఉండేదని తెలిపారు. అయితే, జై సినిమా చేస్తున్న సమయంలో డాన్స్ డైరెక్టర్ శంకర్ మాస్టర్ ద్వారా దిల్ రాజు గారికి తనను పరిచయం చేశారని, అప్పుడు దిల్ రాజు గారి చొరవతో తనను సినిమాకు తీసుకున్నారని తెలిపింది అభినయ.
సినిమాకు ఎంపికైనప్పటికీ, సుకుమార్ గారు తనను చూడనే లేదని, ఆయనకు సంథింగ్ ఇష్టం లేదని అభినయశ్రీ పేర్కొన్నారు. కనీసం కలవకుండానే ఒసూరుకు పంపించేసారని, అక్కడ కాస్ట్యూమ్స్ అన్నీ ఫిక్స్ అయ్యాయని తెలిపారు. కానీ, ఒక రాత్రి శంకర్ మాస్టర్ వచ్చి, పరిస్థితులు బాగాలేవని, తనకు వేరే మంచి సినిమా చెబుతానని చెప్పడంతో, అభినయశ్రీ తిరిగి వెళ్లిపోయిందంట. అయితే, దిల్ రాజు గారు జోక్యం చేసుకుని, ఒక ఆర్టిస్ట్‌ను ఇంత దూరం పిలిపించి, ఆమె ఎలా చేస్తుందో చూడకుండా పంపించడం తప్పు అని సుకుమార్ గారికి చెప్పినట్టు తెలిపింది. కనీసం ఒక షాట్ చేయనివ్వమని, నచ్చకపోతే వెంటనే వెనక్కి పంపించేయవచ్చని దిల్ రాజు చెప్పారట
దిల్ రాజు మాటతో మరుసటి రోజు ఉదయమే తిరిగి పిలిపించి, తన మొదటి షాట్‌ను ట్రైన్‌లో చిత్రీకరించారని అభినయశ్రీ గుర్తు చేసుకున్నారు. అప్పుడు కూడా డైరెక్టర్ సుకుమార్ ఎవరో తనకు తెలియదని, రిహార్సల్ చేస్తుండగా ఆయన వచ్చి చూసి వెళ్ళిపోయారని, తర్వాత తాను హ్యాపీ అయ్యారని చెప్పారని వివరించారు. అలా ఆర్య సినిమా అవకాశం నిలబడిందని, అల్లు అర్జున్ తో కలిసి పనిచేసే అవకాశం లభించిందని తెలిపింది అభినయ శ్రీ. అప్పట్లో అల్లు అర్జున్‌కు కూడా అది రెండవ సినిమా అని, ఆయన చాలా మంచి మనసున్న వ్యక్తి అని తెలిపింది. 20 ఏళ్ల తర్వాత, ఇటీవల జరిగిన ఒక వేడుకలో అల్లు అర్జున్, సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్ లను మళ్లీ కలిసినప్పుడు తనకు ఎంతో సంతోషం కలిగిందని అభినయశ్రీ పేర్కొంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్, తనను చూడగానే హుందాగా లేచి పలకరించారని, తమిళ్‌లో మాట్లాడారని చెప్పుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి