
సూపర్ స్టార్ కృష్ణ, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో 1983లో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో ‘అడవి సింహాలు’ ఒకటి కాగా.. ఆ తర్వాత ఐదు నెలల వ్యవధిలో విడుదలైన ‘శక్తి’ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం వసూళ్లతో పాటు ప్రదర్శన పరంగానూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
అంతకుముందు ‘ఊరికి మొనగాడు’ చిత్రాన్ని నిర్మించిన అడుసుమిల్లి గోపాలకృష్ణ.. ‘శక్తి’ చిత్రాన్ని కూడా భారీ స్థాయిలో నిర్మించారు. ఈ సినిమాలో కృష్ణ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను అలరించారు. సీత పాత్రలో జయసుధ నటించగా.. కృష్ణ సరసన రాధ నటించిన తొలి చిత్రంగా ‘శక్తి’ నిలిచింది. ఈ సినిమాలో రాధ గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోగా.. కృష్ణ నటన, రాఘవేంద్రరావు దర్శకత్వం సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి.
1983 సెప్టెంబర్ 2న భారీ ఓపెనింగ్స్‌తో విడుదలైన ‘శక్తి’.. తొలి రోజుల్లోనే మంచి వసూళ్లను సాధించింది. ముఖ్యంగా విజయవాడలోని అప్సర థియేటర్‌లో ఈ సినిమా ప్రదర్శన సరికొత్త రికార్డును నెలకొల్పింది. తొలి నాలుగు వారాల పాటు హౌస్‌ఫుల్ ప్రదర్శనలతో రూ.2,72,963 వసూలు చేసి అప్పట్లో సంచలనం సృష్టించింది.
ఇక నెల్లూరులోని నర్తకీ థియేటర్‌లోనూ ‘శక్తి’ తన సత్తా చాటింది. తొలి వారంలోనే రూ.1,14,820 వసూలు చేసి ఆ ప్రాంతంలో అప్పటివరకు ఉన్న వసూళ్ల రికార్డులను తిరగరాసింది. ఈ స్థాయి వసూళ్లు సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణకు నిదర్శనంగా నిలిచాయి.
నెల్లూరు ఏరియా హక్కులను కొనుగోలు చేసిన నిర్మాత ఎం.ఎస్. రెడ్డికి ఈ సినిమా ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ‘శక్తి’ వంద రోజుల ప్రదర్శన పూర్తి చేసుకోవడంతో నెల్లూరులో ఘనంగా శతదినోత్సవ వేడుకలను నిర్వహించే అవకాశం ఆయనకు దక్కింది. సోలో హీరోగా కృష్ణ నటించిన ఓ సినిమా వంద రోజుల వేడుక నెల్లూరులో జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఇలా ‘శక్తి’ సినిమా కృష్ణ కెరీర్‌లో ఓ ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. అప్పటి థియేటర్లలో హౌస్‌ఫుల్ ప్రదర్శనలు, ప్రాంతాలవారీగా నమోదైన వసూళ్ల రికార్డులు, శతదినోత్సవ వేడుకలు.. ఈ చిత్ర విజయాన్ని చిరస్మరణీయం చేశాయి.