
టాలీవుడ్ హీరోయిన్ సంజన గల్రాని తన సినీ కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించి చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. చిన్నతనంలోనే సినీ రంగ ప్రవేశం చేసి, ఆర్థిక ఇబ్బందులు, అవకాశాలు కోల్పోతాననే భయంతో తాను తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, ఆ ప్రభావం గురించి ఆమె కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతం తన పాత సినిమాలను చూస్తే తనకే జాలి వేస్తుందని, ఈ అనుభవాల నుండి యువత గుణపాఠం నేర్చుకోవాలని ఆమె హితవు పలికారు. సంజన గల్రాని తన ప్రయాణాన్ని వివరిస్తూ, తాను ఒక చిన్న కుటుంబం నుండి వచ్చానని, ఒకే ఒక బెడ్‌రూమ్ ఇంట్లో నివసించేవారమని తెలిపారు. తన బిల్లులు చెల్లించాల్సిన అవసరం, తల్లిదండ్రులను, చెల్లిని చూసుకోవాల్సిన బాధ్యత అప్పట్లో తనపై ఉండేవని ఆమె గుర్తు చేసుకున్నారు. కేవలం 12 ఏళ్ల వయసులో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిశ్రమలోకి అడుగుపెట్టి, 16 ఏళ్లకే హీరోయిన్‌గా మారినప్పుడు, తనకు సరైన అవగాహన, మార్గదర్శకత్వం లేదని ఆమె అన్నారు. అవకాశాలు మళ్లీ దొరకవేమో, కెరీర్ ముగిసిపోతుందేమో, గ్యాప్ వస్తే ఎవరు పిలుస్తారో, పరిశ్రమ మర్చిపోతుందేమో అనే భయాలతో, కొన్నిసార్లు చిన్న డ్రెస్సులు వేసుకోవాల్సిన రోల్స్ లేదా మరీ మోడర్న్ పాత్రలు కూడా చేయాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
“నా సినిమాలు చూస్తే నాకు నా మీదే జాలి వేస్తుంది,” అని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. అప్పట్లో తన చేయి పట్టుకొని “ఇది వద్దు బిడ్డా, నీకు మంచి రోల్స్ రావు, ఇది బ్యాక్‌ఫైర్ అవుతుంది” అని చెప్పేవారు ఎవరూ లేకపోవడం తనను చాలా బాధించిందని అన్నారు. తన ముఖం బాగుంటుందని, ఫిజిక్ బాగుంటుందని, పర్ఫార్మెన్స్ బాగుంటుందని, కానీ అటువంటి పాత్రలు చేయడం వల్ల అవకాశాలు కోల్పోతావని చెప్పేవారు లేకపోవడం వల్లే తాను ఆ నిర్ణయాలు తీసుకున్నానని తెలిపారు. ప్రెస్ మీట్లలో తీసిన కొన్ని ఫోటోలు తనకు తెలియకుండానే వైరల్ అయ్యాయని, వాటిని తొలగించలేక నిస్సహాయంగా భావించానని ఆమె వివరించారు.
కొత్తగా సినీ పరిశ్రమలోకి వచ్చే యువతులకు, అమ్మాయిలకు సంజన చాలా కీలకమైన సలహాలు ఇచ్చారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, ప్రతి ప్రాజెక్ట్‌ను రెండుసార్లు తనిఖీ చేయాలని సూచించారు. “సేఫ్‌గా ఉండాలి ఫస్ట్. మీతో ఎవరైనా ఎప్పుడైనా షూట్‌లో ట్రావెల్ అవ్వాలి,” అని ఆమె భద్రతకు ప్రాధాన్యతనిచ్చారు. అంతేకాకుండా, విద్యను పూర్తి చేసుకోకుండా పరిశ్రమలోకి రావద్దని, ముఖ్యంగా 16, 17, 18, 19 సంవత్సరాల వయసులో అస్సలు రావద్దని ఆమె నొక్కి చెప్పారు. కనీసం డిగ్రీ పూర్తి చేసి, 25-26 సంవత్సరాల వయసు వచ్చే వరకు వేచి చూడమని ఆమె కోరారు. ఆ వయసులో వ్యక్తిగత పరిణతి, అనుభవం వస్తుందని, తమను తాము ఎలా హ్యాండిల్ చేసుకోవాలో తెలుస్తుందని ఆమె అన్నారు. 16 ఏళ్ల వయసులో అమ్మాయిలు చూడడానికి అమ్మాయిల్లా ఉన్నా, వారి మనసు ఇంకా పిల్లల్లానే ఉంటుందని, కెమెరా ముందు ఏం చేయాలో వారికే తెలియదని ఆమె అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: కేవలం నలుగురు మనుషులు.. ప్రతి సీన్ భయానకం.. ఈఓటీటీలో ఈ థ్రిల్లర్ మూవీ సంచలనం..
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ ఇద్దరూ హీరోలకు తల్లిగా అస్సలు నటించను.. సీనియర్ నటి శరణ్య..