ఆ సూపర్ హిట్ సినిమాకు ఒక్క రూపాయే తీసుకున్నా.. దానికి ఓ కారణం ఉంది: తనికెళ్ల భరణి

తనికెళ్ళ భరణి గతంలో ఓ ఇంటర్వ్యూలో సినీ, సామాజిక, ఆధ్యాత్మిక అంశాలపై తన ఆలోచనలను పంచుకున్నారు. ఆయన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అలాగే ఓ సూపర్ హిట్ సినిమా గురించి అలాగే తన రెమ్యునరేషన్ గురించి కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఆ సూపర్ హిట్ సినిమాకు ఒక్క రూపాయే తీసుకున్నా.. దానికి ఓ కారణం ఉంది: తనికెళ్ల భరణి
Tanikella Bharani

Updated on: Nov 17, 2026 | 9:02 AM

ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి తన సినీ ప్రస్థానంలో ఎదురైన ఒక విచిత్రమైన, మానసిక క్షోభతో కూడిన సంఘటనను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఇది ఆయనను సుమారు ఒక సంవత్సరం పాటు ఒక గొప్ప రచయిత పేరు వింటేనే భయపడేలా చేసిందని తెలిపారు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో అర్జున్ హీరోగా తెరకెక్కిన కోనసీమ కుర్రాడు సినిమాకు సంబంధించినదే ఈ సంఘటన. భరణి తన ఇంటి పక్కనే నివసించే గొప్ప సాంకేతిక నిపుణుడు రవిరాజా పినిశెట్టిని కలిసినప్పుడు, ఆయన కోనసీమ కుర్రాడు చిత్రానికి రచయితగా తనను ఆహ్వానించారు. మహాలింగపురంలోని వారి ఆఫీసులో జరిగిన చర్చలో కథను వివరించి, మాటలు రాయాలని కోరారు. ఆ సమయంలో తనకు కొత్తగా రచయితగా అవకాశం వచ్చిందన్న ఆనందంలో భరణి మునిగితేలారు. డబ్బుల గురించి మాట్లాడినప్పుడు, “మీరు ఊహించక్కర్లేదు, మిమ్మల్ని సంతృప్తిపరుస్తాం” అని రవిరాజా చెప్పినట్లు భరణి గుర్తు చేసుకున్నారు. కామెడీ రచనా శైలిపై తనకు అంతగా పట్టులేదన్నప్పుడు, “కామెడీ ఎడంచేత్తో రాస్తా” అని తాను అతి సాధారణంగా అన్నానని తెలిపారు. అప్పటికి కనకమహాలక్ష్మి రికార్డింగ్స్, రేడియో స్కెచ్‌లతో కామెడీ రచయితగా భరణికి మంచి గుర్తింపు ఉంది.

అయితే, సినిమాకు మాటలు రాయడం మొదలుపెట్టిన కొన్నాళ్ళకు, దివాకర్ బాబు నుండి భరణికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. దివాకర్ బాబు కోనసీమ కుర్రాడు సినిమా గురించి అడగ్గా, తాను మాటలు రాస్తున్నానని భరణి చెప్పారు. అప్పుడు దివాకర్ బాబు ” నేను కూడా ఆ సినిమాకు రాస్తున్నా కదా” అన్నాడు. ఈ మాటలు వినగానే భరణికి ఆశ్చర్యం కలిగింది. అనంతరం, అసలు విషయం బయటపడింది. ప్రముఖ రచయిత సత్యమూర్తి ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్‌ను సగం రాశారని, అయితే ఆయన ఆసుపత్రి పాలై తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని దివాకర్ బాబు వివరించారు. ఈ విషయం తెలియగానే భరణి చలించిపోయారు. సత్యమూర్తిని కలవడానికి తీసుకెళ్లినప్పుడు, ఆయన మంచంపై అచేతన స్థితిలో ఉన్న దృశ్యం భరణిని తీవ్రంగా కలచివేసింది. సత్యమూర్తి ఇక రాయలేని పరిస్థితిలో ఉన్నారని గ్రహించిన భరణికి, తన స్థానంలో మాటలు రాయడం ఎంత కష్టమో అర్థమైంది. తీవ్ర మనోవేదనకు గురైనప్పటికీ, సినిమాను పూర్తి చేయాలనే నిబద్ధతతో ఆయన డైలాగులు రాశారు.

కోనసీమ కుర్రాడు చిత్రం అనూహ్య విజయం సాధించింది. అందులోని ప్రతి అక్షరం తనదేనని, కథ తనది కానప్పటికీ, సంభాషణలు పూర్తిగా తనవేనని భరణి స్పష్టం చేశారు. అయితే, ఆ విజయం తరువాత భరణికి సత్యమూర్తి నుండి ఫోన్ వస్తుందేమో, లేక ఆయనను కలిస్తే తిడతారేమో, కొడతారేమో అనే భయం పట్టుకుంది. ఈ భయం సుమారు ఒక సంవత్సరం పాటు కొనసాగింది. ఒకసారి ఆత్రేయ సభలో సత్యమూర్తి పేరు ప్రకటించగానే, భరణి సభ నుండి పారిపోయి వచ్చేశారని గుర్తు చేసుకున్నారు. సత్యమూర్తి అనే పేరు కానీ, ఆయన ప్రస్తావన కానీ వస్తే భయం వేసేదని, ఆ ఏడాది కాలం మానసిక క్షోభ అనుభవించానని భరణి వివరించారు. త్రిక్రమ్ శ్రీనివాస్ సినిమాల విషయానికి వస్తే, డేట్ల సమస్యల వల్ల ప్రస్తుతం ఆయన చిత్రాల్లో నటించడం లేదని భరణి స్పష్టం చేశారు. త్రివిక్రమ్ ఒక అద్భుతమైన మేధావి అని, మిథునం సినిమా సమయంలో ఆయన తనకు మద్దతుగా నిలిచారని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us